Cashless Services
-
ఆర్టీసీ అడ్వాన్స్ టికెట్ బుకింగ్ కేంద్రాల్లో నగదు రహిత సేవలు
సాక్షి, హైదరాబాద్: దూర ప్రాంత ప్రయాణికుల సౌకర్యార్థం అడ్వాన్స్ టికెట్ బుకింగ్ చేసుకునే వెసులుబాటును తెలంగాణ ఆర్టీసీ కల్పించింది. నగదు రహిత, స్పర్శ రహిత లావాదేవీలను రేతిఫైల్, జేబీఎస్, సీబీఎస్, కేపీహెచ్‌బీ కేంద్రాల్లో పొందవచ్చని ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఈడీ వి.వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా కేంద్రాలు ఉదయం 6.30 నుంచి రాత్రి 8.15 గంటల వరకు పని చేస్తాయన్నారు. క్యూఆర్ కోడ్, యూపీఐ యాప్‌ల ద్వారా స్మార్ట్ ఫోన్లతో అడ్వాన్స్ టికెట్ బుకింగ్ చేసుకుని బస్‌పాస్‌ల మొత్తాలను చెల్లించవచ్చని తెలిపారు. (చదవండి: క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు) -
డబ్బు పోయే.. వైద్యం లేదాయే
సాక్షి, అమరావతి: నగదు రహిత వైద్యంపై ఉద్యోగులు, పెన్షనర్ల ఆశలు అడియాశలే అవుతున్నాయి. ఈ ఏడాది జనవరి 1వ తేదీనుంచి రాష్ట్రంలో ఉద్యోగులకు, పెన్షనర్లకు, వారి కుటుంబ సభ్యులకు అందాల్సిన నగదు రహిత వైద్యసేవలు పూర్తిగా ఆగిపోయాయి. ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి నెలనెలా డబ్బులు వసూలు చేస్తూ కూడా ఆ డబ్బులు ప్రైవేటు ఆస్పత్రులకు చెల్లించకపోవడంతో వైద్యసేవలు ఆగిపోయిన విషయం తెలిసిందే. సుమారు రూ. 200 కోట్ల బకాయిలు ఉండటంతో ప్రైవేటు ఆస్పత్రులన్నీ సేవలు ఆపేశాయి. నగదు చెల్లిస్తేనే వైద్యం అందిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు ఇబ్బందిపడుతున్నారు. డబ్బులు చేతిలో ఉంటేనే వైద్యం అందుతోంది. లేదంటే ఆ బిల్లులు రీయింబర్స్‌మెంటుకు దరఖాస్తు చేసుకోవాలి. ఆ డబ్బు తిరిగి ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి. ఈ ఏడాదైనా వైద్యం సక్రమంగా అందించి, పథకాన్ని గాడిన పెడతారని భావించిన ఉద్యోగులకు ప్రభుత్వ పెద్దల తీరు మింగుడు పడటంలేదు. వైద్యసేవలు ఆగిపోయి 20 రోజులు గడిచినా సర్కారు నుంచి స్పందన లేకపోవడంతో ఉద్యోగుల్లో అసంతృప్తి పెల్లుబుకుతోంది. పెన్షనర్ల ఇబ్బందులు వర్ణనాతీతం రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల మందికిపైగా పెన్షనర్లు ఉన్నాయి. వీరిలో ఎక్కువ మందిని అనారోగ్య సమస్యలు పీడిస్తున్నాయి. వైద్యసేవల కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతుంటే వారికి వైద్యం అందడంలేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో అర్థం కావడం లేదని వారు వాపోతున్నారు. నగదు చెల్లించి వైద్యం చేయించుకోవడం తమవల్ల కాదంటున్నారు. లక్షలాది రూపాయలు ఎక్కడ తేవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యం అందించలేని సర్కారు.. నెలనెలా తమ వద్ద నుంచి ఎందుకు డబ్బులు వసూలు చేసిందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పలు ఉద్యోగ సంఘాలు కూడా సర్కారు తీరుపై విరుచుకుపడ్డాయి. నాలుగున్నరేళ్లుగా నగదు రహిత వైద్యం సరిగా అందకపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడుతున్నారు. నగదు రహిత వైద్యమందించే పథకంలోని జాబితాలో 438 ఆస్పత్రులు ఉండగా అందులో 50 పడకలు దాటిన ఏ ఆస్పత్రికూడా వీరికి వైద్యం అందించడం లేదు. బకాయిలు కారణంగానే ఈ నిర్ణయం ప్రస్తుతం నగదు చెల్లిస్తేనే వైద్యం అందిస్తున్నాం. ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు సంబంధించి బకాయిలు చెల్లించని కారణంగా వైద్యసేవలు నిలిపివేశాం. నగదు చెల్లించి వైద్యం చేయించుకుని ఆ తర్వాత ప్రభుత్వం వద్ద రీయింబర్స్ చేసుకోవచ్చు. సోమవారం గానీ మంగళవారం గానీ చర్చలకు పిలుస్తామని మంత్రి ఫరూక్ చెప్పారు. – ఏపీ ప్రైవేటు ఆస్పత్రుల సంఘం నేతలు నేడు జరిగే జేఏసీలో తీర్మానిస్తాం నేడు విజయవాడలో ఏపీ ఎన్జీవో జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం జరుగుతోంది. ఇందులో పలు అంశాలు చర్చకు వస్తాయి. అందులో ప్రధానంగా నగదు రహిత వైద్యం చర్చకు వస్తుంది. దీనిపై ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయిస్తాం. ఉద్యోగుల వైద్యం విషయం ప్రాధాన్యతాంశంగా గుర్తిస్తాం. –చంద్రశేఖర్‌రెడ్డి, అధ్యక్షుడు, ఏపీ ఎన్జీవో సంఘం పెన్షనర్లు నలిగిపోతున్నారు రాష్ట్రవ్యాప్తంగా వైద్యం అందక పెన్షనర్లు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వృద్ధాప్యంలో ఆరోగ్యసమస్యలు వారిని చుట్టుముడుతున్నాయి. 20 రోజులుగా సేవలు అందకపోయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం బాధాకరం. – ఆస్కారరావు, అధ్యక్షుడు, ఏపీ పబ్లిక్‌హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ సంఘాలన్నీ పోరాడాలి మా నుంచి డబ్బు వసూలు చేస్తూ కూడా వైద్యం అందించకపోవడం దారుణం. దీనిపై ప్రశ్నించే వారే లేకపోవడం బాధ కలిగిస్తోంది. వివిధ ఉద్యోగ సంఘాలన్నీ దీనిపై పోరాడేందుకు సిద్ధంగా ఉండాలి. లేదంటే ఆయా సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు అన్యాయం చేసినవారవుతారు. ఇప్పటికైనా అందరూ కలిసి రావాలి. –వెంకట్రామిరెడ్డి, మాజీ అధ్యక్షుడు, సచివాలయ ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ -
పోస్టాఫీసుల్లో నగదు రహిత సేవలు
► దశల వారీగా స్వైపింగ్ మెషీన్ల ఏర్పాటు ► ఎస్బీఐతో పోస్టల్ శాఖ ఒప్పందం ► దేశవ్యాప్తంగా 1000 ఆఫీసుల ఎంపిక సాక్షి ప్రతినిధి, తిరుపతి: అన్ని ప్రధాన పోస్టాఫీసుల్లోనూ నగదు రహిత సేవలను అందించేందుకు తపాలా శాఖ సన్నద్ధమవుతోంది. ఇందుకోసం స్వైపింగ్ మెషీన్లను సమకూర్చుకునే పనిలో పడింది. భారతీయ స్టేట్ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకున్న తపాలాశాఖ అన్ని హెడ్ పోస్టాఫీసుల్లోనూ దశలవారీగా ఎస్బీఐ పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) మెషీన్లను ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే రెండు నెలల్లో ఏపీ సర్కిల్ పరిధిలోని 25 హెచ్వోలను ఎంపిక చేసుకుని ఒక్కో కార్యాలయంలో ఐదు నుంచి ఆరు మెషీన్లను అందుబాటులో ఉంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. పోస్ట్‌కార్డు కొనుగోలు దగ్గర నుంచి అన్ని రకాల మెయిల్ సర్వీసులకూ నగదు చెల్లించాల్సి వస్తోంది. దీనివల్ల చిల్లర సమస్యతో పాటు నగదు భద్రతపై ఉద్యోగులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి వస్తోంది. ఉద్యోగుల సంఖ్య తక్కువ, సేవలు ఎక్కువ కావడంతో అన్ని రకాల సేవల్లో కొంత జాప్యం తలెత్తుతుంది. దీన్ని నివారించడంతో పాటు పారదర్శకమైన సేవలు అందించేందు కోసం తపాలా శాఖ నగదు రహిత సేవలకు నిర్ణయం తీసుకుంది. బ్యాంకుల తరహాలో సేవలను వేగవంతం చేసేందుకు పాయింట్ ఆఫ్ సేల్ మెషీన్ల వాడకం అవసరమని నిర్ణయించింది. ఇందుకోసం ఎస్బీఐతో ఒప్పందం చేసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 25 వేల పోస్టాఫీసుల్లో పీవోఎస్‌లను ప్రవేశ పెట్టాలని ఇటీవలే నిర్ణయం తీసుకున్న పోస్టల్ బోర్డు సంబంధిత మార్గదర్శకాలను అన్ని సర్కిళ్లకు పంపింది. దీంతో తెలంగాణ పోస్టల్ సర్కిల్ అధికారులు తొలి విడతగా సికింద్రాబాద్, వరంగల్ హెడ్ పోస్టాఫీసుల్లో పీవోఎస్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఏపీ సర్కిల్ అధికారులు కూడా వచ్చే రెండునెలల్లో 25 ప్రధాన పోస్టాఫీసుల్లో వీటిని ఏర్పాటు చేయడం ద్వారా సేవలను వేగవంతం చేయాలని యోచిస్తున్నారు. పీవోఎస్ మెషీన్లు అందుబాటులోకి వస్తే జనమంతా తమకున్న క్రెడిట్, డెబిట్ కార్డులను వినియోగించి స్పీడ్ పోస్టు, రిజిస్టర్డ్ పోస్ట్, మనీ ఆర్డర్, నగదు బదిలీ వంటి అన్ని రకాల మెయిళ్లను నగదు లేకుండా నిర్వహించుకునే వీలుంది. పోస్టల్ డిపార్ట్మెంట్లో ప్రస్తుతం రోజుల్లో లభించే సేవలన్నీ గంటల్లో అందుబాటులోకి వచ్చే వీలుంది. -
నేడు జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ భేటీ
-
రేపు జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ భేటీ
హైదరాబాద్: ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం సమావేశంకానున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు ప్రగతి భవన్లో ఈ భేటీ జరగనుంది. కలెక్టర్ల సమావేశంలో చర్చించాల్సిన 20 అంశాల ఎజెండాను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. రాష్ట్రంలో నోట్ల రద్దుతో ప్రజల పడుతున్న ఇబ్బందులు, నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు అవగాహన, మిషన్ కాకతీయ పనులపై జిల్లా కలెక్టర్లు, అధికారులకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేయనున్నారు. ఈ సమావేశానికి అన్ని జిల్లాల పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు హాజరవుతారు. -
ఆర్టీఏలో నగదు రహిత సేవలు
రేపటి నుంచి ప్రారంభం ప్రతిరోజు 723 మందికే స్లాట్ బుకింగ్‌కు అవకాశం రవాణాశాఖలో 57 రకాల ఆన్లైన్ సేవలు పని ఒత్తిడికి లోనవుతున్న సిబ్బందికి ఉపశమనం ఆధునిక టెక్నాలజీని వినియోగించుకోవాలని అధికారుల పిలుపు ఖిలా వరంగల్ : వరంగల్ ఉప రవాణాశాఖ కార్యాలయంలో రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్‌తోపాటు ఇతర అన్నిరకాల సేవలు ఇప్పటి నుంచి ఆన్లైన్ ద్వారానే అందనున్నాయి. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ఆర్టీఏ అధికారులు ఈనెల 2వ తేదీ నుంచి 57 రకాల ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటివరకు ఆన్లైన్ సర్వీసుల్లో లెర్నింగ్, పర్మనెంట్ లైసెన్స్‌లతోపాటు 15 రకాల సేవలకు స్లాట్ బుకింగ్ ఉండేది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న విధానం తో 57 రకాల సేవలు నగదు రహితంగా అందనున్నాయి. ఆన్లైన్ సేవలతో ప్రజలకు వేగంగా సేవలు అందడంతోపాటు సిబ్బం దిపై పనిభారం కూడా తగ్గుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌లు నగదు రహిత సేవలను లాంఛనంగా ప్రారంభించగా.. మంగళవారం నుంచి వరంగల్‌లో అందుబాటులోకి రానున్నాయి. సకాలంలో సేవలు వరంగల్ ఆర్టీఏ కార్యాలయంలో మొత్తం 57 రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం ప్రతి రోజు జిల్లా వ్యాప్తంగా 723 మందికి స్లాట్ బుకింగ్ చేసుకునే ఆవకాశం కల్పించింది. ఇందులో లైసెన్స్‌లు 152, ఎల్‌ఎల్‌ఆర్‌లు 127, పర్మనెంట్ లైసెన్స్‌లు, ఇతరాలు 57, ఫ్రెష్ వా హన రిజిస్ట్రేషన్లు 271, ఫిట్నెస్లు 66, పర్మిట్లు 49, సబ్ కార్యాలయం జనగామలో 95, మహబూబాబాద్‌లో 125 మందికి ఆ¯Œæలైన్ ద్వారా సేవలు అందుతాయి. ఈ–సేవ, మీ–సేవ సెంటర్ నిర్వాహకులు అందజేసిన పత్రాలు చూపిన ప్రతి వాహనదారుడికి సేవలు అందుతాయి. వాహనదారుల వాహన ఇన్సూరెన్స్, పొల్యుషన్ సర్టిఫికెట్లను చూపిస్తే ఆర్టీఏ కార్యాలయంలో వేలిముద్ర, ఫొటోను తీసి సంబంధిత టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారికి అధికారులు సంబంధిత పత్రాలను వెంటనే అందజేయనున్నారు. నగదు మాటే ఉండదు వరంగల్ ఆర్టీఏ కార్యాలయంలో ఈనెల 2వ తేదీ నుంచి నగదు రహిత సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ–సేవ, మీ–సేవల్లో స్లాట్ బుకింగ్ చేసుకున్న వాహనదారులు తమకు కేటాయించిన తేదీ రశీదును చూపిస్తే సేవలు అందుతాయి. వాహనదారుల నుంచి ఆర్టీఏ ఎలాంటి నగదు తీసుకునే అవకాశం ఉండదు. ఆన్లైన్ విధానంతో జీరో కౌంటర్ల వద్ద వాహనదారుల రద్దీ కూడా పూర్తిగా తగ్గుతుంది. ఆన్లైన్లో పొందడం ఇలా.. 1. ఆర్టీఏ వెబ్సైట్ htt@//www. transport.telangala.gov.inకు యాక్సిస్ చేసి ఆన్లైన్ సర్వీసులపై వాహనదారుడు క్లిక్ చేయాలి. ఆప్పుడు వాహనదారుల వ్యవహారం రకం అనగా.. ప్రస్తుత సందర్భంలో ఎల్ఎల్ఆర్ కొరకు దరఖాస్తుపై క్లిక్ చేసి అవసరమైన డేటా పూర్తి చేయాలి. 2 వివరాలను పూర్తి చేసిన తర్వాత వాహనదారుడు తనకు అనుకూలమైన తేదీల్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. 3. దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత వాహనదారుడి సెల్‌కు కార్యాలయానికి వచ్చేటప్పుడు తీసుకురావాల్సిన డాక్యుమెంట్ల వివరాలకు సంబంధించిన మెసెజ్ వస్తుంది. 4. వాహనదారులు అవసరమైన ఫీజును ఆన్లైన్లో లేదా ఈ–సేవ కౌంటర్లో చెల్లించాలి. 5. వాహనదారులు అవసరమైన డాక్యుమెంట్లతోపాటు పూర్తి చేసిన ఫారం ప్రింట్ అవుట్ లేదా ఎస్ఎంఎస్తో నిర్ణీత తేదీ, సమయంలో ఎంపిక చేసుకున్న స్లాట్ ప్రకారం కార్యాలయానికి రావాలి. 6. వాహనదారుడి మొబైల్లో ఎస్ఎంఎస్ చూపిన తర్వాత కౌంటర్ సిబ్బంది ఫారం ప్రింట్ అవుట్ తీసుకుని సంతకం తీసుకుంటారు. 7. వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ ఫీజు, కొత్త వాహనాల హెచ్ఎస్ఆర్పీ నంబర్ ప్లేట్ రుసుములు డీలర్ స్థాయిలోనే సేకరించబడుతాయి. 8. అన్ని కౌంటర్లలో లేజర్ ప్రింటర్ వెబ్ కెమెరా, థంబ్ క్యాప్చరింగ్ యూనిట్, సిగ్నేచర్ క్యాప్చరింగ్ యూనిట్ ఉంటుంది. ఫొటో తీసేందుకు లేదా ఇతర పనికి సింగిల్ కౌంటర్‌ను దాటి దరఖాస్తుదారుడు తిరగాల్సిన అవసరం ఉండదు. 9. ఆన్లైన్ సేవల అమలు తీరును సిబ్బంది ప్రతిచోట ప్రచారం చేస్తారు.