కాంగ్రెస్ గూటికి టీఆర్‌ఎస్ బహిష్కృతులు | TRS expatriates Leaders To Join in Congress Party | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ గూటికి టీఆర్‌ఎస్ బహిష్కృతులు

Aug 22 2013 12:34 AM | Updated on Mar 18 2019 7:55 PM

ఓ వైపు విలీనాన్ని ప్రతిపాదిస్తూ, మరోవైపు చేరికల పేరిట కాంగ్రెస్ వేస్తున్న ఎత్తుగడలను టీఆర్‌ఎస్ శ్రేణులను కలవరానికి గురిచేస్తున్నాయి.

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఓ వైపు విలీనాన్ని ప్రతిపాదిస్తూ, మరోవైపు చేరికల పేరిట కాంగ్రెస్ వేస్తున్న ఎత్తుగడలను టీఆర్‌ఎస్ శ్రేణులను కలవరానికి గురిచేస్తున్నాయి.  టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి చేరిన, చేరనున్న వారిలో ఎక్కువ మంది జిల్లాతో రాజకీయ అనుబంధం ఉన్న వారే కావడం ఆసక్తికరంగా మారింది. వీరిలో డాక్టర్ విజయరామారావు పదేళ్లుగా జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం జిల్లా రాజకీయాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. మెదక్ ఎంపీ విజయశాంతి, టీఆర్‌ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు రఘునందన్‌రావును పార్టీ నుంచి బహిష్కరించడంతో ఈ ఇద్దరు నేతలకు పార్టీ కేడర్ దూరంగా ఉంటోంది. విజయశాంతి, రఘునందన్‌రావును పార్టీ నుంచి బహిష్కరించిన సందర్భంలో కనీసం సర్పంచ్ స్థాయి కలిగిన నేత కూడా వారి వెంట లేకపోవడం చర్చనీయాంశమైంది.
 
 ఇలాంటి నేతలను పార్టీలో చేర్చుకోవడంపై కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి నెలకొంది. 2010 ఉప ఎన్నిక సందర్భంగా రఘునందన్‌రావు కాంగ్రెస్‌లో చేరి సిద్దిపేట నుంచి పోటీ చేస్తారనే ప్రయత్నం జరిగింది. రఘునందన్ కూడా జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి ద్వారా కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నించారు. అయితే పటాన్‌చెరుకు చెందిన ఓ కీలక నేత రఘునందన్ చేరికపై అభ్యంతరం చెప్పడంతో అప్పట్లో ఆ ప్రతిపాదన వెనక్కి వెళ్లింది. టీఆర్‌ఎస్ కీలక నాయకుడు హరీష్‌రావుపై ఆరోపణలు గుప్పించిన రఘునందన్‌రావు ఆయనపై పోటీ చేసే లక్ష్యంతోనే ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.
 
 రాములమ్మ రాకపైనా అసంతృప్తి
 మెదక్ ఎంపీ విజయశాంతి పార్టీలో చేరడాన్ని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విజయశాంతి, రఘునందన్ కాంగ్రెస్‌లో చేరిక వెనుక సంగారెడ్డి ఎమ్మెల్యే జయప్రకాశ్‌రెడ్డి హస్తం ఉందంటూ సొంత పార్టీ ఎమ్మెల్యేలు బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. మెదక్ ఎంపీ స్థానంపై కన్నేసిన ఎమ్మెల్సీ, డీసీసీ అధ్యక్షుడు వి.భూపాల్‌రెడ్డి, 2009లో విజయశాంతిపై పోటీ చేసి ఓటమి పాలైన నరేంద్రనాథ్ ఆమె కాంగ్రెస్‌లో చేర్చుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2014లో మరోమారు టికెట్ సాధించడం లక్ష్యంగా నరేంద్రనాథ్ నాలుగేళ్లుగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ వస్తున్నారు. మరోవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేలతో నెలకొన్న అగాథాన్ని కూడా పూడ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. మరోవైపు  విజయశాంతి చేరిక తమ విజయావకాశాలను దెబ్బ తీస్తాయని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు.
 
 విజయశాంతి మాత్రం దిగ్విజయ్ సింగ్, ఏకే ఆంటోని, వీరప్ప మొయిలీ వంటి నేతలతో ఢిల్లీలో మంతనాలు జరుపుతూ, తనకు అధిష్టానంతో నేరుగా సంబంధాలు ఉన్నాయనే సంకేతాలు జిల్లా కాంగ్రెస్ నేతలకు పంపే ప్రయత్నాల్లో ఉన్నారు. ఓ వైపు టీఆర్‌ఎస్ విలీనంపై సంకేతాలు పంపుతున్న కాంగ్రెస్, మరోవైపు బహిష్కృతులను చేర్చుకోవడం ద్వారా తమ పార్టీని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని టీఆర్‌ఎస్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. పార్టీని బలహీన పరచడం ద్వారా విలీనం దిశగా టీఆర్‌ఎస్‌ను నెట్టే ప్రయత్నాల్లో కాంగ్రెస్ ఉన్నట్లు కనిపిస్తోందని టీఆర్‌ఎస్ ముఖ్య నేత వెల్లడించారు. అయితే తాము మాత్రం కాంగ్రెస్ రాజకీయ ఎత్తుగడలకు చిక్కకుండా టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ వ్యూహం ఉందంటూ కార్యకర్తల్లో ఆత్మ విశ్వాసం కల్పించే ప్రయత్నాల్లో ఉన్నట్లు సదరు నేత వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement
Advertisement