బడికొచ్చిన సైకిల్‌కు బ్రేక్‌

Is There Bicycles Distribution In Ongole - Sakshi

బడికొస్తా సైకిళ్లు ఫిట్టింగ్‌

చంద్రబాబు, గంటా ఫొటోలతో సిద్ధం

ఎన్నికల కోడ్‌ సమయంలో పాఠశాల ప్రాంగణంలో పంపిణీ?

సాక్షి, ఒంగోలు టౌన్‌: బడికొస్తా సైకిళ్లు ఒక్కసారిగా కలకలం రేపాయి. బడికొస్తా సైకిళ్లను పాఠశాల ప్రాంగణంలో ఫిట్టింగ్‌ చేయడం చర్చనీయాంశమైంది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న సమయంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర మానవ వనరుల శాఖామంత్రి గంటా శ్రీనివాసరావు ఫొటోలతో ముద్రించిన సైకిళ్లను పంపిణీ చేసేందుకు అన్నట్లుగా సిద్ధం చేస్తుండటంతో ఒక్కసారిగా కలవరం రేకెత్తించింది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారా అన్నట్లుగా బడికొస్తా సైకిళ్లను ఫిట్టింగ్‌ చేస్తుండటంతో ఎక్కడ వాటిని పంపిణీ చేస్తారోనన్న ఉత్కంఠత నెలకొంది.

బెడిసికొట్టిన వ్యూహం
బడికొస్తా సైకిళ్ల పంపిణీలో చంద్రబాబు వ్యూహం బెడిసి కొట్టినట్లయింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిది, తొమ్మిదవ తరగతి చదువుతున్న బాలికలకు బడికొస్తా పథకం కింద సైకిళ్లను పంపిణీ చేస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో బాలికలకు ఇవ్వాల్సిన సైకిళ్లను మరికొన్ని రోజుల్లో విద్యా సంవత్సరం ముగుస్తుందనగా వాటిని బయటకు తీయడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమలులో ఉంది. ఇలాంటి తరుణంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏ ఒక్కదానిని అమలు చేయకూడదు. ఎనిమిది, తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికలకు బడికొస్తా కింద సైకిళ్లను ఇవ్వడం ద్వారా ఉచిత ప్రచారం పొందవచ్చని చంద్రబాబు ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే విద్యా సంవత్సరం చివర్లో ఆ సైకిళ్లను బాలికలకు అందించి ఉచిత పబ్లిసిటీ పొందవచ్చన్న చంద్రబాబు ప్లాన్‌ తిరగబడింది.

బాబు, గంటా ఫొటోలు
బడికొస్తా పథకం కింద బాలికలకు ప్రతి ఏటా సైకిళ్లను అందజేయడం జరుగుతోంది. బాలికల్లో డ్రాప్‌ అవుట్స్‌ తగ్గించాలన్న ఉద్దేశ్యంతో వీటిని అందజేస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లాపరిషత్, మండల పరిషత్‌ పాఠశాలల్లో చదువుకుంటున్న 23వేల మందికి సైకిళ్లను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖకు జిల్లా నుండి ఇండెంట్‌ పంపడం జరిగింది. ప్రభుత్వం ఒక పథకం ప్రకారం బడికొస్తా సైకిళ్ల పంపిణీని ఆలస్యం చేసింది. విద్యా సంవత్సరం ప్రారంభమైన తరువాత సైకిళ్లను అందిస్తే వాటిపై ముద్రించిన చంద్రబాబు, గంటా శ్రీనివాసరావు ఫొటోలు ఎక్కడ పాతబడిపోతాయో లేకుంటే ఆ ఫొటోలను తొలగిస్తారోనన్న అనుమానంతో చేపట్టిన వ్యూహం బెడిసికొట్టింది.

ఫిట్టర్స్‌ రావడంతోనే ఫిట్టింగ్‌ 
బడికొస్తా పథకం కింద బాలికలకు సైకిళ్ల విడి భాగాలు ఇటీవల జిల్లా కేంద్రానికి వచ్చాయని జిల్లా విద్యాశాఖాధికారి వీఎస్‌ సుబ్బారావు తెలిపారు.∙ఫిట్టర్స్‌ బీహార్, హర్యానా నుండి ఇక్కడకు వచ్చారన్నారు. ఫిట్‌ చేసుకుంటూ ఇక్కడకు వచ్చారని, వారిని తిరిగి పిలవాలంటే కష్టమనే ఉద్దేశ్యంతో ఫిట్టింగ్‌ చేయిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున వాటిని పంపిణీ చేయమని స్పష్టం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top