ఫుట్‌బాల్‌ టికెట్లు, వాచీలు..!

IL&FS Gifted Agency Officials Real Madrid Tickets - Sakshi

రేటింగ్‌ ఏజెన్సీల అధికారులకు లంచాలు

మెరుగైన రేటింగ్‌ పొందేందుకు అడ్డదారులు

ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ స్కామ్‌లో వెలుగులోకి నిజాలు

న్యూఢిల్లీ: వేల కోట్ల రుణాల డిఫాల్ట్‌తో మార్కెట్లను అతలాకుతలం చేసిన ఇన్‌ఫ్రా ఫైనాన్స్‌ సంస్థ ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ కుంభకోణంలో విస్తుగొలిపే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అధిక రేటింగ్‌ పొందేందుకు కంపెనీ మేనేజ్‌మెంట్‌ ఏవిధంగా అడ్డదారులు తొక్కారన్న వివరాలన్నీ ఒక్కొక్కటిగా బైటికొస్తున్నాయి. రేటింగ్‌ ఏజెన్సీల అధికారులకు ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ టికెట్ల నుంచి వాచీలు, షర్టుల దాకా  తాయిలాలిచ్చి ఏవిధంగా కుంభకోణానికి తెరతీసినది గ్రాంట్‌ థార్న్‌టన్‌ మధ్యంతర ఆడిట్‌లో వెల్లడయింది.

దాదాపు రూ. 90,000 కోట్ల రుణభారం ఉన్న ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ సంస్థలు పలు రుణాల చెల్లింపుల్లో డిఫాల్ట్‌ అయిన సంగతి తెలిసిందే. సంక్షోభంలో ఉన్న ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ సంస్థలకు మెరుగైన రేటింగ్స్‌ ఇచ్చిన వివాదంలో ఇప్పటికే ఇద్దరు సీఈవోలను రెండు రేటింగ్‌ ఏజెన్సీలు సెలవుపై పంపాయి. ఇక, కొత్తగా ఏర్పాటైన బోర్డు... గత మేనేజ్‌మెంట్‌ వ్యవహారాల నిగ్గు తేల్చేలా ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించే బాధ్యతలను కన్సల్టెన్సీ సంస్థ గ్రాంట్‌ థార్న్‌టన్‌కు అప్పగించింది. 2008–2018 మధ్య కాలంలో గ్రూప్‌ సంస్థల బాండ్లు తదితర సాధనాలకు అధిక రేటింగ్‌ ఇచ్చి, ఆయా సంస్థలు భారీగా నిధులు సమీకరించుకోవడంలో రేటింగ్‌ ఏజెన్సీలు పోషించిన పాత్రపై ఆడిట్‌ నిర్వహిస్తున్న గ్రాంట్‌ థార్న్‌టన్‌ మధ్యంతర నివేదికను రూపొందించింది.

ఇండియా రేటింగ్స్‌ అధికారికి లబ్ధి..
ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ నెట్‌వర్క్స్‌ (ఐటీఎన్‌ఎల్‌), ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (ఐఎఫ్‌ఐఎన్‌), ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌కు 2008–2018 మధ్యకాలంలో ప్రధానంగా కేర్, ఇక్రా, ఇండియా రేటింగ్స్, బ్రిక్‌వర్క్‌ సంస్థలు రేటింగ్‌ సేవలు అందించాయి. 2012 సెప్టెంబర్‌– 2016 ఆగస్టు మధ్యకాలంలో ఐఎఫ్‌ఐఎన్‌ మాజీ సీఈవో రమేష్‌ బవా, ఫిచ్‌ రేటింగ్స్‌లో ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ విభాగం హెడ్‌ అంబరీష్‌ శ్రీవాస్తవ మధ్య జరిగిన ఈమెయిల్స్‌ సంభాషణలను గ్రాంట్‌ థార్న్‌టన్‌ పరిశీలించింది (ఇండియా రేటింగ్స్‌కి ఫిచ్‌ మాతృసంస్థ). శ్రీవాస్తవ భార్య ఓ విల్లా కొనుక్కోవడంలోనూ, డిస్కౌంటు ఇప్పించడంలోనూ రమేష్‌ తోడ్పాటునిచ్చినట్లు వీటి ద్వారా తెలుస్తోంది. అలాగే, విల్లా కొనుగోలు మొత్తాన్ని చెల్లించడంలో జాప్యం జరగ్గా.. దానిపై వడ్డీని మాఫీ చేసేలా చూడాలంటూ యూనిటెక్‌ ఎండీ అజయ్‌ చంద్రను కూడా రమేష్‌ కోరినట్లు  నివేదికలో పేర్కొంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top