పీఎన్‌బీ లాభం నాలుగింతలు | Punjab National Bank Q3 net profit surges; bad loans stable | Sakshi
Sakshi News home page

పీఎన్‌బీ లాభం నాలుగింతలు

Feb 8 2017 12:41 AM | Updated on Sep 5 2017 3:09 AM

పీఎన్‌బీ లాభం నాలుగింతలు

పీఎన్‌బీ లాభం నాలుగింతలు

ప్రభుత్వ రంగ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో నాలుగు రెట్లు పెరిగింది.

క్యూ3లో రూ. 207 కోట్లు...
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో నాలుగు రెట్లు పెరిగింది. గత క్యూ3లో రూ.51 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.207 కోట్లకు ఎగసిందని బ్యాంక్‌ తెలియజేసింది. ట్రెజరీ ఆదాయం పెరగడం, డిపాజిట్ల వ్యయం తగ్గడం, మొండి బకాయిల వసూళ్ల కారణంగా ఈ స్థాయి నికర లాభం వచ్చిందని బ్యాంక్‌ ఎండీ ఉషా అనంత సుబ్రహ్మణ్యం చెప్పారు. అయితే రుణ నాణ్యత తగ్గిందని పేర్కొన్నారు.

గత క్యూ3లో రూ.8.47గా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో 13.70%కి, అలాగే 5.86%గా ఉన్న నికర మొండి బకాయిలు 9.09%కి పెరిగాయి. మొత్తం ఆదాయం రూ.13,891 కోట్ల నుంచి 4% పెరిగి రూ.14,498 కోట్లకు పెరిగింది. ఫీజు ఆదాయంతో కలుపుకొని ఇతర ఆదాయం రూ.1,671 కోట్ల నుంచి 50% వృద్ధితో రూ.2,513 కోట్లకు పెరిగిందన్నారు. అయితే నికర వడ్డీ ఆదాయం 9% తగ్గి రూ.3,731 కోట్లకు చేరిందని ఉష తెలిపారు.

మొండి బకాయిల వసూళ్లపై దృష్టి..
రుణాలు పెరగకగపోవడం వల్లే మొండి బకాయిలు పెరిగాయని, అంతేకానీ, పెద్ద కరెన్సీ నోట్ల రద్దు వల్ల కాదని ఉషా వివరించారు. గత క్యూ3లో రూ.2,867 కోట్లుగా ఉన్న కేటాయింపులు స్వల్పంగా పెరిగి రూ.2,947 కోట్లకు చేరాయని తెలిపారు. రుణాలు పెంచడం, మొండి బకాయిల వసూళ్లపై దృష్టి సారించనున్నామని పేర్కొన్నారు. సరైన సమయం, అవకాశం వచ్చినప్పుడు అనుబంధ కంపెనీల్లో వాటా వాటా విక్రయిస్తామని వివరించారు. 

ఆర్థిక ఫలితాల నేపథ్యంలో పీఎన్‌బీ షేర్‌ ధర బీఎస్‌ఈలో 1.4% లాభపడి రూ.152 వద్ద ముగిసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement