ఫోక్స్‌వ్యాగన్‌పై 18 బిలియన్ డాలర్ల జరిమానా! | Volkswagen fine of 18 billion dollars! | Sakshi
Sakshi News home page

ఫోక్స్‌వ్యాగన్‌పై 18 బిలియన్ డాలర్ల జరిమానా!

Sep 22 2015 1:54 AM | Updated on Aug 16 2018 4:36 PM

ఫోక్స్‌వ్యాగన్‌పై 18 బిలియన్ డాలర్ల జరిమానా! - Sakshi

ఫోక్స్‌వ్యాగన్‌పై 18 బిలియన్ డాలర్ల జరిమానా!

జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్... తాజాగా కార్ల తయారీలో కాలుష్యకారక వాయువుల ప్రమాణాలను ఉల్లంఘించిన కేసులో చిక్కుకుంది...

- కాలుష్యకారక ప్రమాణాల ఉల్లంఘన కేసు
బెర్లిన్:
జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్... తాజాగా కార్ల తయారీలో కాలుష్యకారక వాయువుల ప్రమాణాలను ఉల్లంఘించిన కేసులో చిక్కుకుంది. తమ కార్ల నుంచి వెలువడే కాలుష్యకారక వాయువులు (ఎమిషన్) నిర్దేశిత ప్రమాణాలను మించి ఉన్నాయని ఫోక్స్‌వ్యాగన్ యాజమాన్యం కూడా అంగీకరించింది. దీంతో లోపాలున్న దాదాపు అయిదు లక్షల కార్లను రీకాల్ చేయాలంటూ, సొంత ఖర్చులతో సరిచేసి ఇవ్వాలని అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ (ఈపీఏ).. కంపెనీని ఆదేశించింది. దీనితో పాటు కారు ఒక్కింటికి సుమారు 37,500 డాలర్ల చొప్పున..  ఈపీఏ విధించే జరిమానా పరిమాణం దాదాపు 18 బిలియన్ డాలర్ల పైగానే ఉండొచ్చని భావిస్తున్నారు. అలాగే సంస్థ ఉద్యోగులపై క్రిమినల్ కేసులు కూడా దాఖలు కానున్నాయి.
 
షేరు పతనం: ఎమిషన్ టెస్టులను రిగ్గింగ్ చేసిందన్న వార్తల దరిమిలా జర్మనీ సూచీల్లో ఫోక్స్‌వ్యాగన్ షేరు 21 శాతం మేర పతనమైంది. మూడేళ్ల కనిష్టం 127 యూరోలకు పడిపోయింది. దీంతో సంస్థ మార్కెట్ విలువ ఏకంగా 17 బిలియన్ డాలర్ల మేర తుడిచిపెట్టుకుపోయింది.

సాఫ్ట్‌వేర్ మోసపుచ్చిందిలా: కాలుష్యకారక వాయువుల విషయంలో నియంత్రణ సంస్థలను మోసపుచ్చేందుకు ఫోక్స్‌వ్యాగన్ ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ఉపయోగించినట్లు ఈపీఏ పేర్కొంది. ఈ సాఫ్ట్‌వేర్.. అధికారిక పరీక్షల సమయంలో కాలుష్యకారక వాయువులను నియంత్రించి, ప్రమాణాలకు లోబడే ఉండేట్లు చూసేదని వివరించింది. సాధారణ పరిస్థితుల్లో మాత్రం నియంత్రణను సాఫ్ట్‌వేర్ తొలగించేసేదని, ఫలితంగా కంపెనీ కార్ల నుంచి ప్రమాణాలకు మించి వాయువులు విడుదలయ్యేవని ఈపీఏ తెలిపింది. కాగా కస్టమర్ల నమ్మకాన్ని దెబ్బతీసినందుకు వ్యక్తిగతంగా క్షమాపణలు కోరుతున్నట్లు కంపెనీ సీఈవో మార్టిన్ వింటర్‌కోర్న్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement