గత ఐదేళ్లల్లో ఏం ప్రశ్నించావ్‌..?

YSRCP MLA Jakkampudi Raja Fires On Pawan Kalyan - Sakshi

పవన్‌కల్యాణ్‌పై జక్కంపూడి రాజా ఫైర్‌..

సాక్షి, రాజమండ్రి: ప్రశ్నిస్తానంటూ 2014లో జనసేన ఏర్పాటు చేసిన పవన్‌కల్యాణ్‌ గత ఐదేళ్లలో ఏం ప్రశ్నించారని కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నిలదీశారు. ఆదివారం ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఎంపీ భరత్ రామ్, రాజమండ్రి పార్లమెంటు అధ్యక్షులు మోషేన్‌ రాజుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. పవన్‌కల్యాణ్‌ డ్యాన్సులు, డైలాగ్‌లకు ఆకర్షితులై కాపు యువత సొంత డబ్బుతో కార్యక్రమాలు చేశారని, ఐదేళ్ల  టీడీపీ ప్రభుత్వం హయాంలో ఒక అంశంపై కూడా ఆయన ప్రశ్నించలేదని రాజా దుయ్యబట్టారు. టీడీపీ ఇరుకున పడిన సందర్భాల్లో మాత్రమే పవన్‌కల్యాణ్‌ బయటకు వచ్చి మాట్లాడేవారని ఆయన విమర్శించారు. (టీడీపీ మత్తులో పవన్‌ కల్యాణ్)

కాపులకు అన్యాయం జరిగినా ప్రశ్నించలేదు..
‘‘గత టీడీపీ ప్రభుత్వ పాలనలో కాపు కార్పొరేషన్‌ నుంచి 1600 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అంత తక్కువ ఖర్చు చేయడంపై పవన్‌కల్యాణ్‌ ఎందుకు ప్రశ్నించలేదు. కాపులకు రిజర్వేషన్ కల్పిస్తానని మేనిఫెస్టోలో పెట్టిన చంద్రబాబు..ఆ హామీని విస్మరించారు. దీనిపై పవన్‌ ఎందుకు మాట్లాడలేదు. రిజర్వేషన్ల గురించి అడిగిన ముద్రగడ తో పాటు వేల మందిపై కేసులు పెట్టారు. అప్పుడు కూడా ఆయన ఎందుకు నోరు మెదపలేదు. చంద్రబాబు ప్రభుత్వాన్ని భుజాల మీద మోసే ప్రయత్నం చేశారు తప్ప కాపులకు అన్యాయం జరిగినా ప్రశ్నించే ప్రయత్నం మాత్రం చేయలేదంటూ’’  రాజా నిప్పులు చెరిగారు. చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో అవినీతి మాత్రమే ఎజెండాగా పెట్టుకుని పనిచేశారని విమర్శించారు. (కాపులపై బాబు ఉక్కుపాదం మోపినప్పుడు ఎక్కడున్నావ్‌ పవన్‌?)

ఆ విషయం గుర్తుపెట్టుకోండి.
రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసిన పవన్‌కల్యాణ్‌ భారీ తేడాతో ఓడిపోయారు. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా మూడు పార్టీలతో కలిసి పోటీ చేస్తే ప్రజలు మీకు ఎన్ని సీట్లు ఇచ్చారో ఆత్మపరిశీలన చేసుకోవాలని రాజా హితవు పలికారు. ప్రజలు మిమ్మల్ని ఒక సీటుకు మాత్రమే పరిమితం చేశారన్న సంగతితో పాటు, కాపులు విశ్వసించడం లేదనే ఆ విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలని జక్కంపూడి రాజా అన్నారు. ప్రజా సంకల్పయాత్రలో వైఎస్‌ జగన్‌ ప్రజల కష్టాలు స్వయంగా గమనించారని, రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం నిర్ణయించారని తెలిపారు. త్వరలో ప్రజల్లోకి వెళ్లేందుకు సీఎం జగన్ సిద్ధపడుతున్నారని చెప్పారు. అర్హులైన ఏ ఒక్కరికి ఇల్లు లేదనే మాట వినకూడదనేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉద్దేశ్యమని ఆయన స్పష్టం చేశారు. అన్ని సౌకర్యాలతో ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top