జంట హత్యలు

Two Brutally Murdered in Anantapur District - Sakshi

రజాపురంలో దారుణం 

 మహిళ, పసికందు హత్య 

మృతులు తల్లీ కొడుకులుగా అనుమానం 

గుత్తి రూరల్‌: రజాపురంలో దారుణం జరిగింది. జంట హత్యలతో కలకలం రేగింది. బండరాయితో మోది మహిళను, గొంతు నులిమి ఐదు నెలల పసికందును దుండగులు హత్య చేశారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. శనివారం గుత్తి మండలం రజాపురం శివారులో జాతీయ రహదారి పక్కన కంకర కుప్పల్లో 28 – 30 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని మహిళ, 4 – 5 నెలల వయసు కలిగిన మగ శిశువు మృతదేహాలను ఆటోడ్రైవర్లు గుర్తించారు. సమాచారం అందుకున్న సీఐ ప్రభాకర్‌గౌడ్, ఎస్‌ఐ వలిబాషు, యువరాజులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. 

మృతదేహాలకు కొద్ది దూరంలో జీఎస్‌బీసీ కాలువలో రక్తపు మరకలు, ఓ బ్యాగు లభించాయి. మహిళ మృతదేహానికి కొద్ది దూరంలో మట్టి తవ్వి కింద దాచిపెట్టిన రక్తపు మరకలు ఉన్న షర్టు కూడా దొరికింది. బ్యాగును తెరచి చూడగా అందులో మృతురాలి దుస్తులు, శిశువుకు పాలు తాపే గ్లాసులు, మందులు, మాత్రలు కనిపించాయి. సంఘటన జరిగిన ప్రదేశానికి కొద్ది దూరంలో పెనుగులాట జరిగిన ఆనవాళ్లు ఉన్నాయి. పెనుగులాటలో ఒక పాదరక్ష, చేతి గాజులు విరిగి కిందపడినట్లున్నాయి. మహిళ మృతదేహం పక్కన శిశువుకు తాపేందుకు వెంట తెచ్చుకున్న బాటిల్‌లోని పాలు, బేబీ బెడ్‌ పడి ఉన్నాయి. 

హత్యాస్థలిని పరిశీలించిన డీఎస్పీ 
హత్య జరిగిన ప్రదేశాన్ని తాడిపత్రి ఇన్‌చార్జ్‌ డీఎస్పీ విజయకుమార్‌ శనివారం పరిశీలించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేయాలని, 24 గంటల్లోగా హతుల ఆచూకీ తెలుసుకోవాలని, విచారణ నిమిత్తం వైఎస్సార్‌ జిల్లాకు ఓ బృందాన్ని పంపాలని సీఐ ప్రభాకర్‌గౌడ్‌ను ఆదేశించారు.  

డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌ టీం విచారణ 
సంఘటనపై పోలీసులు డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌ టీంను రప్పించారు. పోలీసులు జాగిలం హత్య జరిగిన ప్రదేశంతో పాటు పరిసరాలు మొత్తం కలియతిరిగింది. క్లూస్‌ టీం సంఘటనా స్థలంలో వేలి ముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. 

మృతురాలు వైఎస్సార్‌ కడప జిల్లా వాసి? 
సంఘటన స్థలంలో లభించిన బ్యాగులోని ఆధారాలను బట్టి మృతురాలు వైఎస్సార్‌ జిల్లా బద్వేల్‌కు చెందిన లక్ష్మిగా పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. ఆమె బద్వేల్‌లో ఓ ముస్లిం యువకుడిని ప్రేమ వివాహం చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. మృతులను తల్లీ కుమారుడిగా అనుమానిస్తున్నారు. బ్యాగులో లభించిన ఫోన్‌ నంబర్‌ బద్వేల్‌కు చెందిన వారివిగా గుర్తించి మృతదేహాల ఫొటోలను అక్కడి వారికి, పోలీసులకు వాట్సాప్‌ ద్వారా పంపారు. వాటి ఆధారంగానే సదరు మహిళ నాలుగు రోజుల నుంచి బద్వేల్‌లో కనిపించడంలేదని అక్కడి పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top