ఇంట్లో చెప్తే తిడతారని.... | The boy died with a dog byte | Sakshi
Sakshi News home page

కుక్కకాటుతో బాలుడి మృతి 

Apr 26 2018 1:27 PM | Updated on Jul 12 2019 3:02 PM

The boy died with a dog byte - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఇచ్ఛాపురం : మున్సిపాలిటి పరిధిలోని రత్తకన్న గ్రామానికి చెందిన బాలుడు జగన్‌(12) కుక్క కాటుకు గురై మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. రత్తకన్న గ్రామంలోని తోటవీధికి చెందిన వ్యవసాయ కూలీలు లెంక జగ్గారావు, జేజమ్మలకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు జగన్‌ స్థానిక మున్సిపల్‌ పాఠశాలలో 7వ తరగతి చదువుతూ 17 రోజుల క్రితం కుక్క కాటుకు గురయ్యాడు. ఇంట్లో చెబితే తల్లిదండ్రులు మందలిస్తారని భయపడి కుక్క కరిచిన విషయం చెప్పలేదు.

శరీరం నొప్పిగా ఉందని జగన్‌ తల్లిదండ్రులకు చెబుతూ మంగళవారం హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటనే బాలుడిని స్థానిక ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా అక్కడి నుంచి విశాఖపట్నం రిఫర్‌ చేశారు. అక్కడి వైద్యులు పరీక్షలు జరిపి ర్యాబిస్‌ వ్యాధి సోకిందని గుర్తించారు. పరిస్థితి విషమంగా మారడంతో కొద్దిగంటల్లోనే చనిపోతాడని చెప్పడంతో చేసేదేమీలేక ఇంటికి తీసుకువస్తుండగా టెక్కలి సమీపంలో మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జగన్‌ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement