ఇళ్ల క్రయవిక్రయాల్లోకి ‘ఎస్సెక్స్‌’ | Sakshi
Sakshi News home page

ఇళ్ల క్రయవిక్రయాల్లోకి ‘ఎస్సెక్స్‌’

Published Tue, Dec 18 2018 12:48 AM

Essex India to ease buying and selling of property - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇల్లు కొనుక్కోవటం అంత ఈజీ కాదు. అనువైన ప్రాంతంలో కావాలంటే కాళ్లరిగేలా తిరగాలి. మరోవంక సదరు ఇంటిని అన్ని అనుమతులు తీసుకున్నాకే బిల్డర్‌ నిర్మించారా? లోన్‌ వస్తుందా అన్న సందేహాలూ ఉంటాయి. ఇవన్నీ లేకుండా.. ఒక్క క్లిక్‌తో సులువుగా ఇల్లు కొనుక్కునే సేవల్ని అందుబాటులోకి తెచ్చింది ‘ఎస్సెక్స్‌’ దేశంలో అతిపెద్ద మార్కెటింగ్‌ టెక్నాలజీ కంపెనీ వే2ఆన్‌లైన్‌ ఇంటెరాక్టివ్‌ ప్రమోట్‌ చేస్తున్న ‘ఎస్సెక్స్‌ ఇండియా’... టెక్నాలజీని ఆసరాగా కస్టమర్‌ను, బిల్డర్‌ను అనుసంధానిస్తోంది. న్యాయ సహకారంతో పాటు గృహ రుణానికీ తగిన సాయం చేస్తుంది. 

ఎలా పనిచేస్తుందంటే.. 
ఎస్సెక్స్‌ ఇండియా వెబ్‌సైట్లోకి వెళ్లి పేరు, మొబైల్‌ నంబరు, నగరం పేరు నమోదు చేస్తే చాలు. కంపెనీ ప్రతినిధి 30 నిముషాల్లో కస్టమర్‌కు కాల్‌ చేస్తారు. ఏ ప్రాంతంలో ఫ్లాట్‌/విల్లా కావాలి, ఎంతలో కావాలి? ఎప్పట్లోగా కావాలి? వంటివి అడిగి తెలుసుకుంటా రు. ఈ సమాచారం ఆధారంగా బిల్డర్‌తో కస్టమర్‌ను అనుసంధానించి సైట్‌ విజిట్స్‌ ఏర్పాటు చేస్తారు. ధరపై కొనుగోలుదారే విక్రేతతో మాట్లాడుకోవచ్చు.  కస్టమర్‌ నుంచి ఎలాంటి ఫీజూ వసూలు చేయరు. 

బ్యాంకు రుణం సైతం.. 
కస్టమర్‌కు బ్యాంకు నుంచి రుణం అందేలా సహకరిస్తామని ఎస్సెక్స్‌ కో–ఫౌండర్‌ నిర్భయ్‌ తనేజా సోమవారమిక్కడ మీడియాకు వెల్లడించారు. ‘భవనాలకు అనుమతులన్నీ ఉన్నాయా లేదా చూస్తాం. కస్టమర్ల క్రెడిట్‌ స్కోరింగ్‌ను సైతం ట్రాక్‌ చేస్తాం. భారత్‌లో ఏటా రూ.18,000 కోట్లుగా ఉన్న రెసిడెన్షియల్‌ మార్కెటింగ్, సేల్స్‌ రంగంలో 5% వాటాను లక్ష్యంగా చేసుకున్నాం’ అని వివరించారు. ఇప్పటి వరకు కంపెనీ రూ.3 కోట్లు వెచ్చించింది. ఆరు నెలల్లో రూ.20 కోట్ల నిధులు సమీకరించనుంది. 

అందరికీ ఒకే ప్లాట్‌ఫామ్‌.
‘‘ఇళ్ల విక్రయానికి సంబంధించి పెద్ద పెద్ద రియల్టీ బ్రాండ్లకు సమస్యలు ఉండవు. కానీ చిన్నచిన్న బిల్డర్లకు తమ భవనాన్ని మార్కెట్‌ చేసుకోవడంలో చాలా పరిమితులున్నాయి. ఇదంతా ఖర్చుతో కూడుకున్నపని. దేశవ్యాప్తంగా అమ్ముడుపోని గృహాలు లక్షల్లో ఉంటాయి. చిన్న బిల్డర్ల గృహాలనూ మేం బ్రాండింగ్‌ చేస్తాం‘‘ అని కంపెనీ కో–ఫౌండర్‌ చైతన్య రెడ్డి వెల్లడించారు. కంపెనీ ప్రస్తుతం హైదరాబాద్‌లో మార్కెటింగ్, సేల్స్‌ సేవలు అందిస్తోంది. దశలవారీగా అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కత, ముంబై, పుణే నగరాల్లో అడుగుపెడతామని చెప్పారు. 

Advertisement
Advertisement