అద్భుతంగా పాఠం చెప్పే అధ్యాపకులు చాలామంది ఉంటారు. అజ్ఞానం దూరం చేసి, అపరిమిత జ్ఞానాన్ని అందించే ఆచార్యులూ అనేకులుంటారు. కానీ, చదువుతో పాటు సామాజిక చలనశీల సూత్రాల ఆధారంగా చరిత్రను ఎలా అర్థం చేసుకోవాలో దోవ చూపి, ఆమరణాంతం వీడని ఆలోచనా మార్గం పట్టించే ఆచార్య వరేణ్యులు కొందరే ఉంటారు.
శిష్యులను సైతం సహచరులుగా, మిత్రులుగా సంభావించి, వారిని తీర్చిదిద్దే అలాంటి ఆచార్యుల ఆలోచన, ఆచరణ, సాహిత్య - సామాజిక మూర్తిమత్వం ఆ శిష్యులపై చెరగని ముద్ర వేస్తుంది. హైదరాబాద్‌లో హైస్కూల్ టీచర్‌గా మొదలై, ఆగని అధ్యయనం, అధ్యాపనంతో ‘ఆంధ్ర సారస్వత పరిషత్’ ప్రధానాచార్యులుగా, ‘హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ’ తెలుగు శాఖాధ్యక్షులుగా, హ్యుమానిటీస్ విభాగానికి డీన్‌గా ఎదిగి, ఎందరో విద్యార్థులను ప్రభావితం చేసిన అరుదైన వ్యక్తి – సారస్వతమూర్తి... ఆచార్య కె.కె. రంగనాథాచార్యులు (1941 – 2021).
సాహితీ లోకంలో కె.కె.ఆర్.గా సుప్రసిద్ధులైన ఆయన భౌతికంగా కనుమరుగై అయిదేళ్ళు నిండినా, ఇప్పటికీ సహచరులు, శిష్య మిత్రులెవరూ మరిచిపోలేని విశిష్ట వ్యక్తిత్వం ఆయనది. మండు వేసవిలో సైతం ప్రతి మే నెలలో వారు ఆయనను ప్రత్యేకంగా స్మరించుకొనే తీరు అందుకు ఓ నిదర్శనం. చారిత్రక సాహితీ విమర్శకుడిగా కె.కె.ఆర్. విశిష్ట స్థానాన్ని మరోసారి గుర్తు చేస్తూ, ఈ ఏడాది కూడా ఆయన వర్ధంతిని ఆలోచనా స్ఫోరక సాహితీ సమావేశంతో సన్నిహితులు, కుటుంబ సభ్యులు జరిపారు.
ఇరవై ఒక్కేళ్ళ పాటు కె.కె.ఆర్. ప్రధానాచార్యత్వానికీ, సాహిత్య సంగోష్ఠికీ నెలవైన హైదరాబాద్‌లోని ‘తెలంగాణ (అప్పటి ఆంధ్ర) సారస్వత పరిషత్’ కళాశాల ప్రాంగణమే ఈసారి కూడా అందుకు వేదికగా నిలిచింది. కె.కె.ఆర్. వార్షిక సంస్మరణ ప్రసంగ కార్యక్రమం మే 15 సాయంత్రం ఆహూతుల మధ్య ఆత్మీయంగా సాగింది. సుప్రసిద్ధ చరిత్ర ఆచార్యులు డాక్టర్ వకుళాభరణం రామకృష్ణ ‘తెలుగువారి చరిత్ర – సంస్కరణోద్యమాలు’ అన్న అంశంపై ఈ ఏటి సంస్మరణ ప్రసంగం చేశారు. గత మూడేళ్ళుగా ఏటా జరుగుతున్న కె.కె.ఆర్. సంస్మరణ ప్రసంగాల పరంపరలో ఇది మూడో ప్రసంగం.
“అరుదైన విమర్శకుడు కె.కె.ఆర్”: ఆచార్య చంద్రశేఖరరెడ్డి“
ప్రధాన ప్రసంగానికి ముందు ‘ఎమెస్కో బుక్స్’ ప్రధాన సంపాదకులు – సాక్షాత్తూ కె.కె.ఆర్. వద్దే చదువుకొని, సారస్వత పరిషత్‌లో సహోద్యోగిగా ఎదిగి, సన్నిహితంగా మెలిగిన ఆచార్య డాక్టర్ దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ, కె.కె.ఆర్. ప్రత్యేకతను వివరించారు. “తెలుగు సాహిత్య విమర్శలో చారిత్రక దృక్కోణానికి పెద్ద పీట వేసి ఒరవడి దిద్దిన అరుదైన విమర్శకుడు కె.కె.ఆర్. ఆయనకు చరిత్రపై అమితమైన ఆసక్తి.
భారతదేశ చరిత్రను నిశితంగా అధ్యయనం చేశారు. చరిత్ర పరిణామాలను గమనించి ఊరుకోకుండా, చరిత్రలోని పరిణామాలకూ సాహిత్యంలోని పరిణామాలకూ మధ్య సంబంధాన్ని విశ్లేషించేవారు. ఎలాంటి చారిత్రక పరిస్థితుల్లో, ఎలాంటి సాహిత్యం వచ్చిందో లోతైన అధ్యయనం చేసి చెప్పేవారు. చరిత్ర నిర్దేశించే సాహిత్య స్వరూపాన్ని విశదీకరించేవారు. అందుకే, ఆయనను అరుదైన ‘చారిత్రక విమర్శకుడి’గా గణిస్తున్నాం.
అగ్రశేణి తెలుగు సాహితీ విమర్శకులను పదిమందిని తీసుకున్నా... మొదటి అయిదుగురు ప్రాచీన సాహితీ విమర్శకులనుకుంటే, మిగిలిన అయిదుగురు ఆధునిక విమర్శకులలో ‘కనిష్ఠికాధిష్ఠితుడైన కాళిదాసు’ లాగా మున్ముందు చెప్పుకోవాల్సిన పేరు కె.కె.ఆర్.దే” అని డి. చంద్రశేఖరరెడ్డి అభిప్రాయపడ్డారు.
ఈ సంస్మరణ ప్రసంగ సభలో కె.కె.ఆర్.తో అనుబంధం ఉన్న ప్రముఖ కవి నిఖిలేశ్వర్, ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు – సాహితీవేత్త మోత్కూరి నరహరి, సాహితీ విమర్శకుడు కె.పి. అశోక్ కుమార్, వివిధ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత హోదాల్లో పనిచేసిన ఆచార్య అయినవోలు ఉషాదేవి, ఆచార్య గారపాటి ఉమా మహేశ్వరరావు, ‘తెలుగు అకాడెమీ’ మాజీ సంచాలకులు ఆచార్య కె. యాదగిరి, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు ప్రొఫెసర్ పిల్లలమర్రి రాములు, చరిత్ర ప్రొఫెసర్ వకుళాభరణం రాజగోపాల్, ‘ఆకాశవాణి’ వార్తావిభాగం మాజీ ఉద్యోగి సమ్మెట నాగమల్లేశ్వరరావు మొదలైన ప్రముఖులు పలువురు పాల్గొనడం విశేషం.
దాదాపు రెండు గంటల సేపు జరిగిన ఈ కార్యక్రమానికి ముందు, తరువాత కూడా వచ్చినవారందరూ ఆత్మీయంగా పరస్పరం పలకరించుకుంటూ, పాత జ్ఞాపకాలను నెమరువెసుకోవడం, సారస్వత పరిషత్ ప్రాంగణంతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకోవడం అరుదైపోతున్న సాహితీ కుటుంబ వాతావరణాన్ని ప్రతిఫలించాయి.
వచ్చే ఏడాది కలయికకు మరో ఆత్మీయ భూమికను సిద్ధం చేశాయి. సారస్వత్ పరిషత్ ప్రాంగణంలో దాదాపు పదేళ్ళ పాటు ‘సారస్వత వేదిక’ పేరిట విశిష్ట అతిథుల సాహితీ ప్రసంగాలు నిర్వహించినప్పుడు ఆచార్య కె.కె.ఆర్. ఆచరించింది, అభిలషించిందీ కూడా ఇదేనేమో!
రెంటాల జయదేవ
(చదవండి: ప్రపంచం మెచ్చిన బ్రేక్‌ఫాస్ట్!)


