పావెల్‌ ‘ప్రకటన’ బలం

Fed Powell says trade worries restraining the economy - Sakshi

ఫెడ్‌ రేటు తగ్గింపునకు సంకేతాలు

వారంలో 20 డాలర్లు పెరిగిన పసిడి

బంగారానిది బుల్లిష్‌ ట్రెండేనన్న విశ్లేషణలు  

అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో 10 రోజుల క్రితం న్యూయార్క్‌ ఫ్యూచర్స్‌ మార్కెట్‌ నైమెక్స్‌లో ఔన్స్‌కు (31.1గ్రా) 1,440 డాలర్లను తాకిన పసిడి ధర, లాభాల స్వీకరణతో 1,388 డాలర్ల స్థాయిని తిరిగి తాకింది. అయినప్పటికీ 1,366 డాలర్ల పటిష్ట మద్దతు స్థాయిని కోల్పోకపోవడం గమనార్హం. 12వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో మళ్లీ 1,423 డాలర్లను చేరింది. చివరకు వారం వారీగా  దాదాపు 20 డాలర్లు ఎగసి 1418 డాలర్ల వద్ద ముగిసింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమనం నేపథ్యంలో ఫెడ్‌ ఫండ్‌ రేటు (ప్రస్తుతం 2.25–2.50 శాతం శ్రేణి) తగ్గింపుకు వీలుందని అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ చీఫ్‌ పావెల్‌ పంపిన సంకేతాలు పసిడిని మళ్లీ పటిష్ట స్థితికి చేర్చాయి.

అయితే వారం వారీగా వెలువడిన ఉపాధి కల్పన గణాంకాలు, ద్రవ్యోల్బణం పెరగడం అమెరికా ఆర్థిక వ్యవస్థకు మళ్లీ కొంత ఊతాన్నిచ్చాయి. చివరకు పసిడి 1,418 డాలర్ల వద్ద ముగిసింది. అయితే అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి వాతావరణం తొలిగిపోతుందన్న విషయంలో స్పష్టత లేకపోవడం, దీనితో డాలర్‌ ఇండెక్స్‌ (వారం ముగింపునకు 96.42) భారీగా పెరిగే అవకాశాలు లేకపోవడం, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి అంశాలు దీర్ఘకాలంలో బంగారానికి బలాన్ని ఇచ్చే అంశాలేనని నిపుణులు భావిస్తున్నారు. అయితే పసిడి తిరిగి 1,360 డాలర్ల స్థాయి దిగువకు వస్తే, 1,300 డాలర్ల స్థాయిని కూడా చూసే అవకాశం ఉందనీ, ఇది కొనుగోళ్లకు మంచి అవకాశమనీ వారు పేర్కొంటున్నారు.  

భారత్‌లో పరుగునకు ‘రూపాయి’ అడ్డు..
నిజానికి అంతర్జాతీయంగా ధర పెరిగినప్పటికీ, భారత్‌లో ఆ మేర పెరుగుదల కనిపించడం లేదు. డాలర్‌ మారకంలో రూపాయి విలువ పటిష్ట (68.68) ధోరణి దీనికి కారణం. దేశీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌– మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌లో పసిడి ధర శుక్రవారంతో ముగిసిన వారంలో 10 గ్రాములకు 34,905 వద్ద ముగిసింది. అయితే ధర తీవ్రత వల్ల స్పాట్‌ మార్కెట్‌లో కస్టమర్లు కొనుగోళ్లకు ‘వేచిచూసే’ ధోరణిని అవలంబిస్తున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే సమీపకాలంలో పసిడి ధరలు రూ.30 వేల కిందకు దిగిరాకపోవచ్చన్నది నిపుణుల అభిప్రాయం. ఇక ముంబై స్పాట్‌ మార్కెట్‌లో 24, 22 క్యారెట్ల ధరలు శుక్రవారం రూ.35,280 రూ.33,600 వద్ద ముగిశాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top