పట్టుకుంటే రూ. 10 కోట్లు | The district has established a new record for selling the rice ration | Sakshi
Sakshi News home page

పట్టుకుంటే రూ. 10 కోట్లు

Dec 15 2013 3:16 AM | Updated on Sep 2 2017 1:36 AM

రేషన్ బియ్యాన్ని అడ్డదారిలో అమ్ముకోవడంలో మన జిల్లా కొత్త రికార్డు నెలకొల్పింది. జిల్లాలో సగటున రెండు రోజులకోసారి అక్రమంగా తరలిస్తున్న రేషన్ సరుకులు పట్టుబడుతున్నాయి.

సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రేషన్ బియ్యాన్ని అడ్డదారిలో అమ్ముకోవడంలో మన జిల్లా కొత్త రికార్డు నెలకొల్పింది. జిల్లాలో సగటున రెండు రోజులకోసారి అక్రమంగా తరలిస్తున్న రేషన్ సరుకులు పట్టుబడుతున్నాయి. జనవరి నుంచి ఇప్పటివరకు ఈ ఏడాదిలో 154 కేసులు నమోదు చేసినట్లు సివిల్ సప్లయిస్ అధికారులు వెల్లడించారు. వీటన్నింటా రూ.10కోట్ల విలువైన బియ్యం, చక్కెర, పామాయిల్, గోధుమలు సీజ్ చేశారు.
 
 గత వారం రోజుల్లోనే జిల్లాలో పది చోట్ల మిల్లులకు రవాణా అవుతున్న రేషన్ బియ్యం పట్టుబడింది. దొరికితేనే దొంగలు... అన్న నానుడిని నిజం చేస్తూ అధికారులకు చిక్కకుండా దారి మళ్లించిన సరుకులు అంతకు పదింతలు ఉండవచ్చని అంచనా. ఈ లెక్కన ఏటేటా వందల కోట్ల విలువైన రేషన్ సరుకులు నల్ల బజారుకు తరలి వెళుతున్నాయని తేటతెల్లమైంది. ప్రధానంగా పీడీఎస్ బియ్యాన్ని నల్లబజారుకు తరలించే దందా జిల్లాలో వేళ్లూనుకుంది.
 
 రూపాయికి కిలో చొప్పున ప్రభుత్వం నిరుపేదలకు పంపిణీ చేసే బియ్యాన్ని రేషన్ డీలర్లు, దళారులు, కొందరు మిల్లర్లు కలిసికట్టుగా టోకున విక్రయించే దందాకు ఎగబడ్డారు. బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు అమాంతం పెరిగిపోయాయి. దొడ్డు బియ్యమైనా సరే క్వింటాలుకు కనీసం రూ.3000 ధరకు అమ్ముడుపోతోంది. ఈ లెక్కన సునాయాసంగా రూ.లక్షలు సంపాదించే అవకా శం ఉండడంతో రేషన్ షాపులు మొదలు ఎంఎల్‌ఎస్ పాయింట్లు, మిల్లులన్నీ ఈ దందాకు  ద్వారాలు తెరిచాయి. గడిచిన రెండు నెలల్లోనే జిల్లాలో ని వివిధ ప్రాంతాల్లో 25 చోట్ల రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్టుకు తరలిస్తున్న కేసులు నమోదయ్యాయి. మొత్తం 1553 క్వింటాళ్ల బియ్యం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధానంగా పొరుగున ఉన్న జిల్లాలకు ఈ బియ్యం రవాణా అవుతున్నట్లు విచారణలో వెల్లడైంది. మరోవైపు నిరుపేదలు సైతం వస్తు మార్పిడి పద్ధతిన రేషన్ బియ్యాన్ని రైళ్లలో... మహారాష్ట్రకు తరలించి అక్కణ్నుంచి గోధుమలు దిగుమతి చేసుకుంటున్న సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సొంత జిల్లాలో ఇంత భారీ మొత్తంలో రేషన్ సరుకుల వ్యాపారం జరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది.
 
 పక్కాగా ఉండాల్సిన ప్రజా పంపిణీ వ్యవస్థ పక్కదారి పట్టిందని వేలెత్తి చూపింది. మంత్రి స్వీయ పర్యవేక్షణ ఉన్న ప్రాంతం కావడంతో ఇక్కడి అధికారులు కట్టుదిట్టంగా తనిఖీలు నిర్వహించి అత్యధికంగా కేసులు నమోదు చేసినట్లు అర్థమవుతోంది. కానీ అంతకు రెట్టించినట్లుగా అక్రమ రవాణా సాగుతున్న తీరు సర్కారుకు సవాలు విసురుతోంది. తమపై నమోదయ్యే కేసులకు భయపడకుండా దళారులు, డీలర్లు హద్దు మీరుతుండడం.. మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని వేలెత్తి చూపిస్తోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement