‘బాబు’ను నమ్మి మోసపోయాం | we cheated to believe of chandrababu naidu | Sakshi
Sakshi News home page

‘బాబు’ను నమ్మి మోసపోయాం

Aug 21 2014 3:35 AM | Updated on Aug 14 2018 3:48 PM

డ్వాక్రా రుణాలు రద్దుచేస్తామంటూ ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు చెబితే నమ్మాం.

కందుకూరు అర్బన్ : ‘డ్వాక్రా రుణాలు రద్దుచేస్తామంటూ ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు చెబితే నమ్మాం. ఓట్లేసి గెలిపించాం. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ మా రుణాలు రద్దుచేస్తారని ఆశగా ఎదురుచూస్తున్నాం. కానీ, చేయకపోగా, బ్యాంకుల్లో మేం తీసుకుని చెల్లించలేకపోయిన రుణాల కింద మేమంతా కష్టపడి పొదుపు చేసుకున్న నగదును జమ చేసుకుంటున్నారు.

చంద్రబాబును నమ్ముకుని ఎంతో మోసపోయాం. ఎలాగోలా బ్యాంకులకు రుణాలు చెల్లిస్తాం. అప్పటి వరకూ పొదుపు నగదు జమచేసుకోవద్దు’... అంటూ 11 స్వయం సహాయక సంఘాల మహిళలు బుధవారం కందుకూరు కార్పొరేషన్ బ్యాంకు మేనేజర్‌ను కలిసి వేడుకున్నారు. పట్టణంలోని ఒకటో వార్డుకు చెందిన శ్రీవెంగమాంబ, జై సంతోషమాత, శ్రీసాయిరాం, కిరణ్మయి తదితర మొత్తం 11 స్వయం సహాయక సంఘాల మహిళలు ఒక్కో సంఘం వారు సుమారు రూ.3 లక్షల చొప్పున స్థానిక కార్పొరేషన్ బ్యాంకులో రుణాలు తీసుకున్నారు.

తాము తీసుకున్న రుణాలను అష్టకష్టాలు పడుతూ ప్రతినెలా సక్రమంగా చెల్లిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల హామీల్లో భాగంగా డ్వాక్రా రుణాలు రద్దుచేస్తామని చంద్రబాబునాయుడు ప్రకటించడంతో సంఘాల మహిళలంతా ఆనందపడి నాలుగు నెలలుగా రుణాలు కట్టడం మానేశారు. దీంతో వారు పొదుపు చేసుకున్న నగదును బ్యాంకు అధికారులు రుణాల కింద జమచేసుకుంటున్నారు.

 విషయం తెలుసుకున్న మహిళలు బుధవారం ఆ బ్యాంకు మేనేజర్‌ను కలిసి నిలదీశారు. రుణమాఫీ జరగకపోవడంతో అలా చేయాల్సివచ్చిందని మేనేజర్ చెప్పడంతో..చంద్రబాబును నమ్ముకుని మోసపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాగోలా రుణాలు చెల్లిస్తామని, పొదుపు నగదు జమ చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement