- భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో తొలి విమానం ల్యాండింగ్
- వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ హర్షం
- ఏపీ అభివృద్ధి మార్గంలో ఒక మైలు రాయి.. మా పాలనలో వేగవంతమైన అనుమతులు.. గణనీయమైన భాగం అప్పుడే పూర్తి
- పునరావాసం, భూసేకరణ కోసం సుమారు రూ.960 కోట్ల ఖర్చు
- ఆ కృషే ఇవాళ్టి కీలక మైలు రాయిని చేరేందుకు ముఖ్య కారణం
- ఎయిర్‌పోర్టు నిర్మాణంలో అసాధారణ కృషి చేసిన జీఎంఆర్ గ్రూపునకు అభినందనలు.. పోర్ట్–ఎయిర్‌పోర్ట్ బైపాస్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సహకారం నాకు గుర్తుంది
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో కొత్తగా నిర్మించిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో తొలి విమానం ల్యాండింగ్ కావడంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. విమానాశ్రయం ఏర్పాటు కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే అనుమతులు సాధించడంతో పాటు ప్రధాన పనుల్లో గణనీయమైన భాగం అప్పుడే పూర్తయిందన్నారు. ‘విశాఖపట్నంలో కొత్తగా నిర్మించిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో తొలి విమానం ల్యాండింగ్ కావడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మార్గంలో ఒక మైలు రాయి.
విజన్ వైజాగ్ లక్ష్యాన్ని సాధించే దిశగా కీలక అడుగు పడింది. మా పాలనా కాలంలో వేగవంతమైన అనుమతులు సాధించడమే కాదు.. ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వారి పునరావాసం కోసం, భూసేకరణ కోసం సుమారు రూ.960 కోట్లు ఖర్చు చేశాం. తద్వారా ఈ ప్రాజెక్టుకు బలమైన పునాది వేశాం. ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రధాన పనుల్లో గణనీయమైన భాగం అప్పుడే పూర్తయింది.
As the first flight prepares to land in Vizag, Andhra Pradesh accelerates on its growth runway, marking a significant milestone for #VisionVizag.
Congratulations to the GMR Group for their exceptional efforts. During our tenure expedited permissions, timely approvals and land…— YS Jagan Mohan Reddy (@ysjagan) January 4, 2026
ఆ రోజు మేం చేసిన కృషి.. ఇవాళ్టి ఈ కీలక మైలు రాయిని చేరుకునేందుకు ముఖ్య కారణంగా నిలిచింది. ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణంలో అసాధారణ కృషి చేసిన జీఎంఆర్ గ్రూప్‌కు నా హృదయ పూర్వక అభినందనలు. అలాగే, విశాఖపట్నం పోర్టును భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో అనుసంధానించే భోగాపురం ఎయిర్‌పోర్ట్ బైపాస్ జాతీయ రహదారి ప్రాజెక్ట్‌కు 2023 మార్చిలో ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సహకారం, కృషి నాకు గుర్తుంది’ అని వైఎస్ జగన్ ఆదివారం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశారు.



