వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం | Sakshi
Sakshi News home page

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం

Published Tue, Sep 17 2013 3:21 AM

Two men killed in separate road accidents

జగ్గయ్యపేట(వేపాడ), న్యూస్‌లైన్ : జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. మండలంలోని జగ్గయ్యపేట గ్రామసమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... విశాఖ జిల్లా దుంబ్రిగుడ మండలం కొర్ర గ్రామానికి చెందిన గుజ్జుల చిరంజీవి విద్యుత్ శాఖలో పని చేస్తున్నాడు. కరెంట్ సామగ్రి కొనుగోలు చేసేందుకు అదే జిల్లా దేవరాపల్లి మండలం నాగయ్యపేట గ్రామానికి చెందిన నీలంశెట్టి ఈశ్వరరావు(40)తో కలసి ద్విచక్ర వాహనంపై బయల్దేరారు.
 
 పనిలోపనిగా వేపాడలో ఉంటున్న తన అత్తవారింటికి వెళ్లొద్దామని చిరంజీవి అనడంతో ఈశ్వరరావు అంగీకరించాడు. ఇద్దరూ ఎస్.కోట వెళ్లి తిరిగి వేపాడ మండలం వావిలపాడు వెళ్తుండగా రామకోవెల సమీపంలో ఎదురుగా వస్తున్న వ్యానును తప్పించబోయి కింద పడ్డారు. వాహనం వెనుక కూర్చొన్న నీలంశెట్టి ఈశ్వరరావు తలపై నుంచి వ్యాను వెనుక చక్రం వెళ్లడంతో సంఘటన స్థలంలోనే అతను మృతి చెందాడు. ప్రమాదానికి బాధ్యత వహిస్తూ వ్యాన్ డ్రైవర్ వల్లంపూడి పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ద్విచక్ర వాహన చోదకుడు చిరంజీవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ఎస్.నారాయణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతుడు ఈశ్వరరావుకు భార్య రమణమ్మతోపాటు, కుమారుడు, కుమార్తె ఉన్నారు. గ్రామాల్లో చిన్నచిన్న వైరింగు పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. 
 
 గుర్తు తెలియని వాహనం ఢీకొని...
 భోగాపురం : స్థానిక జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని తోటపల్లి గ్రామానికి చెందిన తాటిపూడి గురయ్య (35)  పూసపాటిరేగలో ఉంటున్న చెల్లి వద్దకు వెళ్లివస్తానని ఇంటి నుంచి బయల్దేరాడు. రాత్రి పూటుగా తాగి, నాతవలస టోల్‌గేటు వద్ద కొంతమందితో గొడవపడ్డాడు. హైవే పెట్రోలింగ్ సిబ్బంది వచ్చి అతనిని పంపించివేశారు. అనంతరం తాగిన మైకంలో రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న అతనిని గుర్తు తెలియని వాహనం ఢీకొంది. తీవ్ర గాయాలపాలై సంఘటన స్థలంలోనే అతను మృతి చెందినట్లు ఎస్సై షేక్ సర్దార్‌ఘని తెలిపారు. కాగా, మృతుడు గురయ్యకు గతంలో రెండుసార్లు వివాహం జరిగింది. ఇద్దరితోనూ విడాకులైపోయాయి. అప్పటి నుంచి తల్లి వద్దే అతను ఉంటున్నాడు. ప్రమాద ఘటనపై హెచ్‌సీ కృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
Advertisement