చంద్రబాబు పాలనపై అంతటా అసంతృప్తి | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పాలనపై అంతటా అసంతృప్తి

Published Mon, Dec 21 2015 1:33 AM

చంద్రబాబు పాలనపై అంతటా అసంతృప్తి - Sakshi

 ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) :రాష్ట్రంలో ప్రభుత్వ విధానాల కారణంగా రైతులు, నిరుద్యోగులు, మహిళలు నిరాశకు గురై ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య నాయకులు బొత్సా సత్యనారాయణ అన్నారు. ఆదివారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో రాష్ట్రంలోని ఏ ఒక్క వర్గమూ సంతృప్తిగా లేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ నాయకులు ఇసుక, మట్టి, మద్యం మాఫియాలు, దందాలు చేస్తున్నారని విమర్శించారు.
 
 15 నెలల వారి పాలనలో రాష్ట్రంలో అధికారులు, మహిళలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. కాల్‌మనీ పేరుతో టీడీపీ నాయకులు మహిళలను వ్యభిచార కూపంలోకి దింపడం దురదృష్టకరమన్నారు. మహిళల అభివృద్ధి కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ వడ్డీలేని రుణాలు అందించారని, చంద్రబాబు అసలు రుణాలు ఇవ్వకుండా మహిళల జీవనంపై ఉక్కుపాదం మోపుతున్నారని అన్నారు. అంగన్‌వాడీలు ఆందోళన చేస్తే వారిని మగ పోలీసులతో ఈడ్పించి వేయడం అత్యంత హేయమన్నారు.
 
 శాసన సభ సమావేశాల్లో తమ సమస్యల పరిష్కారంపై చర్చిస్తారని ఆశించిన వర్గాలను ఈ సర్కారు నిరాశపరిచిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పరిణామాలు, ఒకప్పుడు దేశంలోని నాగాలాండ్, మేఘాలయ, బీహార్, తమిళనాడు రాష్ట్రాల్లో జరిగిన పరిణామాల్లా ఉన్నాయన్నారు. ఇటీవల నిర్వహించిన జన చైతన్య యాత్రల వల్ల ప్రజలకు ఒరిగిందేమిటని బొత్స ప్రశ్నించారు. ప్రజలు చైతన్యవంతమై సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. తమ పార్టీ ఎమ్మెల్యే రోజాను సస్పెండ్ చేసిన విధానం దురదృష్టకరమన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొయ్యే మోషేన్‌రాజు, చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ ఘంటా మురళి, నగర అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు, నగర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.జాన్ గురునాథ్, పి.ప్రసాద్, ఎం.సదానంద కుమార్ తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement