కొత్త ఫిర్యాదుల గురించి తెలీదు

‘క్లాస్ యాక్షన్ దావా’ వార్తలపై ఇన్ఫోసిస్ వివరణ
న్యూఢిల్లీ: అమెరికాలో కొత్తగా మరో క్లాస్ యాక్షన్ దావా దాఖలైనట్లు వచ్చిన వార్తలపై ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ స్పందించింది. అక్టోబర్‌లో వచ్చిన ఆరోపణలు తప్ప కొత్త ఫిర్యాదుల గురించి తమకేమీ తెలియదని శుక్రవారం స్టాక్ ఎక్సే్ఛంజీలకు వివరణనిచ్చింది. గతంలో వచ్చిన ఆరోపణల గురించి అప్పుడే ఎక్సే్ఛంజీలకు తెలియజేశామని కూడా పేర్కొంది. అనైతిక విధానాలతో ఇన్వెస్టర్లను నష్టాల పాలు చేసిందనే ఆరోపణతో ఇన్ఫీపై క్లాస్ యాక్షన్ దావా వేసినట్లు అమెరికన్ న్యాయసేవల సంస్థ షాల్ లా ఫర్మ్ ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇన్ఫోసిస్ ఇచ్చిన వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది.
కంపెనీలపై ఫిర్యాదు చేయగోరేవారు, క్లాస్ యాక్షన్ దావాలో భాగం కావాలనుకునేవారు తమను సంప్రదించాలని న్యాయసేవల సంస్థలు ఇలాంటి ప్రకటనలివ్వడం సర్వసాధారణమేనని ఇన్ఫీ తెలిపింది. షాల్ లా ఫర్మ్ కూడా ఇందుకోసమే ప్రకటన చేసినట్లుగా కనిపిస్తోందని పేర్కొంది. ఇన్ఫీ సీఈవో సలీల్ పరీఖ్, సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్ అనైతిక విధానాలకు పాల్పడుతున్నారని అక్టోబర్‌లో ప్రజా వేగుల నుంచి ఫిర్యాదులొచ్చాయి. దీంతో కంపెనీ షేరు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ అంశాలపై స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీతో పాటు అటు అమెరికన్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ఎస్‌ఈసీ కూడా విచారణ జరుపుతోంది. రోజెన్ లా ఫర్మ్ అనే న్యాయసేవల సంస్థ అమెరికన్ ఇన్ఫెస్టర్ల తరఫున ఇన్ఫీపై క్లాస్ యాక్షన్ దావా వేస్తామని అప్పట్లో ప్రకటించింది. మరోవైపు, అకౌంటింగ్ లోపాలపై నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ) దృష్టి సారించింది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి