టాటా ‘ప్రైవేటు’కు ఓకే! | Tata Sons' shareholders vote to become a private company | Sakshi
Sakshi News home page

టాటా ‘ప్రైవేటు’కు ఓకే!

Sep 22 2017 12:20 AM | Updated on Sep 22 2017 10:02 AM

టాటా ‘ప్రైవేటు’కు ఓకే!

టాటా ‘ప్రైవేటు’కు ఓకే!

టాటా గ్రూప్‌ కంపెనీల హోల్డింగ్‌ సంస్థ అయిన టాటా సన్స్‌ ఇకపై ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీగా మారనుంది.

ఏజీఎంలో వాటాదారుల ఆమోదం...  
ముంబై:
టాటా గ్రూప్‌ కంపెనీల హోల్డింగ్‌ సంస్థ అయిన టాటా సన్స్‌ ఇకపై ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీగా మారనుంది. ప్రస్తుతం ఉన్న పబ్లిక్‌ లిమిటెడ్‌ నుంచి ప్రైవేట్‌ లిమిటెడ్‌కు మారేందుకు ఆమోదముద్ర లభించింది. గురువారం ఇక్కడ జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లో ఈ ప్రతిపాదనకు సంబంధించిన ప్రత్యేక తీర్మానాలకు మెజారిటీ వాటాదారులు ఓకే చెప్పినట్లు టాటా సన్స్‌ వర్గాలు పేర్కొన్నాయి.

కాగా, టాటా సన్స్‌లో 18.4 శాతం వాటా ఉన్న సైరస్‌ మిస్త్రీ కుటుంబం ఈ మార్పు ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఇది మైనారిటీ వాటాదారుల ప్రయోజనాలను అణిచివేయడమేమని, ఏజీఎంలో దీనికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని కూడా పేర్కొంది. ఈ చర్యలు టాటా సన్స్‌కు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చవని.. ఇదంతా కుట్రపూరితమని పేర్కొంటూ సంస్థ డైరెక్టర్ల బోర్డుకు సైరస్‌ మిస్త్రీ లేఖ కూడా రాశారు.

మిస్త్రీని టాటా గ్రూప్‌ చైర్మన్‌ పదవి నుంచి అర్ధంతరంగా తొలగించడంతో టాటాలతో ఆయన న్యాయపోరాటం కొనసాగిస్తున్నారు. మిస్త్రీపై వేటు తర్వాత టాటా సన్స్‌ చైర్మన్‌గా నమ్మకస్తుడైన ఎన్‌.చంద్రశేఖరన్‌ను నియమించారు. మిస్త్రీకి గ్రూప్‌తో సంబంధాలను పూర్తిగా తెంచేయడంతోపాటు భవిష్యత్తులో కూడా గ్రూప్‌ వ్యవహారాల్లో వేలుపెట్టకుండా టాటాలు వేగంగా పావులు కదిపారు. ఇప్పుడు హోల్డింగ్‌ సంస్థను పబ్లిక్‌ నుంచి ప్రైవేట్‌ లిమిటెడ్‌గా మార్చడం వల్ల మిస్త్రీ కుటుంబం టాటా సన్స్‌లో తమ వాటాలను ఇష్టానుసారంగా బయటివాళ్లకు (ఇన్వెస్టర్లకు) అమ్ముకోవడానికి వీలుండదు. అదే పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీలో అయితే, వాటాదారులు తమ వాటాను ఎవరికైనా అమ్ముకునే అవకాశం ఉంటుంది. టాటా సన్స్‌లో టాటా ట్రస్ట్‌లకు ఇప్పుడు 66 శాతం వాటా ఉంది. ప్రధానమైన ట్రస్టులకు రతన్‌ టాటాయే నేతృత్వం వహిస్తుండటం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement