దేశవ్యాప్తంగా 50 చోట్ల సీబీఐ సోదాలు

CBI crackdown on loan defaulters - Sakshi

న్యూఢిల్లీ: రూ.1,139 కోట్ల మేర బ్యాంకులను మోసం చేసిన కేసులో సీబీఐ భారీ డ్రైవ్‌ చేపట్టింది. మంగళవారం దేశవ్యాప్తంగా ఏకకాలంలో 12 రాష్ట్రాల్లోని 18 నగరాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 61 చోట్ల సోదాలు చేపట్టింది. ఎస్‌బీఐ, సెంట్రల్‌ బ్యాంక్, కార్పొరేషన్‌ బ్యాంక్, యూనియన్‌ బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తదితర బ్యాంకులు చేసిన ఫిర్యాదుల మేరకు నమోదైన 17 కేసులకు సంబంధించిన వివిధ వాణిజ్య సంస్థల డైరెక్టర్లు, ప్రమోటర్లకు చెందిన ఇళ్లు, సంస్థలపై దాడులు జరిగాయి. పరారైన వజ్రాల వ్యాపారి జతిన్‌కి చెందిన ముంబైలోని విన్‌సమ్‌ గ్రూప్, తాయల్‌ గ్రూప్‌నకు చెందిన ఎస్కే నిట్, ఢిల్లీ కేంద్రంగా పనిచేసే నఫ్తోగజ్, ఎస్‌ఎల్‌ కన్జ్యూమర్, పంజాబ్‌లోని ఇంటర్నేషనల్‌ మెగా ఫుడ్‌పార్క్, సుప్రీం టెక్స్‌ మార్ట్‌ తదితరాలు లక్ష్యంగా సోదాలు చేపట్టినట్లు సీబీఐ తెలిపింది. 

గృహ రుణాల మంజూరులో అవకతవకలకు పాల్పడిన భువనేశ్వర్‌లోని యూనియన్‌ బ్యాంక్‌ శాఖ అధికారులపై మూడు కేసులు నమోదు చేసినట్లు సీబీఐ తెలిపింది. ఢిల్లీ, ముంబై, థానే, లూ«థియానా, వల్సాద్, పుణే, గయ, గుర్గావ్, చండీగఢ్, భోపాల్, సూరత్, కోలార్‌ తదితర నగరాల్లో చేపట్టిన ఈ సోదాల్లో 300 మంది అధికారులు పాల్గొన్నారని తెలిపింది. సీబీఐ డైరెక్టర్‌ రిషి కుమార్‌ శుక్లా నేతృత్వంలో చేపట్టిన తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయని సీబీఐ పేర్కొంది. రూ.640 కోట్ల మేర మోసం జరిగి ఉంటుందని అంచనా వేసిన అధికారులు సోదాల తర్వాత ఈ మొత్తం రూ.1,139 కోట్ల వరకు ఉంటుందని తేల్చారు. ఈ మేరకు జితిన్‌ మెహతాపై 16వ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఎగ్జిమ్‌ బ్యాంకును రూ.202 కోట్ల మేర మోసం చేసినట్లు ఇతనిపై ఇప్పటికే పలు కేసులున్నాయి. భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న ముంబైలోనూ అధికారులు సోదాలు కొనసాగించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top