చిదంబరం ఇంట్లో భారీ చోరీ! | Cash, jewels stolen from Chidambaram's house | Sakshi
Sakshi News home page

చిదంబరం ఇంట్లో భారీ చోరీ!

Jul 9 2018 2:14 AM | Updated on Mar 18 2019 7:55 PM

Cash, jewels stolen from Chidambaram's house  - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం ఇంట్లో భారీ చోరీ జరిగినట్లు తెలిసింది. కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు, నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్లు వార్తలొచ్చాయి. ఈ కేసులో ఇద్దరు పనిమనుషులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. దొంగతనం జరిగిందని తొలుత చేసిన ఫిర్యాదును చిదంబరం భార్య నళిని చిదంబరం ఆదివారం రాత్రి వెనక్కి తీసుకోవడం గమనార్హం. తమ నివాసంలో ఎలాంటి దొంగతనం జరగలేదన్నారు.

మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం...చెన్నై నుంగంబాక్కం ఫైవ్‌క్రాఫ్ట్స్‌ రోడ్డులోని ఇంట్లో చిదంబరం, భార్య నళిని, కొడుకు కార్తీ, కోడలు శ్రీనిధి నివసిస్తున్నారు. ఓ కార్యక్రమానికి వెళ్లడానికి ముందు నగలు అలంకరించుకునేందుకు నళిని శనివారం తన గదిలోని బీరువా తెరచిచూడగా అందులో పెట్టిన పురాతన మరకతాలు, బంగారు ఆభరణాలు, నగదు కనిపించలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేయగా, వారు ఇంటి ప్రాంగణంలో అమర్చిన సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. సుమారు నెల క్రితం ఇద్దరు మహిళలు ముఖాలకు ముసుగేసుకుని నళిని గదిలోకి వెళ్లడం, కొద్దిసేపటి తరువాత ఒక సంచితో బయటకు వచ్చిన దృశ్యాలు అందులో నమోదయ్యాయి. వాటిలోని వ్యక్తుల రూపురేఖల ఆధారంగా, చిదంబరం ఇంట్లో పనిచేస్తున్న వెన్నెల, విజిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement