వైవీకి అభిమాన నీరాజనం

TTD Chairman Yv Subba reddy Grand Welcome By Fans Ongole - Sakshi

సాక్షి, ఒంగోలు : తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్‌గా పదవీ బాధ్యతలను చేపట్టిన వైవీ సుబ్బారెడ్డికి అభిమానులు నీరాజనాలు పలికారు. శనివారం ఉదయం 11.47 గంటలకు వైవీ చైర్మన్‌గా పదవీ బాధ్యతలను చేపట్టారు. 50వ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలను స్వీకరించారు. టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వైవీతో చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారి చిత్రపటాలను వైవీ దంపతులకు అందజేశారు. ఆలయ నియమాల ప్రకారం వైవీ సుబ్బారెడ్డి ఆయన సతీమణి స్వర్ణలతారెడ్డి, కుమారుడు విక్రాంత్‌రెడ్డిలకు స్వాగతం పలికారు. వైవీ ముందుగా తిరుపతి చేరుకొని కాలినడక మార్గం ద్వారా తిరుమల చేరుకున్నారు.

శుక్రవారం కొండపైకి  చేరుకున్నారు. ఆయన వెంట ఒంగోలు నుంచి వెళ్లిన పలువురు అభిమానులు నడిచారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ ద్వారా ప్రధాన ఆలయంలోకి ప్రవేశించి, శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రధాన ఆలయం వైకుంఠ మార్గం వద్ద భక్తితో గోవింద పలికారు. రంగనాయక మండపంలో వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు.

ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ «ప్రతినిధులు వైవీ దంపతులకు స్వాగత, సత్కారాలు నిర్వహించారు. తులాభారం కార్యక్రమంలో వైవీ వెంట రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ప్రభుత్వ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ తిరుమలకు వస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పారిశుద్ధ్యంతో పాటు తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద విషయంలో భక్తులకు విశేషమైన సౌకర్యాలను కల్పిస్తామన్నారు. ప్రపంచంలోనే టీటీడీకి ఒక ప్రశక్తి ఉందని, ఆలయ పవిత్రతకు ఇబ్బందికి కలగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, రాష్ట్ర దేవాదాయ«ధర్మాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావులతో పాటు పలువురు ప్రముఖులు వైవీని అభినందించారు. వందలాది మంది అభిమానులు నీరాజనాలు పలికారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top