ఎయిర్‌లైన్స్‌కు ప్రభుత్వ విధానాల భారం

It's Hard for Airlines to Make Money in India, IATA Says - Sakshi

పెరిగిపోతున్న వ్యయాలు

మౌలిక సదుపాయాల కొరతతో పరిమిత వృద్ధి

ఐఏటీఏ చీఫ్‌ అలెగ్జాండర్‌ జునియాక్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వ విధానాలు భారత్‌లో విమానయాన సంస్థలపై వ్యయాల భారాన్ని మోపుతున్నాయని ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ (ఐఏటీఏ) చీఫ్‌ అలెగ్జాండర్‌ డె జునియాక్‌ వ్యాఖ్యానించారు. ఇక మౌలిక సదుపాయాలపరమైన అంశాలు వల్ల కూడా విమానయాన రంగ వృద్ధి ఒక మోస్తరు స్థాయికే పరిమితమవుతోందని మంగళవారం అంతర్జాతీయ విమానయాన సదస్సులో పాల్గొన్న సందర్భంగా పేర్కొన్నారు. విమాన ఇంధన ధరలు భారీగా పెరగడం, రూపాయి రికార్డు స్థాయిలో పతనమవుతుండటంతో ఎయిర్‌లైన్స్‌ లాభాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని తెలిపారు.

‘జెట్‌ ఇంధనం, ఇన్‌ఫ్రాపరమైన సమస్యలను సమగ్రంగా పరిష్కరించుకోగలిగితే ఏవియేషన్‌ రంగంలో భారత్‌ దూసుకెళ్లగలదు‘ అని అలెగ్జాండర్‌ చెప్పారు. అంతర్జాతీయంగా అన్ని విమానయాన సంస్థలూ ఇంధన ధరల పెరుగుదలతో ఇబ్బందిపడుతున్నప్పటికీ.. భారత్‌లో మాత్రం నియంత్రణపరమైన, ఇంధనాలపై పన్నులపరమైన నిబంధనలు ఇక్కడి విమానయాన సంస్థలకు మరింత భారంగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అటు 2037 నాటికి భారత్‌లో విమాన ప్రయాణికుల సంఖ్య (దేశీయంగా ప్రయాణించేవారు, విదేశాలకు వెళ్లేవారు, విదేశాల నుంచి వచ్చేవారు అంతా కలిపి) 50 కోట్లకు పెరుగుతుందని అలెగ్జాండర్‌ చెప్పారు. ప్రస్తుత గణాంకాలతో పోలిస్తే మూడు రెట్లు అధికంగా ఉంటుందని పేర్కొన్నారు.  

విదేశీ టికెట్లపై జీఎస్‌టీ సరికాదు..
విదేశీ ప్రయాణాల టికెట్లపై కూడా జీఎస్‌టీ విధించడం అంతర్జాతీయ ఏవియేషన్‌ నియంత్రణ సంస్థ ఐసీఏవో నిబంధనలకు విరుద్ధమని అలెగ్జాండర్‌ చెప్పారు. దీనివల్ల ప్రభుత్వానికి స్వల్పకాలికంగా ఆదాయ లబ్ధి చేకూరవచ్చేమో గానీ కనెక్టివిటీ వ్యయాలు పెరిగి అంతర్జాతీయంగా భారత్‌ పోటీనిచ్చే పరిస్థితి లేకుండా పోతుందన్నారు.

ప్రస్తుతం విదేశీ ప్రయాణాలకు సంబంధించి ఎకానమీ టికెట్లపై 5 శాతం, బిజినెస్‌ క్లాస్‌ టికెట్లపై 12 శాతం వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) ఉంటోంది. అటు అంతర్జాతీయంగా ఎయిర్‌లైన్స్‌ వ్యయాల్లో ఇంధన ఖర్చుల వాటా 24.2 శాతం ఉంటుండగా.. భారత్‌లో మాత్రం 34 శాతం దాకా ఉంటోందని అలెగ్జాండర్‌ చెప్పారు.  

ఫ్లయిట్‌లో ఇంటర్నెట్‌కు అక్టోబర్‌లో దరఖాస్తులు..
విమానాల్లో ఇంటర్నెట్‌ సర్వీసులు (ఇన్‌ఫ్లయిట్‌ ఇంటర్నెట్‌) అనుమతించిన నేపథ్యంలో ఈ సేవలు అందించే సంస్థల నుంచి టెలికం శాఖ అక్టోబర్‌లో దరఖాస్తులు ఆహ్వానించనున్నట్లు పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఆర్‌ఎన్‌ చౌబే చెప్పారు.

ఇప్పటికే సర్వీసుల సంస్థలు, ఎయిర్‌లైన్స్, టెలికం శాఖతో దీనిపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయని, నిర్దిష్ట మార్గదర్శ ప్రణాళికను రూపొందించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. క్యాబినెట్‌ సెక్రటరీ సారథ్యంలోని కార్యదర్శుల కమిటీ (సీవోఎస్‌) దీన్ని పరిశీలిస్తుందని వివరించారు. ఇన్‌ఫ్లయిట్‌ కనెక్టివిటీతో విమాన ప్రయాణాల్లో కూడా ప్యాసింజర్ల ఫోన్‌కాల్స్, ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top