డబ్బు పోయే.. వైద్యం లేదాయే | Cashless Medical Services Stopped Completely In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

డబ్బు పోయే.. వైద్యం లేదాయే

Jan 20 2019 10:24 AM | Updated on Jul 12 2019 6:01 PM

Cashless Medical Services Stopped Completely In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: నగదు రహిత వైద్యంపై ఉద్యోగులు, పెన్షనర్ల ఆశలు అడియాశలే అవుతున్నాయి. ఈ ఏడాది జనవరి 1వ తేదీనుంచి రాష్ట్రంలో ఉద్యోగులకు, పెన్షనర్లకు, వారి కుటుంబ సభ్యులకు అందాల్సిన నగదు రహిత వైద్యసేవలు పూర్తిగా ఆగిపోయాయి. ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి నెలనెలా డబ్బులు వసూలు చేస్తూ కూడా ఆ డబ్బులు ప్రైవేటు ఆస్పత్రులకు చెల్లించకపోవడంతో వైద్యసేవలు ఆగిపోయిన విషయం తెలిసిందే. సుమారు రూ. 200 కోట్ల బకాయిలు ఉండటంతో ప్రైవేటు ఆస్పత్రులన్నీ సేవలు ఆపేశాయి. నగదు చెల్లిస్తేనే వైద్యం అందిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు ఇబ్బందిపడుతున్నారు. డబ్బులు చేతిలో ఉంటేనే వైద్యం అందుతోంది. లేదంటే ఆ బిల్లులు రీయింబర్స్‌మెంటుకు దరఖాస్తు చేసుకోవాలి. ఆ డబ్బు తిరిగి ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి. ఈ ఏడాదైనా వైద్యం సక్రమంగా అందించి, పథకాన్ని గాడిన పెడతారని భావించిన ఉద్యోగులకు ప్రభుత్వ పెద్దల తీరు మింగుడు పడటంలేదు. వైద్యసేవలు ఆగిపోయి 20 రోజులు గడిచినా సర్కారు నుంచి స్పందన లేకపోవడంతో ఉద్యోగుల్లో అసంతృప్తి పెల్లుబుకుతోంది.

పెన్షనర్ల ఇబ్బందులు వర్ణనాతీతం
రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల మందికిపైగా పెన్షనర్లు ఉన్నాయి. వీరిలో ఎక్కువ మందిని అనారోగ్య సమస్యలు పీడిస్తున్నాయి. వైద్యసేవల కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతుంటే వారికి వైద్యం అందడంలేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో అర్థం కావడం లేదని వారు వాపోతున్నారు. నగదు చెల్లించి వైద్యం చేయించుకోవడం తమవల్ల కాదంటున్నారు. లక్షలాది రూపాయలు ఎక్కడ తేవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యం అందించలేని సర్కారు.. నెలనెలా తమ వద్ద నుంచి ఎందుకు డబ్బులు వసూలు చేసిందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పలు ఉద్యోగ సంఘాలు కూడా సర్కారు తీరుపై విరుచుకుపడ్డాయి. నాలుగున్నరేళ్లుగా నగదు రహిత వైద్యం సరిగా అందకపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడుతున్నారు. నగదు రహిత వైద్యమందించే పథకంలోని జాబితాలో 438 ఆస్పత్రులు ఉండగా అందులో 50 పడకలు దాటిన ఏ ఆస్పత్రికూడా వీరికి వైద్యం అందించడం లేదు.

బకాయిలు కారణంగానే ఈ నిర్ణయం
ప్రస్తుతం నగదు చెల్లిస్తేనే వైద్యం అందిస్తున్నాం. ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు సంబంధించి బకాయిలు చెల్లించని కారణంగా వైద్యసేవలు నిలిపివేశాం. నగదు చెల్లించి వైద్యం చేయించుకుని ఆ తర్వాత ప్రభుత్వం వద్ద రీయింబర్స్‌ చేసుకోవచ్చు. సోమవారం గానీ మంగళవారం గానీ చర్చలకు పిలుస్తామని మంత్రి ఫరూక్‌ చెప్పారు.    – ఏపీ ప్రైవేటు ఆస్పత్రుల సంఘం నేతలు

నేడు జరిగే జేఏసీలో తీర్మానిస్తాం
నేడు విజయవాడలో ఏపీ ఎన్జీవో జాయింట్‌ యాక్షన్‌ కమిటీ సమావేశం జరుగుతోంది. ఇందులో పలు అంశాలు చర్చకు వస్తాయి. అందులో ప్రధానంగా నగదు రహిత వైద్యం చర్చకు వస్తుంది. దీనిపై ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయిస్తాం. ఉద్యోగుల వైద్యం విషయం ప్రాధాన్యతాంశంగా గుర్తిస్తాం.
–చంద్రశేఖర్‌రెడ్డి, అధ్యక్షుడు, ఏపీ ఎన్జీవో సంఘం

పెన్షనర్లు నలిగిపోతున్నారు
రాష్ట్రవ్యాప్తంగా వైద్యం అందక పెన్షనర్లు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వృద్ధాప్యంలో ఆరోగ్యసమస్యలు వారిని చుట్టుముడుతున్నాయి. 20 రోజులుగా సేవలు అందకపోయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం బాధాకరం.
– ఆస్కారరావు, అధ్యక్షుడు, ఏపీ పబ్లిక్‌హెల్త్‌ అండ్‌ మెడికల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ 

సంఘాలన్నీ పోరాడాలి
మా నుంచి డబ్బు వసూలు చేస్తూ కూడా వైద్యం అందించకపోవడం దారుణం. దీనిపై ప్రశ్నించే వారే లేకపోవడం బాధ కలిగిస్తోంది. వివిధ ఉద్యోగ సంఘాలన్నీ దీనిపై పోరాడేందుకు సిద్ధంగా ఉండాలి. లేదంటే ఆయా సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు అన్యాయం చేసినవారవుతారు. ఇప్పటికైనా అందరూ కలిసి రావాలి.
–వెంకట్రామిరెడ్డి, మాజీ అధ్యక్షుడు, సచివాలయ ఉద్యోగుల హౌసింగ్‌ సొసైటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement