నివురుగప్పిన నిప్పులా కన్నపుకుంట | Controversy dalith people entry in kannapukunta villAge temple entry | Sakshi
Sakshi News home page

నివురుగప్పిన నిప్పులా కన్నపుకుంట

Sep 25 2017 1:20 PM | Updated on Sep 26 2017 12:48 AM

డోన్‌ టౌన్‌ : మండల పరిధిలోని కన్నపుకుంట గ్రామంలో కులవివక్ష బుçసలు కొడుతోంది. ఐదు నెలల క్రితం గ్రామంలో జరిగిన చిన్నసంఘటనకు కొందరు రాజకీయ రంగు పులమడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయాందోళన గ్రామంలో నెలకొంది. ఒక వివాహ వేడుక సందర్భంగా దళిత యువకుడు గ్రామంలోని మద్దిలేటిస్వామి గుడి మెట్లెక్కి కొబ్బరికాయ కొట్టడంతో వివాదం మొదలైంది. ఇది తెలిసిన అగ్రవర్ణాల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు తప్పు చేశామని ఒప్పుకొని క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు. దీనికి దళితులు ససేమిరా అనడంతో చిన్న వివాదం చిలికి చిలికి గాలి వానలా మారి చివరికి పోలిస్‌ స్టేషన్‌ దాకా వెళ్లింది. పోలీసులు ఇరువర్గాల వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చారే కాని సమస్య పరిష్కరించలేదనే విమర్శలున్నాయి. దీంతో ఇరువర్గాల మధ్య విభేదాలు మరింత పెరిగాయి.   

పంతాలు – పట్టింపులు...
మోహరం, దసరా పండుగల సందర్భంగా గ్రామంలోని ఆలయాల్లోకి దళితులను రానివ్వమని అగ్రవర్ణాల వారు బహాటంగానే చెబుతున్నారు.  అనాదిగా గ్రామంలో అమలవుతున్న  అచారాలకు కట్టుబడి ఉండాల్సిందేనని అగ్ర వర్ణాల వారు వాదిస్తుండగా.. దేవున్ని మొక్కడం నేరమెలా అవుతుందని దళితులు ప్రశ్నిస్తున్నారు. గ్రామంలో తమ అధిపత్యాన్ని నిలుపుకునేందుకే కొందరు అధికారపార్టీ నాయకులు చిన్నసాకును ఆయుధంగా చేసుకొని అగ్రవర్ణాలను రెచ్చగొడుతున్నారని దళిత యువకులు మండిపడుతున్నారు. గతంలో  దళితులపై దాడిచేసిన సంఘటనలో గ్రామంలో కొందరికి కోర్టుల్లో శిక్షలు పడిన సంగతిని దళితులు గుర్తుచేస్తున్నారు. ఇలా ఇరువర్గాల వారు పంతాలు, పట్టింపులకు పోతుండడంతో ఎప్పుడు ఏం జరుగుతోందోననే భయాందోళనను గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు.  

బహిష్కరణల పర్వం...
తమను దేవాలయాల్లోకి రానివ్వనందుకు నిరసనగా దళితులు అగ్రవర్ణాల్లో మృతిచెందిన  వారి అంతిమ సంస్కారాలకు శ్మశానంలో గోతులు తవ్వడం మానేశారు. ఐదు నెలల నుంచి  ముగ్గురు మృతిచెందినా దళితులు సహాయనిరాకరణతో అగ్రవర్ణాల వారే స్వయంగా శ్మశానంలో గోతులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement