రక్షక భటుడు.. దోపిడీ ముఠాకు సలహాదారుడు | Constable arrested of plotting to Steal In Train | Sakshi
Sakshi News home page

రక్షక భటుడు.. దోపిడీ ముఠాకు సలహాదారుడు

Jul 21 2019 10:15 AM | Updated on Jul 21 2019 10:15 AM

Constable arrested of plotting to Steal In Train - Sakshi

కానిస్టేబుల్‌ సుబ్బరాయుడు  

సాక్షి, ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్‌ సుబ్బరాయుడును రేణిగుంట రైల్వే పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన మేరకు గత నెల 11న చిత్తూరు జిల్లా పాకాల సమీపంలో జయంతి ఎక్స్‌ప్రెస్‌ రైలులో దొంగలముఠా వ్యాపారి ముకుందరాజన్‌ వద్ద నుంచి 1080 గ్రాముల బంగారు నగలను దోచుకొని వెళ్లారు.

ప్రొద్దుటూరుకు చెందిన బంగారు నగల వ్యాపారి నక్కా రాజశేఖర్, యర్రగుంట్లకు చెందిన ప్రింటింగ్‌ ప్రెస్‌ యజమాని ప్రసాద్, మైలవరం మండలం, నక్కోనిపల్లె గ్రామానికి చెందిన ఆర్మీ ఉద్యోగి పుల్లారెడ్డిలు కలిసి పోలీసుల వేషధారణలో వెళ్లి వ్యాపారి వద్ద నుంచి బంగారు నగలను దోచుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 16న ముగ్గురు నిందితులను రేణిగుంట రైల్వే పోలీసులు అరెస్ట్‌ చేసి, బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు.  కానిస్టేబుల్‌ సుబ్బరాయుడు చోరీ చేయడంలో వీరికి సహకరించాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో అతనిపై కేసు నమోదు చేశారు. 

రెండు నెలల క్రితం కోయంబత్తూరులో రెక్కీ
కోయంబత్తూరుకు చెందిన బంగారు వ్యాపారి ముకుందరాజన్‌ తరచూ బంగారు నగలు తీసుకొని వ్యాపారనిమిత్తం ప్రొద్దుటూరుకు వస్తుంటాడు. అప్పుల పాలైన బంగారు వ్యాపారి నక్కా రాజశేఖర్‌ ఎలాగైనా అక్రమంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. అతని స్నేహితులైన ఆర్మీలో సిపాయిగా ఉంటూ ఇటీవల సెలవుపై వచ్చిన పుల్లారెడ్డి, ప్రొద్దుటూరులో ప్రింటింగ్‌ ప్రెస్‌ నిర్వహిస్తున్న  ప్రసాద్‌లు కలిసి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. చోరీ ఎలా చేయాలనే విషయంలో కానిస్టేబుల్‌ సుబ్బరాయుడు వీరికి సలహా ఇచ్చాడు. ఈ క్రమంలో ముకుందరాజన్‌ను టార్గెట్‌ చేశారు. అతను ప్రొద్దుటూరుకు తీసుకొని వస్తున్న బంగారు నగలను ఎలాగైనా  కొట్టేయాలని స్కెచ్‌ గీశారు.  ఇందులో భాగంగానే రెండు నెలల క్రితం ఏ 1 నిందితుడైన నక్కా రాజశేఖర్‌తో కలిసి కానిస్టేబుల్‌ సుబ్బరాయుడు కోయంబత్తూరు వెళ్లి రెక్కీ నిర్వహించాడు. రైల్వే స్టేషన్‌లో ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయో గుర్తించాడు.

తర్వాత  వారికి సలహాలు ఇచ్చాడు. సీసీ కెమెరాలకు చిక్కకుండా రైలు ఎక్కాలని, సెల్‌ఫోన్‌లు అస్సలు ఉపయోగించరాదని వారికి సూచనలు ఇచ్చాడు. యూనిఫాం ఎలా వేసుకోవాలి, బంగారు వ్యాపారిని బెదిరించి ఎలా బంగారు నగలను తీసుకెళ్లాలో ట్రైనింగ్‌ ఇచ్చాడు. ఆ తర్వాత గత నెల 11న తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరుకు చెందిన నగల వ్యాపారి ముకుందరాజన్‌ వ్యాపార నిమిత్తం బంగారు నగలతో జయంతి ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రొద్దుటూరుకు వస్తున్నట్లు నిందితులు గుర్తించారు. రైలు పాకాల వద్దకు చేరుకోగానే ముగ్గురు నిందితులు ముకుందరాజన్‌ వద్ద నుంచి బంగారు నగలను దోచుకొని వెళ్లారు. వారికి సహకరించడనే కారణంతో కానిస్టేబుల్‌ సుబ్బరాయుడును శుక్రవారం రాత్రి రేణిగుంట జీఆర్‌పీ సీఐ అశోక్‌కుమార్, ఎస్‌ఐలు ప్రవీణ్‌కుమార్, అనిల్‌కుమార్‌లు అరెస్ట్‌ చేసి, శనివారం రిమాండుకు పంపించారు.

చోరీ జరిగిన మరుసటి రోజు కానిస్టేబుల్‌ సుబ్బరాయుడు ప్రధాన నిందితుడైన నక్కా రాజశేఖర్‌తో కలిసి రేణిగుంట నుంచి విమానంలో హైదరాబాద్‌కు వెళ్లినట్లు సీఐ తెలిపారు. హైదరాబాద్‌లో విలాసవంతంగా గడిపిన కానిస్టేబుల్‌ తిరిగి విమానంలో కడపకు వెళ్లాడన్నారు. సుబ్బరాయుడు ప్రొద్దుటూరులోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో పని చేస్తున్నాడు. కాగా ఈ కేసులో ఇంకా ఎవరి పాత్రయినా ఉందా అనే కోణంలో రేణిగుంటతో పాటు ప్రొద్దుటూరు పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement