“మొదటి నుంచి నాకు సినిమానే వ్యసనం. సాహిత్య సృజనతో పాటు సినిమా మీదే సమయమంతా గడిపేశాను. జేబులో రూపాయి డబ్బు లేకున్నా, స్నేహసంపదే అండగా సినిమాలు తీయగలిగాను” అని ప్రముఖ రచయిత, ‘భద్రం కొడుకో’ సహా పలు అవార్డు చిత్రాలను అందించిన సినీ దర్శకుడు అక్కినేని కుటుంబరావు అన్నారు.
‘భద్రం కొడుకో’ (1991) చిత్రం నుంచి ఇప్పటి దాకా ఒక హిందీ సినిమాతో సహా 8 సినిమాలు, కొన్ని టెలీ ఫిల్ములు తీయగలగడానికి అదే కారణమంటూ తన మనోభావాలను ఆత్మీయంగా పంచుకున్నారు. తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు గెల్చుకున్న ‘భద్రం కొడుకో’ చిత్రం లాంటి బాలల చిత్రాల రూపకల్పనకు ఆ రోజుల్లో తాము పడ్డ అవస్థలనూ, అండగా నిలిచిన మిత్రుల స్నేహసౌశీల్యాన్నీ కుటుంబరావు మరోసారి నెమరువేసుకున్నారు.
“ఈ తరం పిల్లలకు ఏ అనుబంధాలు, ఆత్మీయతలు లేకుండా పెంచుతున్నాం. జీవితంలోని పోరాటాలు, కష్టసుఖాలు, సమాజంలోని మంచీ చెడూ ఏదీ వాళ్ళకు తెలీదు. అది ఇవాళ్టి సమాజంలో, పెంపకంలోని తప్పు. నిజానికి, ఇవాళ పెద్దవాళ్ళ మనసులు పెళుసు బారిపోయాయి.
తమకు నచ్చితేనో, ఉపయోగం ఉంటేనో తప్ప మనం ఏం చెప్పినా, చూపినా వినరు. కానీ, మనం సరిగ్గా చెబితే ఏది చెప్పినా పిల్లలు వింటారు. అది గుర్తించాలి” అని ‘భద్రం కొడుకో’, ‘పాతనగరంలో పసివాడు’ (1999), ‘గులాబీలు’ (2005) సహా తెలుగులో అనేక బాలల చిత్రాలను రూపొందించిన అక్కినేని కుటుంబరావు అభిప్రాయపడ్డారు.
నేటికీ ఉరకలేసే పసిమనసు ఉత్సాహం
అక్కినేని కుటుంబరావుకు ఎనిమిది పదులు దాటిన సందర్భంలో ఆయనకు సంబంధించిన మూడు కొత్త పుస్తకాల ఆవిష్కరణ సందర్భంగా ఈ అనుభవాలు, అభిప్రాయాలు, జ్ఞాపకాల తలపోతకు హైదరాబాద్ రవీంద్రభారతి సమావేశ మందిరం వేదిక అయింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సన్నిహితులు ఈ సభకు పెద్దయెత్తున హాజరయ్యారు.
ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వైస్ – ఛాన్సలర్ ఆచార్య ఎన్. గోపి సభకు ముఖ్య అతిథిగా వచ్చి, పుస్తకాలను ఆవిష్కరించారు. ‘అక్కినేని కుటుంబరావు సినిమా చిత్రాలు’, ‘అక్కినేని కుటుంబరావు కథలు’, అలాగే ఆయన సాహిత్యంపై ప్రముఖులు రాసిన సమీక్షలు, విశ్లేషణలు, కొన్ని ఇంటర్వ్యూల సమాహారంగా ‘పదుగురాడిన మాటలు’ పుస్తకాలు మూడింటి ఆవిష్కరణ జరిగింది.
ఆచార్య గోపి తన ప్రసంగంలో కుటుంబరావుతో చిరకాలంగా ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని సభికులతో పంచుకున్నారు. సుదీర్ఘకాల స్నేహితుడైన అక్కినేని కుటుంబరావు ఆనాటి నుంచి ఈనాటి దాకా అదే ఉత్సాహంతో రచనలు చేస్తూ, సినిమాలు తీస్తూనే ఉండడాన్ని అభినందించారు.
విశిష్ట అతిథిగా సభకు హాజరైన తెలంగాణ భాషా – సాంస్కృతిక శాఖ సంచాలకులు, కవి, రచయిత ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ, కథ, నవలా రచయితగా, సినీ దర్శకుడిగా విశేష సృజన చేసిన కుటుంబరావును అభినందించారు. చిన్న చిన్న కథలుగా రాసినా, వాటిని ఆసక్తికరంగా తీర్చిదిద్దే ఆయన ప్రత్యేకతను ప్రస్తావించారు. రెండు, మూడు కథలను మచ్చుకు ఉదాహరణగా పేర్కొన్నారు. అక్కినేని కుటుంబరావు వామపక్ష భావజాలం ఆయన రచన పేర్లలోనూ కనపడుతుందన్నారు.
‘నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్’ సంపాదకులు, కవి – రచయిత కె. ఆనందాచారి, కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత – సినీ విమర్శకులు వారాల ఆనంద్, సాహిత్య – సామాజిక విశ్లేషకులు డాక్టర్ జతిన్ కుమార్‌లు సభలో వక్తలుగా పాల్గొన్నారు. సినీ రంగంలో కుటుంబరావు కృషినీ, ఆయన తీసిన సినిమా ప్రత్యేకతనూ వారాల ఆనంద్ వివరించారు. ఇవాళ్టికీ పసిపిల్లల లాంటి స్వచ్ఛమైన మనసుతో ఉండడం వల్లే కుటుంబరావు ఎనిమిది పదులు దాటినట్టు కనిపించరనీ, అదే ఉత్సాహంతో సృజనాత్మక కృషి సాగించగలుగుతున్నారనీ పేర్కొన్నారు.
సమకాలంలో సీరియస్‌గా చదవాల్సిన అక్కినేని సాహిత్యం
విశేష క్షేత్ర పర్యటన, వ్యక్తిగత అనుభవాలను కలగలిపి ఎంతో శ్రమించి కుటుంబరావు సృజించిన సాహిత్యం తాలూకు విశిష్టతను ఆనందాచారి తన ప్రసంగంలో ప్రస్తావించారు. “రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన ప్రాథమిక హక్కులపై నిర్బంధాలు కొనసాగుతున్న విషాద, వర్తమాన సందర్భం ఇది. ఈ పరిస్థితుల రీత్యా కుటుంబరావు రాసిన నవలలు ఇప్పుడు మరింత విలువైనవి. మరోసారి ప్రత్యేకంగా అధ్యయనం చేయదగినవి. ‘పదుగురాడు మాటలు’ పుస్తకంలోని 28 వ్యాసాలూ ప్రముఖుల మాటల్లో ఆయన రచనల ప్రత్యేకతను విశ్లేషించాయి” అని కుటుంబరావు రచనల సామాజిక భూమికను వివరించారు.
జతిన్ కుమార్ ప్రసంగిస్తూ, అక్కినేని కుటుంబరావు ప్రసిద్ధ కథ ‘పసివాడితనం’ మొదలు తాజా కథల సంపుటిలోని 16 కథలూ పాఠకులను ఎలా ఆలోచనల్లోకి నెడతాయో వివరించారు. “పాఠకులను నిద్రపోనివ్వని కథలివి. సామాన్యుల వైపు బలంగా నిలబడ్డ కుటుంబరావు వామపక్ష భావజాలం ఈ కథల్లో కనిపిస్తుంది.
ఈ కథల్లో అనేకం కుటుంబరావు స్వయంగా చూసినవీ, అనుభవించినవీ. ‘సొంత ఇల్లు’, ‘బండి’ లాంటి అనేక కథలు నిడివి రీత్యా చూడడానికి చిన్నవే అయినా, అవి కలిగించే అనుభూతులు పెద్దవి. అందుకే, ఒక రకంగా ఇవి కథలు కాదు... అనుభూతులు అనాలి. వీటిని చదువుతుంటే, ఒకసారి టీచర్‌గా, మరోసారి విదూషకుడిగా, ఇంకోసారి గొప్ప రచయితగా కుటుంబరావు కనిపిస్తారు. ప్రతి కథ చాలా సీరియస్‌గా చదవాల్సిన కథలు” అంటూ తనదైన శైలిలో సరళంగా, సభికులను ఆకట్టుకొనేలా జతిన్ కుమార్ విశ్లేషించారు.

అప్పట్లో... 30 పైసల నేలటికెట్‌లో...
అక్కినేని కుటుంబరావు తన స్పందన ప్రసంగంలో అందరికీ కృతజ్ఞతలు చెబుతూ, తాను హైదరాబాద్‌కు వచ్చిన తొలినాళ్ళ జీవిత గమనం తాలూకు ఫ్లాష్ బ్యాక్‌లోకి తీసుకువెళ్ళారు. “అమ్మానాన్నల్ని బాగా చూసుకోవాలనే లక్ష్యంతో కేవలం ఎస్.ఎస్.ఎల్.సి. చదివి, జీవనం కోసం 1963లో హైదరాబాద్‌కు వచ్చాను. ఈ 63 ఏళ్ళ ప్రయాణంలో ఎందరో స్నేహితులు. విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న ఎన్. గోపి, ఇతర మిత్రులు 1965 నుంచి నాకు తెలుసు. అప్పట్లో ప్రతి ఆదివారం కలిసేవాళ్ళం. వాళ్ళ మాటలు, స్నేహమే నాకు ఓ విశ్వవిద్యాలయంగా మారింది. డబ్బు లేక ఉద్యోగం బాటపట్టాను అనుకుంటున్న నేను, జేబులో డబ్బులో లేకపోయినా చదువు బాటలో పయనిస్తున్న వాళ్ళను చూసి, కలసి ఎంతో నేర్చుకున్నా.
అప్పట్లో నాకు రోజుకు 2 రూపాయలు జీతం. నెలకు 60 రూపాయలు. అందులో 30 రూపాయలు ఊళ్ళోని అమ్మానాన్నలకు పంపితే, 20 రూపాయల్లో ఇక్కడ ఇంటి అద్దె, తిండి అంతా గడిచేది. మిగిలిన పది రూపాయలతో స్నేహితులందరితో కలసి, 30 పైసల నేల టికెట్‌తో ఎన్ని సినిమాలకు వెళ్ళేవాళ్ళమో లెక్కలేదు. ఇటీవల నా తాజా నవల రాస్తున్నప్పుడు గోపి సహా ఆ మిత్రులు, ఆ సంగతులు అన్నీ మరోసారి ఆలోచనల్లో నుంచి అక్షరాల్లోకి వచ్చాయి.
నాకు చలం రచనలంటే పిచ్చి. ఆరేడు తరగతుల్లోనే తన అభిమాన రచయిత సినారెకు ఉత్తరాలు రాస్తే, ఆయన జవాబులు ఇచ్చారని గోపి ఓ సారి చెప్పారు. అది ప్రేరణగా తీసుకొని, నా అభిమాన రచయిత చలానికి ఉత్తరం రాస్తే మూడు రోజుల్లో జవాబు వచ్చింది. అక్కడ నుంచి రచయిత గుడిపాటి వెంకట చలానికీ, నాకూ మధ్య కొన్నేళ్ళపాటు ఎన్నో ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి. వాటిలో కొన్ని అప్పట్లో ఓ పత్రిక ప్రచురించింది” అని కుటుంబరావు చెప్పుకొచ్చారు.
ఒక సినిమా... 39 మంది నిర్మాతలు... ఓ నేషనల్ అవార్డ్!
“చిన్నప్పటి నుంచి నా ఆదర్శాలు రెండే. ఒకటి - కుటుంబం మొత్తాన్నీ పైకి తీసుకురావాలి, రెండు - స్నేహితులందరితో ఎప్పటికీ స్నేహంగా ఉండాలి. మొదటి విషయం మాటెలా ఉన్నా, రెండో ఆదర్శాన్ని మాత్రం ఇప్పటికీ పాటిస్తున్నా. అందుకే, నాకు పరిచయమైన వాళ్ళెవరూ నాకు స్నేహితులు కాకుండా పోరు. నా అసలైన సంపద స్నేహసంపదే! గోపి, ముత్యంరెడ్డి, ఇలా ఎంతో మంది స్నేహితులే నన్ను ఎంతో ఎడ్యుకేట్ చేశారు. వాళ్ళ వల్లే నేను పురోగతిలోకి వచ్చా. నేను సినిమాలు తీయగలిగింది కూడా ఆ స్నేహితుల వల్లే!
రవి, ముత్యం రెడ్డి, శ్రీనివాస్... ఇలా ఎంతోమంది నా ప్రతి సినిమా వెనకాల ఉన్నారు. ఇవాళ అంతర్జాతీయ చిత్రకారుడిగా ఎదిగిన లక్ష్మణ్ ఏలే ఆర్థిక ప్రయోజనం లేకపోయినా, అప్పటి నుంచి ఇప్పటి దాకా నా ప్రతి సినిమాకూ కళాదర్శకుడిగా పనిచేయడం కేవలం సినిమా మీద ప్రేమతోనే! స్నేహపరిమళంతోనే!! ముత్యంరెడ్డి ప్రధాన కారకుడిగా ‘భద్రం కొడుకో’ సినిమా అలా వచ్చిందే. ఆ సినిమాకు ఏకంగా 39 మంది నిర్మాతలు. డబ్బులు వెనక్కిరావు, తిరిగి ఇవ్వలేనని చెప్పినా, తలా పాతిక వేలు పెట్టుబడిగా పెట్టి ఆ సినిమా తీయించారు. ఇవాళ అలా ఇచ్చేవారు ఎవరూ ఉండరు. నిజానికి, ఆ సినిమా నిర్మించడమే తప్ప, దర్శకత్వం నేను చేయాలనుకోలేదు. కానీ, అనుకోకుండా నేనే డైరెక్షన్ కూడా చేయాల్సి వచ్చింది. ఇక అక్కడ నుంచి నా సినిమా ప్రయాణం ఇప్పటి దాకా సాగుతూ వచ్చింది” అని అవార్డు చిత్రాల అక్కినేని కుటుంబరావు తన గుండె లోతుల్లోని భావాలను పంచుకున్నారు.
ప్రభుత్వం ఇవాళ్టికీ సబ్సిడీ ఇవ్వని ఆ అవార్డ్ ఫిల్మ్!
“మంచి సినిమాలకు ప్రోత్సాహం అందిస్తామని ప్రభుత్వాలు చెబుతాయి కానీ, ఆచరణలో అది జరగదు” అంటూ కుటుంబరావు మంచి సినిమాల రూపకల్పనలో ఉన్న కష్టాలు, ఎదురైన అనుభవాలను సైతం సభాముఖంగా చెప్పుకొచ్చారు. “జేబులో రూపాయి లేకపోయినా, సినిమా మీద ఇష్టంతో కష్టపడి ‘భద్రం కొడుకో’ తీశాం. అయితే, అప్పట్లో సినిమాకు అవార్డులు, రివార్డుల రూపంలో కొంత డబ్బులు కూడా వచ్చాయి. అప్పులు చేసి, వడ్డీలకు తెచ్చి ఆర్థికంగా అండగా నిలబడిన మిత్రులకు వారి డబ్బు వెనక్కి ఇవ్వగలిగాం. కానీ, అన్ని సినిమాలూ అలా కావు కదా! కొన్ని సినిమాలకు మాత్రం ప్రభుత్వాలు ఇస్తామని ప్రకటించిన సబ్సిడీలు సైతం రాలేదు.
ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకు హైదరాబాద్‌ను శాశ్వత కేంద్రంగా చేసిన తొలిరోజులవి. ఆసారి హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెలుగు నుంచి ఒక్క సినిమా కూడా ఎంట్రీ లేదు. ఆ సందర్భంలో ప్రభుత్వ పెద్దలు పిలిచి మరీ, పిల్లల సినిమాలు తీయాలన్నారు. అప్పుడలా ఆరుగురు మిత్రులను నిర్మాతలుగా కలుపుకొని, కష్టపడి తీసిందే – ‘పాత నగరంలో పసివాడు’ (1999). ఆ తరువాతి చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మా సినిమాయే అంతర్జాతీయ పోటీ విభాగానికి వెళ్ళిన తొలి తెలుగు సినిమా అయ్యింది. అలాగే, కైరో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ సహా పలు జాతీయ, అంతర్జాతీయ వేదికలకు వెళ్ళింది.
అయితే, ఎంతో కష్టపడి ఆ సినిమా తీసి, అంత చేస్తే... ఇవ్వాల్సిన రూ. 35 లక్షల సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనే లేదు. అదేమంటే కనీసం 11 థియేటర్లలో కమర్షియల్ రిలీజ్ చేస్తేనే ప్రభుత్వ సబ్సిడీ ఇస్తామంటూ ఆఖరికి మెలికపెట్టారు. కమర్షియల్ పాటలు, అసభ్యమైన డైలాగులతో సినిమాలు తీస్తే కానీ అది కుదరని పని. బాలల సినిమాను అలా తీయగలమా? ఫిల్మ్ క్లబ్బులకూ, ఫెస్టివల్స్‌కూ పరిమితమయ్యే బాలల చిత్రాలను ఆ స్థాయిలో కమర్షియల్ రిలీజ్ చేయడం సాధ్యమేనా? అయితేనేం, ఇలాంటి కష్టాల మధ్యనే అయిదారు బాలల సినిమాలు తీయగలిగాను” అంటూ అక్కినేని కుటుంబరావు తన సినిమా అనుభవాలను సభాముఖంగా పంచుకున్నారు.
కుటుంబరావు జీవన సహచరి – ప్రఖ్యాత రచయిత్రి ఓల్గా ఈ సభా కార్యక్రమ నేపథ్యం వివరించారు. సభ మొదటిలో అతిథుల స్వాగతం నుంచి చివరలో ఆత్మీయ బృందానికి పుస్తకాలు అందించడం దాకా ఓల్గా ఆత్మీయత కనపడింది. ఆమె సోదరుడు – సాహిత్య, సినీజీవి రవి మారుతి మొత్తం సభా నిర్వహణను స్వయంగా చూసుకున్నారు.
కుటుంబరావు సినిమాలకు కళా దర్శకుడిగా వ్యవహరించిన ప్రఖ్యాత చిత్రకారుడు లక్ష్మణ్ ఏలే, సినీ రంగంలోనూ కృషి చేస్తున్న రచయిత్రి చైతన్య పింగళి, ప్రముఖ కవులు ఆశారాజు, శిఖామణి, యాకూబ్, సీనియర్ జర్నలిస్టులు వేమన వసంతలక్ష్మి, సుధాకర్, రచయిత్రులు ప్రమీలా హరగోపాల్, భండారు విజయ, సమ్మెట ఉమాదేవి, సమ్మెట విజయ, శివలక్ష్మి తదితర ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరవడంతో రవీంద్రభారతి సమావేశ మందిరం సాహిత్య – సినీ వాతావరణంతో కళకళలాడింది. సభ ముగిసిన తర్వాత కూడా సాహితీ ప్రియులు పరస్పరం ఆత్మీయంగా పలకరించుకుంటూ, కుటుంబరావును అభినందిస్తూ, అక్కడే చాలా సమయం గడపడం కుటుంబరావు – ఓల్గా జంట సంపాదించుకున్న స్నేహసంపదకు నిండైన తార్కాణంగా నిలిచింది.
-రెంటాల జయదేవ


