150 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్‌

Sensex gains 150 points, Nifty tests 10,800 - Sakshi

10800 స్థాయిని పరీక్షిస్తున్న నిఫ్టీ

బ్యాంకింగ్‌, ఆర్థిక రంగాలకు కొనుగోళ్ల మద్దతు

ఐటీ, మీడియా షేర్లలో అమ్మకాల ఒత్తిడి

దేశీయ ఈక్విటీ మార్కెట్‌ శుక్రవారం లాభ‍‍ంతో మొదలైంది.  సెన్సెక్స్‌ 157 పాయింట్ల లాభంతో 36629 వద్ద  నిఫ్టీ 46  పాయింట్లు పెరిగి 10786 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.  ఐటీ, మీడియా తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. అత్యధికంగా ఆర్థిక రంగ షేర్లు లాభపడుతున్నాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు నెలకొన్నప్పటికీ.., మన మార్కెట్లో నెలకొన్న బలమైన సెంటిమెంట్‌ సూచీలను లాభాల వైపు నడిపిస్తోంది. ప్రపంచమార్కెట్లో క్రూడాయిల్‌ స్థిరమైన ట్రేడింగ్‌ను కూడా కొంత కలిసొచ్చిందని చెప్పవచ్చు. 

అయితే దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 10,04,806కి చేరగా.. మరణాలు 25,609గా నమోదయ్యాయి. అలాగే హెచ్‌సీఎల్‌ టెక్‌, బ్రిటానియా, హాత్‌వే కేబుల్‌, గ్రాన్యూల్స్‌ ఇండియా, ఐసీఐసీ లాంబార్డ్‌తో సహా 32 కంపెనీలు నేడు తమ ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉంది. వీటికి తోడు ఇంట్రాడేలో రూపాయి కదలికలు, స్టాక్‌ నిర్దేశిత ట్రేడింగ్‌ మార్కెట్‌ను ప్రభావితం చేయగలదు. 

అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు
గతవారానికి సంబంధించిన నిరుద్యోగ గణాంకాలు మార్కెట్‌ వర్గాలను నిరుత్సాహరపచడంతో పాటు టెక్నాలజీ షేర్ల అమ్మకాలతో గురువారం రాత్రి అమెరికా మార్కెట్లు అరశాతం నష్టంతో ముగిశాయి. డో జోన్‌ ఇండెక్స్‌ అరశాతం, ఎస్‌అండ్‌పీ ఇండెక్స్‌ 0.35శాతం, నాస్‌డాక్‌ ఇండెక్స్‌ 0.75శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి. యూరప్‌ మార్కెట్లు 0.50 శాతం స్థాయిలో బలహీనపడ్డాయి. 

ఆసియాలో అగ్రరాజ్యమైన చైనా 2020 రెండవ త్రైమాసికం ఏప్రిల్‌-జూన్‌ మధ్య ఆర్థిక వ్యవస్థ 3.2శాతం వృద్ధి రేటును నమోదు చేసుకోవడం ఆసియా మార్కెట్‌లో సెంటిమెంట్‌ బలపడింది. ఫలితంగా  నేడు ఆసియాలో మార్కెట్లు ఒక్క ఇండోనేషియా ఇండెక్స్‌ తప్ప మిగిలిన అన్ని దేశాలకు చెందిన సూచీలు అరశాతం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా తైవాన్‌ ఇండెక్స్‌ 1శాతం లాభపడింది. 

హెచ్‌డీఎఫ్‌సీ, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, టాటాస్టీల్‌, బ్రిటానియా, బీపీసీఎల్‌ షేర్లు 1శాతం నుంచి 2.50శాతం లాభపడ్డాయి. టైటాన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, కోటక్‌ బ్యాంక్‌, జీ లిమిటెడ్‌, విప్రో షేర్లు అరశాతం నుంచి 1.50శాతం నష్టపోయాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top