అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ పట్టుబట్టి రాష్ట్ర విభజన బిల్లును లోక్‌సభలో మంగళవారం ఆమోదించడంపై జిల్లాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
సాక్షి, నెల్లూరు: అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ పట్టుబట్టి రాష్ట్ర విభజన బిల్లును లోక్‌సభలో మంగళవారం ఆమోదించడంపై జిల్లాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. టీ బిల్లు ఆమోదం పొందిన వెంటనే జిల్లా వ్యాప్తంగా ఎన్‌జీఓలు, ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. రోడ్లపైకి వచ్చి రాస్తారోకోలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా దిష్టిబొమ్మలను దహనం చేశారు. విభజనకు సహకరించిన బీజేపీని సైతం దుమ్మెత్తి పోశారు. సీమాంధ్రుల ఉసురు తప్పదని, సీమాంధ్రలో రెండు పార్టీలు భూస్థాపితం కాక తప్పదని ప్రజలు శాపనార్థాలు పెట్టారు. పోలీసులు జిల్లాలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, బీజేపీ జాతీయ నేత వెంకయ్యనాయుడు, రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో పాటు పలువురి ఇళ్ల వద్ద బందో బస్తు పెంచారు. నిరసనలు పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనతో అదనపు పోలీసు బలగాలను జిల్లాకు రప్పిస్తున్నారు.
జాతీయ నేతల విగ్రహాల వద్ద బందోబస్తు పెంచారు. ఏకపక్షంగా టీ బిల్లు ఆమోదించడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ బుధవారం బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌కు ఆర్టీసీ కార్మికులు మద్దతు పలికారు. టీ బిల్లు ఆమోదంతో ఎన్‌జీఓలు బుధవారం సమ్మెను విరమించి గురువారం నుంచి విధులకు హాజరు కానున్నారు. మొత్తం 84 రోజుల పాటు ఉద్యోగులు సమ్మెకు దిగి సమైక్యాంధ్ర కోసం త్యాగం చేశారు. రాష్ట్ర విభజనతో సీమాంధ్ర తీవ్రంగా నష్టపోతుందని, ముఖ్యంగా దిగువన ఉన్న నెల్లూరు జిల్లాకు కృష్ణా జలాలు దక్కే పరిస్థితి లేక పోవడంతో ఈ ప్రాంతానికి సాగునీటితో పాటు తాగునీరు కూడా అందే పరిస్థితి లేదని ఎన్‌జీఓలు, విద్యార్థులు, మేధావులు, వివిధపార్టీల నేతలు, రైతులు గగ్గోలు పెట్టారు. అయినా ఓట్లు, సీట్లు ప్రాతిపదికన రాజకీయాలు నెరిపిన అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ మనసు కరగలేదు.
జిల్లాలో నిరసనలు
రాష్ట్ర విభజనను నిరసిస్తూ జిల్లాలో సమైక్యవాదులు నిరసనలు చేపట్టారు. వెంకటగిరిలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ వీరారెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై టైర్లు దగ్ధం చేశారు. సోనియా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ట్రాఫిక్ స్తంభించింది. దీంతో పోలీసులు దాదాపు 30 మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారిని సొంత పూచీకత్తుపై వదిలిపెట్టారు. వెంకటగిరిలో టీడీపీ కార్యకర్తలు సైతం సోనియా దిష్టిబొమ్మను దహనం చేసి ఆందోళన చేపట్టారు. ఆత్మకూరులో టీడీపీ కార్యకర్తలు గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. వాకాడులో ఎన్‌జీఓలు రాస్తారోకో చేసి టీ బిల్లుల ప్రతులను తగులబెట్టారు.