
పోస్టాఫీసుల్లో నగదు రహిత సేవలు
అన్ని ప్రధాన పోస్టాఫీసుల్లోనూ నగదు రహిత సేవలను అందించేందుకు తపాలా శాఖ సన్నద్ధమవుతోంది. ఇందుకోసం స్వైపింగ్ మెషీన్లను సమకూర్చుకునే పనిలో పడింది.
► దశల వారీగా స్వైపింగ్ మెషీన్ల ఏర్పాటు
► ఎస్‌బీఐతో పోస్టల్ శాఖ ఒప్పందం
► దేశవ్యాప్తంగా 1000 ఆఫీసుల ఎంపిక
సాక్షి ప్రతినిధి, తిరుపతి: అన్ని ప్రధాన పోస్టాఫీసుల్లోనూ నగదు రహిత సేవలను అందించేందుకు తపాలా శాఖ సన్నద్ధమవుతోంది. ఇందుకోసం స్వైపింగ్ మెషీన్లను సమకూర్చుకునే పనిలో పడింది. భారతీయ స్టేట్ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకున్న తపాలాశాఖ అన్ని హెడ్ పోస్టాఫీసుల్లోనూ దశలవారీగా ఎస్‌బీఐ పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) మెషీన్లను ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే రెండు నెలల్లో ఏపీ సర్కిల్ పరిధిలోని 25 హెచ్‌వోలను ఎంపిక చేసుకుని ఒక్కో కార్యాలయంలో ఐదు నుంచి ఆరు మెషీన్లను అందుబాటులో ఉంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
పోస్ట్‌కార్డు కొనుగోలు దగ్గర నుంచి అన్ని రకాల మెయిల్ సర్వీసులకూ నగదు చెల్లించాల్సి వస్తోంది. దీనివల్ల చిల్లర సమస్యతో పాటు నగదు భద్రతపై ఉద్యోగులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి వస్తోంది. ఉద్యోగుల సంఖ్య తక్కువ, సేవలు ఎక్కువ కావడంతో అన్ని రకాల సేవల్లో కొంత జాప్యం తలెత్తుతుంది. దీన్ని నివారించడంతో పాటు పారదర్శకమైన సేవలు అందించేందు కోసం తపాలా శాఖ నగదు రహిత సేవలకు నిర్ణయం తీసుకుంది. బ్యాంకుల తరహాలో సేవలను వేగవంతం చేసేందుకు పాయింట్ ఆఫ్ సేల్ మెషీన్ల వాడకం అవసరమని నిర్ణయించింది. ఇందుకోసం ఎస్‌బీఐతో ఒప్పందం చేసుకుంది.
దేశవ్యాప్తంగా ఉన్న 25 వేల పోస్టాఫీసుల్లో పీవోఎస్‌లను ప్రవేశ పెట్టాలని ఇటీవలే నిర్ణయం తీసుకున్న పోస్టల్ బోర్డు సంబంధిత మార్గదర్శకాలను అన్ని సర్కిళ్లకు పంపింది. దీంతో తెలంగాణ పోస్టల్ సర్కిల్ అధికారులు తొలి విడతగా సికింద్రాబాద్, వరంగల్ హెడ్ పోస్టాఫీసుల్లో పీవోఎస్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఏపీ సర్కిల్ అధికారులు కూడా వచ్చే రెండునెలల్లో 25 ప్రధాన పోస్టాఫీసుల్లో వీటిని ఏర్పాటు చేయడం ద్వారా సేవలను వేగవంతం చేయాలని యోచిస్తున్నారు. పీవోఎస్ మెషీన్లు అందుబాటులోకి వస్తే జనమంతా తమకున్న క్రెడిట్, డెబిట్ కార్డులను వినియోగించి స్పీడ్ పోస్టు, రిజిస్టర్డ్ పోస్ట్, మనీ ఆర్డర్, నగదు బదిలీ వంటి అన్ని రకాల మెయిళ్లను నగదు లేకుండా నిర్వహించుకునే వీలుంది. పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో ప్రస్తుతం రోజుల్లో లభించే సేవలన్నీ గంటల్లో అందుబాటులోకి వచ్చే వీలుంది.