breaking news
favour
-
ఫుట్‌బాల్ టికెట్లు, వాచీలు..!
న్యూఢిల్లీ: వేల కోట్ల రుణాల డిఫాల్ట్‌తో మార్కెట్లను అతలాకుతలం చేసిన ఇన్ఫ్రా ఫైనాన్స్ సంస్థ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ కుంభకోణంలో విస్తుగొలిపే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అధిక రేటింగ్ పొందేందుకు కంపెనీ మేనేజ్మెంట్ ఏవిధంగా అడ్డదారులు తొక్కారన్న వివరాలన్నీ ఒక్కొక్కటిగా బైటికొస్తున్నాయి. రేటింగ్ ఏజెన్సీల అధికారులకు ఫుట్‌బాల్ మ్యాచ్ టికెట్ల నుంచి వాచీలు, షర్టుల దాకా తాయిలాలిచ్చి ఏవిధంగా కుంభకోణానికి తెరతీసినది గ్రాంట్ థార్న్టన్ మధ్యంతర ఆడిట్లో వెల్లడయింది. దాదాపు రూ. 90,000 కోట్ల రుణభారం ఉన్న ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ గ్రూప్ సంస్థలు పలు రుణాల చెల్లింపుల్లో డిఫాల్ట్ అయిన సంగతి తెలిసిందే. సంక్షోభంలో ఉన్న ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ గ్రూప్ సంస్థలకు మెరుగైన రేటింగ్స్ ఇచ్చిన వివాదంలో ఇప్పటికే ఇద్దరు సీఈవోలను రెండు రేటింగ్ ఏజెన్సీలు సెలవుపై పంపాయి. ఇక, కొత్తగా ఏర్పాటైన బోర్డు... గత మేనేజ్మెంట్ వ్యవహారాల నిగ్గు తేల్చేలా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించే బాధ్యతలను కన్సల్టెన్సీ సంస్థ గ్రాంట్ థార్న్‌టన్‌కు అప్పగించింది. 2008–2018 మధ్య కాలంలో గ్రూప్ సంస్థల బాండ్లు తదితర సాధనాలకు అధిక రేటింగ్ ఇచ్చి, ఆయా సంస్థలు భారీగా నిధులు సమీకరించుకోవడంలో రేటింగ్ ఏజెన్సీలు పోషించిన పాత్రపై ఆడిట్ నిర్వహిస్తున్న గ్రాంట్ థార్న్టన్ మధ్యంతర నివేదికను రూపొందించింది. ఇండియా రేటింగ్స్ అధికారికి లబ్ధి.. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్‌పోర్టేషన్ నెట్వర్క్స్ (ఐటీఎన్‌ఎల్), ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎఫ్ఐఎన్), ఐఎల్ అండ్ ఎఫ్ఎస్కు 2008–2018 మధ్యకాలంలో ప్రధానంగా కేర్, ఇక్రా, ఇండియా రేటింగ్స్, బ్రిక్‌వర్క్ సంస్థలు రేటింగ్ సేవలు అందించాయి. 2012 సెప్టెంబర్– 2016 ఆగస్టు మధ్యకాలంలో ఐఎఫ్ఐఎన్ మాజీ సీఈవో రమేష్ బవా, ఫిచ్ రేటింగ్స్‌లో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ విభాగం హెడ్ అంబరీష్ శ్రీవాస్తవ మధ్య జరిగిన ఈమెయిల్స్ సంభాషణలను గ్రాంట్ థార్న్టన్ పరిశీలించింది (ఇండియా రేటింగ్స్‌కి ఫిచ్ మాతృసంస్థ). శ్రీవాస్తవ భార్య ఓ విల్లా కొనుక్కోవడంలోనూ, డిస్కౌంటు ఇప్పించడంలోనూ రమేష్ తోడ్పాటునిచ్చినట్లు వీటి ద్వారా తెలుస్తోంది. అలాగే, విల్లా కొనుగోలు మొత్తాన్ని చెల్లించడంలో జాప్యం జరగ్గా.. దానిపై వడ్డీని మాఫీ చేసేలా చూడాలంటూ యూనిటెక్ ఎండీ అజయ్ చంద్రను కూడా రమేష్ కోరినట్లు నివేదికలో పేర్కొంది. -
రెరా తొలి తీర్పు: రూ. 26లక్షల పరిహారం
సాక్షి, ముంబై: ఈ ఏడాది మే 1 నుంచి అమల్లోకి వచ్చిన రియల్ ఎస్టేట్ చట్టం రెరా (రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్) పరిధిలో తొలి తీర్పు వెలుపడింది. అదీ గృహకొనుగోలుదారుకు అనుకూలంగా ఈ తీర్పు వెలుడింది. అనుకున్న సమయానికి ఇంటిని స్వాధీనం చేయకపోవడంతో బాధితుడు ఆన్లైన్ ద్వారా రెరాకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనకు పరిహారం చెల్లించాల్సిందిగా బిల్డర్‌ను రెరా ఆదేశించింది. 2016నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందని బిల్డర్ చెప్పారు. కానీ వాస్తవానికి అలా జరగలేదు. దీనికి తోడు ఆయన చెల్లించిన అడ్వాన్స్ సొమ్మను చెల్లించడానికి సదరు బిల్డర్ నిరాకరించారు. ఈ క్రమంలో బాధితుడు రెరాను ఆశ్రయించారు. రూ.5000 చెల్లింపు ద్వారా మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (మహారెరా) వెబ్సైట్ లో ఫిర్యాదుదారు కేసు నమోదు చేశారు. దీన్ని విచారించిన రెరా గృహ కొనుగోలుదారునికి రూ. 26.15 లక్షలను తిరిగి చెల్లించాలని బుధవారం ఆదేశించింది. ముంబైకి చెందిన బిల్డర్‌కు ఈ ఆదేశాలు జారీ చేసింది. గృహ-కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడుకోవడానికి సంబంధిత చట్టాలు అధికారుల మధ్య మంచి సమన్వయం ఉండాలని మహా రెరా చైర్మన్ గౌతం ఛటర్జీ మీడియాతో చెప్పారు. ఈ సందర్భంగా జైపీ ఇన్ ఫ్రాటెక్ కేసులు ఆయన ప్రస్తావించారు. ప్రధానంగా ప్రాజెక్ట్ డెలివరీలో జాప్యానికి సంబంధించి ఇప్పటివరకు తమకు 98 ఫిర్యాదులను అందుకున్నామన్నారు. కారణం ఏదైనా కొనసాగుతున్న ప్రాజెక్ట్ ఇబ్బందుల్లో చిక్కుకున్నట్లయితే వినియోగదారులే నష్టపోతారని ఛటర్జీ వ్యాఖ్యానించారు.మరోవైపు ఈ ఆదేశాలు జారీ అయినే వెంటనే డెవలపర్ తనుకు చెక్‌ను అందించారంటూ ఫిర్యాదు దారు సంతోషం వ్యక్తం చేశారు. -
జైలు కాదు.. బెయిలు
సల్మాన్‌కు బాంబే హైకోర్టులో ఊరట కిందికోర్టు విధించిన ఐదేళ్ల శిక్ష నిలుపుదల ముంబై: బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు పెద్ద ఊరట! ‘హిట్ అండ్ రన్’ కేసులో పదమూడేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం కిందికోర్టు విధించిన ఐదేళ్ల శిక్షను బాంబే హైకోర్టు నిలిపివేసింది. ఆయనకు బెయిల్ ఇస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది. కింది కోర్టులో రూ.30 వేల పూచీకత్తు సమర్పించాలని, విదేశాలకు వెళ్లేముందు న్యాయస్థానం అనుమతి తీసుకోవాలని సల్మాన్‌ను ఆదేశించింది. కిందికోర్టు విధించిన శిక్షను సవాలు చేస్తూ సల్మాన్ దాఖలు చేసిన అప్పీలుపై విచారణను వేగవంతం చేస్తామని తెలిపింది. అనంతరం కేసు తదుపరి విచారణను జూన్ 15కు వాయిదా వేసింది. బుధవారం కిందికోర్టు తీర్పు వెలువరించిన రోజే సల్మాన్ హైకోర్టును ఆశ్రయించడంతో.. న్యాయస్థానం రెండ్రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వడం తెలిసిందే. శుక్రవారం బెయిల్ గడువు ముగియనున్న నేపథ్యంలో జస్టిస్ అభయ్ థిప్సే... సల్మాన్ అప్పీలుపై విచారణ చేపట్టారు. ‘‘సల్మాన్ అప్పీలుపై నిర్ణయం తీసుకునేంత వరకు ఆయన్ను జైల్లో ఉంచాల్సిన కేసు కాదిది. అప్పీలు పిటిషన్‌ను అనుమతించి పెండింగ్‌లో ఉంచిన తర్వాత.. ఆయన హక్కులకు భంగం కలిగించడం ఎందుకు? చాలా కేసుల్లో హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించేవరకు నిందితులను జైల్లోనే ఉంచుతున్నారు’’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ‘‘దోషికి కిందికోర్టు ఏడేళ్ల లోపు కారాగార శిక్ష విధించి, పైకోర్టు అప్పీలును అనుమతించిన పక్షంలో.. ఆ శిక్షను నిలుపుదల చేసేందుకు వీలు కల్పించే నిబంధన ఉంది కదా? దాన్ని మీరెందుకు విస్మరిస్తున్నారు?’’ అని ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాదులను జడ్జి ప్రశ్నించారు. కేసు విచారణ సాగుతున్నంత కాలం సల్మాన్ బెయిల్‌పైనే ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. ప్రమాదం సమయంలో సల్మాన్ కారు నడుపుతున్నారా లేదా అన్న విషయంపై అనేక వాదనలున్నాయన్నారు. బెయిల్ ఇచ్చినంత మాత్రాన సల్మాన్ ఎక్కడికీ పారిపోడన్నారు. కిందికోర్టు మా వాదన పట్టించుకోలేదు: సల్మాన్ లాయర్ కిందికోర్టు తమ వాదన పట్టించుకోలేదని సల్మాన్ తరఫు న్యాయవాది అమిత్ దేశాయ్ వాదించారు. ప్రమాదం సమయంలో కారులో నలుగురున్నారని, కారును డ్రైవర్ అశోక్‌సింగ్ నడుపుతున్నాడని వివరించారు. ఈ కేసులో రవీంద్ర పాటిల్(సల్మాన్ బాడీగార్డు)పై ఒత్తిడి తెచ్చి సల్మానే కారు నడిపినట్లుగా ప్రాసిక్యూషన్ సాక్ష్యం ఇప్పించిందని ఆరోపించారు. టైరు పేలిపోవడంతోనే ప్రమాదం జరిగిందన్న వాదనను కూడా కిందికోర్టు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ప్రమాదం సమయంలో కారులోనే ఉన్న గాయకుడు కమాల్ ఖాన్‌ను ప్రాసిక్యూషన్ ఎందుకు ప్రశ్నించలేద న్నారు. ప్రభుత్వం తరఫు న్యాయవాది సందీప్ షిండే.. సల్మాన్ అప్పీలును విచారణకు స్వీకరించడాన్ని వ్యతిరేకించపోయినా ఆయనకు విధించిన శిక్షను నిలిపివేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. కేసు విచారణ తుది దశకు వస్తున్న దశలో కారును అశోక్‌సింగ్ నడుపుతున్నారన్న కొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చారన్నారు. సల్మాన్ ఇంటి వద్ద అభిమానుల సంబరాలు సల్మాన్‌కు బెయిల్ సంగతి తెలియగానే బాంద్రాలోని ఆయన ఇంటి వద్ద అభిమానులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. పరస్పరం స్వీట్లు పంచుకున్నారు. పెద్దఎత్తున అభిమానులు చేరుకోవడంతో వారిని నియంత్రించేందుకు ముందుగానే పోలీసులను మోహరించారు. శిక్షపై స్టేతోపాటు బెయిల్ సంగతి తెలియగానే సల్మాన్ కూడా ఉల్లాసంగా కనిపించారు. అభిమానులకు సంతోషంగా అభివాదం చేస్తూ కిందికోర్టులో పూచీకత్తు సమర్పించేందుకు వెళ్లారు. అందరికీ కృతజ్ఞతలు: సల్మాన్ కష్టకాలంలో తనకు అండగా నిలిచిన అభిమానులకు, బాలీవుడ్ తారలందరికీ సల్మాన్‌ఖాన్ కృతజ్ఞతలు తెలిపాడు. ‘‘నా కోసం ప్రార్థనలు జరిపిన వారికి, మద్దతుగా నిలిచిన వారికి మెహర్బానీ, షుక్రియా’’ అంటూ ట్వీట్ చేశాడు. హిట్ అండ్ రన్ కేసులో జైలు శిక్ష పడి.. శుక్రవారం బాంబే హైకోర్టు స్టే ఇచ్చిన తరువాత సల్మాన్ మొదటి సారి స్పందించాడు. ‘అభిజిత్, ఫరాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి’ ముజఫర్‌పూర్(బీహార్): బాలీవుడ్ గాయకుడు అభిజిత్ భట్టాచార్య, డిజైనర్ ఫరాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా కాజీ మహ్మద్‌పూర్ పోలీసులను స్థానిక జిల్లా కోర్డు శుక్రవారం ఆదేశించింది. సల్మాన్‌ఖాన్ హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించి ఫుట్‌పాత్‌లపై నిద్రించే వారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కోర్టు పైవిధంగా స్పందించింది. పత్రికలు, టీవీ చానల్స్‌లో ఫుట్‌పాత్‌లపై నిద్రించే వారి గురించి అభిజిత్, ఫరా చేసిన వివాదాస్పద, చౌకబారు వ్యాఖ్యలు చేయడంపై కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశించాలని అడ్వొకేట్ సుధీర్ కుమార్ ఓజా కోర్టును ఆశ్రయించారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఇరువురిపై ఐపీసీ సెక్షన్ 153, 153-ఏ, 504, 506ల కింద కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. అయితే ట్విటర్లో తన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో క్షమాపణ చెబుతున్నట్లు ఫరా ప్రకటించారు. ఎవరినీ కించపరచాలన్నది తన ఉద్దేశం కాదని పేర్కొంది.