నేడు రాయలసీమ చిన్నోడి వర్ధంతి
‘రాయలసీమ చిన్నోణ్ణి... రాళ్ల మద్దె బతికేవాణ్ణి... రాగాలే ఎరగక పోయినా... అనురాగానికి అందేవాణ్ణి..’
తిరుపతి: ‘రాయలసీమ చిన్నోణ్ణి... రాళ్ల మద్దె బతికేవాణ్ణి... రాగాలే ఎరగక పోయినా... అనురాగానికి అందేవాణ్ణి..’ అంటూ సీమ చిన్నోడిగా అందరిచేత పిలిపించుకున్న రాయలసీమ రావిశాస్త్రి పులికంటి కృష్ణారెడ్డి. సీమ ప్రజల కష్టాలను, కండగండ్లను, కరువును, వలసలను తన కథల్లో సహ జాతి సహజంగా జీవద్భాషలో చిత్రించిన అరుదైన కథకుడు పులికంటి. ఆయన 1931 జూలై 30న చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం జక్కదనలో రైతు కుటుంబంలో జన్మించారు. పదమూడేళ్లు భారతీయ రైల్వేలో ఉద్యోగం చేసి కేవలం సాహిత్యం, కళల కోసం ఉద్యోగం వదులుకున్నారు.
పులికంటి కృష్ణారెడ్డి 200 కథలు, 60 కవితలు, 5 దృశ్య నాటికలు, 43 అమ్మిపదాలు రాశారు. గూడు కోసం గువ్వలు, పులికంటి కథలు, కోటిగాడు స్వతంత్రుడయ్యాడు, ఆట వెలదులతోట, గోయిందా గోయిందా, పులికంటి కథావాహిని.. వంటి గ్రంథాలెన్నో వెలువరించారు. తిరుపతి పరసర ప్రాంతాల ప్రజల జీవన మధురిమలు, జాతీయాలు, సామెతలు చిలకరించిన స్వానుభావాలతో నాలుగాళ్ల మంటపం పుస్తకాన్ని ఆవిష్కరించారు. నండూరి సుబ్బారావు ఎంకి పాటల తర్వాత అంతటి వస్తుశిల్ప శోభితమైన పాటలు పులికంటి వారి అమ్మిపదాలే.
ఈయన ‘కామధేను’ పక్ష పత్రికను ఆరేళ్లు నడిపారు. చిత్తూరు జిల్లా రచయితల సంఘానికి ఉపాధ్యక్షులుగా దీర్ఘ కాలం పనిచేశారు. తాను అవార్డులు పొందడం కన్నా ఇతరులకివ్వడమే ఆనందమంటూ ‘పులికంటి సాహితీ సత్కృతి’ స్థాపించి ఎందరో సాహితీ మూర్తులను సత్కరించారు. ఈయన 2007 నవంబర్ 19న తన 76వ ఏట కన్నుమూయడంతో సీమ మాండలికం మూగబోయింది.


