కోల్ట్‌స్టోరేజీలో ఎగసిపడుతున్న మంటలు | The fire was in the Cold storage | Sakshi
Sakshi News home page

కోల్ట్‌స్టోరేజీలో ఎగసిపడుతున్న మంటలు

Aug 26 2013 5:06 AM | Updated on Aug 24 2018 2:33 PM

గుంటూరు శివారు అంకిరెడ్డిపాలెం జాతీయరహదారి పక్కన శనివారం అగ్నిప్రమాదం చోటుచేసుకున్న గుంటూరు కోల్డ్‌స్టోరేజీలో ఆదివారం మంటలు చెలరేగాయి.

గుంటూరు రూరల్, న్యూస్‌లైన్ : గుంటూరు శివారు అంకిరెడ్డిపాలెం జాతీయరహదారి పక్కన శనివారం అగ్నిప్రమాదం చోటుచేసుకున్న గుంటూరు కోల్డ్‌స్టోరేజీలో ఆదివారం మంటలు చెలరేగాయి. కోల్ట్‌స్టోరేజీ ఏ చాంబర్‌లో ఉన్న మిర్చిబస్తాలు కొన్నిం టిని బయటకు వేయడంతో దట్టమైన పొగల నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసిపడాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. మంటలను చూసిన రైతులు కన్నీటి పర్యతమయ్యారు. ఈ ప్రమాదంపై బాధిత రైతులు పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. పాతికేళ్ల కిందట కట్టిన ఈ కోల్డ్‌స్టోరేజీ ఏ, బీ చాంబర్‌లలో సుమారు 60 వేల మిర్చి బస్తాలు ఉన్నాయి. బీ చాంబర్‌లోని గదులను అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది చాకచక్యంగా పొక్లెయిన్‌తో పగులగొట్టించి సుమారు 25 వేల మిర్చి బస్తాలను బయటకు తెచ్చారు. 
 
 ఆదివారం కూడా గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ బీవీ రమణకుమార్ ఘటనాస్థలానికి వచ్చి క్షుణ్ణంగా పరిశీలించారు. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి నాగేశ్వరరావు, సౌత్ జోన్ డీఎస్పీ ఎన్‌జే రాజ్‌కుమార్, రూరల్ సీఐ మోజెస్‌పాల్‌లను ప్రమాద ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఆందోళనలకు దిగకుం డా.. మిర్చి బస్తాలు చోరీకి పాల్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ రమణకుమార్ విలేకరులతో మాట్లాడుతూ ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల లేక ఇతర కారణాల వల్ల అనేది విచారణలో తేలాల్సివుందన్నారు. ప్రమాదం జరిగిన తక్షణమే తమ సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు చెప్పారు. ఈ రెండు రోజుల్లో ఒక్క బస్తా కూడా బయటకు వెళ్లనివ్వకుండానిఘా ఏర్పాటు చేశామన్నారు. కోల్డ్ స్టోరేజీ పై భాగాన్ని పగులగొట్టించి అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపుచేసే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. అగ్నిమాపక, పోలీస్‌సిబ్బంది.. కోల్డ్‌స్టోరేజీ బీ చాంబర్‌లోని మిర్చి బస్తాలు కాలిపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పారు.
 
 వైఎస్సార్ సీపీ నేతలు సందర్శన..
 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి, పార్టీ పెదకూరపాడు సమన్వయ కర్త రాతంశెట్టి రామాంజనేయులు (లాలుపురం రాము), పలువురు నాయకులు స్టోరేజిని సంద ర్శించారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ కోల్డ్‌స్టోరేజి ప్రమాదంపై విచారణ  జరిపించాలని డిమాండ్‌చేశారు. రైతుల రెక్కల కష్టం మంటల్లో కాలిపోకుండా.. ప్రభుత్వం అత్యాధునిక సదుపాయాలు కల్పించి జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రాతంశెట్టి మాట్లాడుతూ ప్రమాదం పై సమగ్ర విచారణ జరిపి బాధిత రైతులకు న్యాయం చేయాలని కోరారు. 
 
 మిర్చి రైతులకు నష్టపరిహారం చెల్లించాలి..టీడీపీ నేత ప్రత్తిపాటి డిమాండ్ 
 కొరిటెపాడు: అగ్నికి ఆహుతైన మిర్చి రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు డిమాండ్ చేశారు. అగ్నిప్రమాదానికి గురైన గుంటూరు కోల్డ్‌స్టోరేజ్‌ను ఆదివారం టీడీపీ, సీపీఐ నాయకులు సందర్శించారు. బాధిత రైతులను పరామర్శించి వివరాలు  తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పుల్లారావు మాట్లాడుతూ సుమారు 200మంది రైతులకు సంబంధించి 25వేల మిర్చి బస్తాలు అగ్నికి ఆహుతి అయ్యాయన్నారు. గుంటూరులోని కోల్డ్‌స్టోరేజ్‌ల్లో వరుస అగ్ని ప్రమాదాలు జరగడం బాధాకరమన్నారు. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతాంగానికి క్వింటాల్‌కు రూ. 10వేలు చెల్లించాలని డిమాండ్‌చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ వరుస అగ్నిప్రమాదాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టీడీపీ నాయకులు మన్నవ సుబ్బారావు, చంద్రగిరి ఏడుకొండలు, సుఖవాసి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement