ఐటీ దాడులపై నోరువిప్పని చంద్రబాబు

Chandrababu is not Responded on IT attacks - Sakshi

వాటి గురించి నోరెత్తకుండా ఇతర అంశాలపై ట్వీట్లు 

లైవ్‌ మింట్‌ ఆంగ్ల పత్రిక సంప్రదించినా స్పందించని వైనం 

ఐటీ వల నుంచి ఎలా తప్పించుకోవాలోనని మల్లగుల్లాలు 

మీడియాకు మొహం చాటేసిన టీడీపీ అధినేత 

భవిష్యత్‌ పర్యవసానాలపై సన్నిహితులతో మంతనాలు

సాక్షి, అమరావతి : తనకు సంబంధించిన రూ.2వేల కోట్ల లావాదేవీల విషయం ఐటీ దాడుల్లో వెలుగుచూసినా చంద్రబాబు మాత్రం నోరు విప్పడంలేదు. తన దగ్గర పీఏగా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్‌ ఇంట్లో జరిపిన దాడుల్లో ఈ అక్రమ లావాదేవీలను గుర్తించినట్లు ఐటీ శాఖ ప్రకటించిన దగ్గర నుంచి ఆయన మీడియాకు మొహం చాటేశారు. శ్రీనివాస్‌తోపాటు తన కుమారుడు లోకేష్‌ బినామీ కిలారు రాజేష్, మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్, వైఎస్సార్‌ కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి కంపెనీలపై దాడులు చేసినట్లు ఐటీ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ దాడులు జరుగుతున్న సమయంలోనూ చంద్రబాబు స్పందించలేదు. ఐటీ శాఖ ప్రకటన విడుదల చేసిన తర్వాత టీడీపీ నేతలు కొందరు ఆ దాడులతో తమకు సంబంధంలేదని బుకాయించేందుకు ప్రయత్నించినా ప్రజల్లో మాత్రం అవి చంద్రబాబు డబ్బులేననే చర్చ విస్తృతంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ చంద్రబాబు వాటి గురించి వివరణ ఇవ్వకపోగా ఎవరికీ అందుబాటులో లేకుండా హైదరాబాద్‌ వెళ్లిపోయారు. పైగా అవేమీ తెలియనట్లు చంద్రబాబు శనివారం ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ట్వీట్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది. 

‘లైవ్‌ మింట్‌’కు స్పందించని బాబు
ఐటీ దాడుల్లో గుర్తించిన అక్రమ లావాదేవీలపై శనివారం కథనం రాసిన లైవ్‌ మింట్‌ ఆంగ్ల పత్రిక చంద్రబాబును పలుమార్లు ఫోన్‌చేసి సంప్రదించినా ఆయన స్పందించలేదు. ఇదే విషయాన్ని మింట్‌ తన వెబ్‌సైట్‌లో ఉన్న కథనంలో పేర్కొంది. రెండు వేల కోట్లతో సంబంధం ఉందా లేదా అనే విషయాన్ని అడిగేందుకు చంద్రబాబు కోసం ఫోన్లో  ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదని తెలిపింది. అంతేకాక.. ఆయనకు ఈ–మెయిల్‌ పంపినా జవాబు రాలేదని ఆ కథనంలో పత్రిక ప్రస్తావించింది. దీన్నిబట్టి చంద్రబాబు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నట్లు అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, హైదరాబాద్‌లో ఉన్న చంద్రబాబు.. ఐటీ దాడులు, పర్యవసానాలపై మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఐటీ శాఖ ప్రకటన తర్వాత ఏం జరుగుతుంది, దీని నుంచి ఎలా తప్పించుకోవాలి, అందుకు ఉన్న మార్గాలపై తన సన్నిహితులు, న్యాయవాదులతో చర్చిస్తున్నట్లు టీడీపీ వర్గాల ద్వారా తెలిసింది. 

ఆర్వీఆర్‌ ప్రాజెక్ట్స్‌లోకి నల్లధనం..
రాష్ట్రంలో 2014 నుంచి 2019 మధ్య తాను అధికారంలో ఉన్నప్పుడు పనులు కట్టబెట్టిన కాంట్రాక్టు సంస్థల నుంచి కమీషన్లు వసూలు చేసుకోవడానికి చంద్రబాబు బోగస్‌ సబ్‌ కాంట్రాక్టు సంస్థలను ఏర్పాటు చేయించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్రాలుగా పనిచేసే మూడు ప్రధాన కాంట్రాక్టు సంస్థలపై ఈనెల 6 నుంచి 10 వరకూ నిర్వహించిన దాడుల్లో రూ.రెండు వేల కోట్లకు పైగా నల్లధనం రాకెట్‌ బయటపడిందని గురువారం ఐటీ శాఖ ప్రకటించింది. ఈ నల్లధనాన్ని హవాలా వ్యాపారి హసన్‌ అలీ ద్వారా సింగపూర్‌కు తరలించి.. అక్కడి నుంచి తన సన్నిహితుడుకి చెందిన ఆర్వీఆర్‌ ప్రాజెక్ట్సులోకి విదేశీ పెట్టుబడుల రూపంలో చంద్రబాబు రప్పించారు.

ఆర్వీఆర్‌ ప్రాజెక్ట్సు నుంచి బోగస్‌ సబ్‌ కాంట్రాక్టు సంస్థలకు మళ్లించి.. ఆ ధనాన్ని తన ఖజానాలో చంద్రబాబు జమ చేసుకున్నారు. కాగా, శనివారం ‘ఆంధ్రా అనకొండ’ శీర్షికన ‘సాక్షి’ ప్రచురించిన కథనంలో సింగపూర్‌ నుంచి విదేశీ పెట్టుబడుల రూపంలో ఆర్వీఆర్‌ ప్రాజెక్ట్సులోకి నల్లధనాన్ని చంద్రబాబు రప్పించారని కాకుండా ఆర్వీఆర్‌ ఇన్‌ఫ్రాలోకి వచ్చినట్లు తప్పుగా ప్రచురితమైంది. ఆ కథనంలో ఆర్వీఆర్‌ ఇన్‌ఫ్రా బదులుగా ఆర్వీఆర్‌ ప్రాజెక్ట్స్‌గా చదువుకోగలరు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top