చైనాకు మరోసారి షాకిచ్చిన ట్రంప్‌

China raises tariffs on $60bn of US goods in technology fight - Sakshi

200 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులపై 10 శాతం టారిఫ్‌

ఆదేశించిన అమెరికా అధ్యక్షుడు

ప్రతీకారానికి దిగితే మరో విడత ఉంటుందని హెచ్చరిక

అయినా సుంకాలతో చైనా జవాబు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి చైనాపై తన ప్రతాపం చూపించారు. టారిఫ్‌ల పెంపుతో మొదలు పెట్టిన వాణిజ్య యుద్ధంలో మరింత దూకుడు ప్రదర్శించారు. చైనా నుంచి అమెరికాలోకి దిగుమతి అయ్యే 200 బిలియన్‌ డాలర్ల (రూ.14.4లక్షల కోట్లు) విలువైన ఉత్పత్తులపై 10 శాతం టారిఫ్‌ (సుంకం)లు విధించారు.

ఈ ఏడాది చివరికి ఈ మొత్తాన్ని 25 శాతానికి పెంచనున్నారు. చైనాకు చెందిన 50 బిలియన్‌ డాలర్ల విలువైన ఉత్పత్తులపై అమెరికా గతంలోనే టారిఫ్‌లు విధించగా, తాజా పెంపు నిర్ణయం దీనికి అదనం. 200 బిలియన్‌ డాలర్ల విలువైన ఉత్పత్తులపై 10 టారిఫ్‌ల విధింపు ఈ నెల 24 నుంచి అమల్లోకి రానుంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఇది 25%గా అమల్లోకి వస్తుంది.

అనుచిత విధానాలు...
చైనా తన అనుచిత వాణిజ్య విధానాలను మార్చుకునేందుకు సుముఖంగా లేదని ట్రంప్‌ పేర్కొన్నారు. అదనపు టారిఫ్‌లు అమెరికా కంపెనీలకు పారదర్శకమైన చికిత్స ఇచ్చినట్టు అవుతుందన్నారు. ‘‘మా రైతులు, పరిశ్రమలకు వ్యతిరేకంగా చైనా ప్రతీకార చర్యకు దిగితే, వెంటనే మూడో విడత కింద 267 బిలియన్‌ డాలర్ల దిగుమతులపై టారిఫ్‌ల విధింపును అమలు చేస్తాం’’ అని ట్రంప్‌ హెచ్చరించారు. అమెరికా టెక్నాలజీ, మేథోపరమైన హక్కులకు సంబంధించి చైనా అనుచిత విధానాలను అనుసరిస్తోందన్నారు. తద్వారా చైనా కంపెనీలకు టెక్నాలజీ బదిలీ చేసే విధంగా అమెరికా కంపెనీలను బలవంతం చేస్తోందని అమెరికా వాణిజ్య ప్రాతినిధ్య విభాగం నిర్ధారించినట్టు ట్రంప్‌ చెప్పారు.

ఇది అమెరికా ఆర్థిక రంగ ఆరోగ్యం, శ్రేయస్సుకు దీర్ఘకాలంలో పెద్ద ముప్పు కాగలదన్నారు. ‘‘కొన్ని నెలలుగా ఈ విధమైన అనుచిత విధానాలను మార్చుకోవాలని చైనాను కోరుతున్నాం. మరింత పారదర్శకంగా వ్యవహరించేందుకు చైనాకు ప్రతీ అవకాశాన్ని ఇచ్చాం. కానీ, చైనా ఇంత వరకు తన విధానాలను మార్చుకునేందుకు సిద్ధపడలేదు. అమెరికా ఆందోళనలను పరిష్కరించేందుకు చైనాకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. తమ దేశ అనుచిత వాణిజ్య విధానాలకు ముగింపు పలికేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని చైనా నేతలను కోరుతున్నాను’’ అని ట్రంప్‌ చెప్పారు.

అమెరికా ఇప్పటికే చైనాకు చెందిన 50 బిలియన్‌ డాలర్ల విలువైన ఉత్పత్తులపై టారిఫ్‌లు అమలు చేయగా, చైనా సైతం ఇదే స్థాయిలో అమెరికా దిగుమతులపై టారిఫ్‌లు విధించింది. ఇరు దేశాల మధ్య త్వరలోనే చర్చలు జరగనున్నాయనే అంచనాల మధ్య ట్రంప్‌ మరో విడత చర్యలకు దిగడం గమనార్హం. చైనాతో చర్చల అవసరాన్ని అమెరికా అధికారులు ప్రస్తావిస్తుండగా, ఓ అంగీకారానికి రావాలన్న ఒత్తిడి అమెరికాపై లేదని ట్రంప్‌ గతవారమే వ్యాఖ్యానించారు. కాగా, అమెరికా సుంకాల విధింపునకు దిగితే ప్రతిచర్యతో స్పందిస్తామని చైనా వాణిజ్య, విదేశాంగ మంత్రులు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో చైనా సైతం ఇదే విధంగా ప్రతిస్పందించే అవకాశం కనిపిస్తోంది.

చైనా ప్రతీకారం...
అమెరికా తాజా సుంకాల చర్యకు చైనా వెంటనే స్పందించింది. 60 బిలియన్‌ డాలర్ల అమెరికా దిగుమతులపై టారిఫ్‌లను విధిస్తున్నట్టు ప్రకటించింది. టారిఫ్‌లు మరింత పెంచుతామని అమెరికా పేర్కొంటే, అందుకు అనుగుణంగా స్పందిస్తామని చైనా ఆర్థిక శాఖ ప్రకటన జారీ చేసింది.

‘‘మా చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలు కాపాడుకునేందుకు, ప్రపంచ స్వేచ్ఛా వాణిజ్య ఉత్తర్వుల మేరకు చైనా తగిన ప్రతిస్పందన చర్యలు తీసుకుంటుంది’’ అని చైనా వాణిజ్య శాఖ పేర్కొంది. గతేడాది చైనా నుంచి అమెరికాకు ఎగుమతులు 522.9 బిలియన్‌ డాలర్ల మేర ఉండగా, చైనాకు అమెరికా ఎగుమతులు 187 బిలియన్‌ డాలర్లు మేర ఉండడం గమనార్హం.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top