
సాక్షి, అనకాపల్లి : విశాఖ జిల్లా అనకాపల్లి మండలం మామిడిపాలెం జంక్షన్‌లో శుక్రవారం ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. మద్యం మత్తులో స్నేహితులు కత్తితో17 చోట్ల పొడిచి హతమార్చారు. ఇదే ఘర్షణలో తీవ్రంగా గాయపడి అనకాపల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు గోవాడ గిరిబాబు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అనకాపల్లి మండలానికి చెందిన పండు, లచ్చతో పాటు మరో వ్యక్తి, దర్జీనగర్‌కు చెందిన లాలం పరమేశ్ (28), గిరిబాబులు మామిడిపాలెం జంక్షన్‌లోని మద్యం దుకాణానికి వెళ్లారు.
బీరు తెచ్చే విషయమై పరమేశ్, పండుల మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. చివరకు పండు తన స్నేహితులు లచ్చ, మరో వ్యక్తి సహకారంతో పరమేశ్‌ను కత్తితో పొడిచాడు. 17 కత్తిపోట్లకు గురైన పరమేశ్ తీవ్ర రక్త స్రావంతో నడిరోడ్డుపై అక్కడికక్కడే మృతి చెందాడు. పరమేశ్‌ను కాపాడేందుకు ప్రయత్నించిన గిరిబాబుపై కూడా దాడి చేశారు. అతని చెవి, ఛాతిపైన గాయాలయ్యాయి. గిరిబాబు అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ వెంకటరమణ పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షలు కూడా హత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.