టీడీపీ హయాంలోనే 100 ప్రాంతాల్లో వేలం

YSRCP MLA Chevireddy Bhaskar Reddy Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, అమరావతి : వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట పెంచే విధంగానే తమ ప్రభుత్వం పనిచేస్తుందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ స్పష్టం చేశారు. దేవుడి ఆస్తులను పెంచడానికే ప్రభుత్వం కృషిచేస్తోందని అన్నారు. శ్రీవారిపై అత్యంత భక్తిభావం ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని, తిరుమలకు కాలినడకన వెళ్లి అనేక సార్లు స్వామివారిని దర్శించుకున్నారని పేర్కొన్నారు. టీటీడీని ఉపయోగించుకుని రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచన ప్రభుత్వానికి లేదని వివరించారు. ప్రస్తుత ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడే 100 ప్రాంతాల్లో టీటీడీ ఆస్తులు విక్రయించారని గుర్తుచేశారు. రూ.6కోట్ల విలువైన ఆస్తులను చంద్రబాబు హయాంలో వేలం వేశారని చెవిరెడ్డి తెలిపారు. (అవన్నీ నిరర్థక ఆస్తులే: వైవీ సుబ్బారెడ్డి)

టీటీడీ ఆస్తుల విక్రయాలపై ఆదివారం మీడియా సమావేశంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడారు. ‘టీటీడీకి ప్రత్యేకమైన యాక్ట్ ఉంది. 1990లోనే దేవస్థాన భూముల అమ్మకం, లీజులు ఇచ్చేందుకు టీటీడీకి హక్కు కల్పించారు. చంద్రబాబు అధికారంలో ఉండగా అప్పటి టీటీడీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్ణయం జరిగింది. ఆ పాలకమండలిలో బీజేపీ నేత భానుప్రకాష్‌ రెడ్డి ముఖ్య సభ్యుడు. ఈనాడు  స్థంస్థల అధినేత రామోజీరావు బంధువు సుచరిత కూడా బోర్డు సభ్యురాలే. ఓ టీడీపీ ఎమ్మెల్యే కూడా అప్పటి కమిటీలో సభ్యుడుగా ఉన్నారు. వాళ్లందరూ ఆమోదించిన తర్వాతే ఈ ఆస్తులు వేలానికి వచ్చాయి.

2015 జులైలో నిరర్థక ఆస్తుల గుర్తింపునకు కమిటీ ఏర్పాటు చేశారు. 2016 జనవరిలో కమిటీ నివేదిక మేరకు ఆస్తుల విక్రయానికి అప్పటి బోర్డు అంగీకరించింది. వేల కోట్ల విలువైన సదావర్తి భూములను 50 కోట్లకు అమ్మాలనుకుంది చంద్రబాబు కాదా?. మానస ట్రస్ట్ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టింది చంద్రబాబు కాదా?. టీటీడీ ఆస్తులను అమ్మితే టీటీడీ కార్పస్ ఫండ్‌కు జమ అవుతుంది ప్రభుత్వానికి కాదు. భగవంతుడిని రాజకీయాల్లోకి లాగడం సరైందికాదు’ అని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. 
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top