ఇక్కడ మేము క్షేమమే బాబూ..

Telangana Seemandhra People Complaint On Chandrababu Over Selfish Politics - Sakshi

తెలంగాణలోని సీమాంధ్రుల స్పష్టీకరణ 

మీ రాజకీయాల్లోకి మమ్మల్ని లాగొద్దు.. 

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే

వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్‌:  ఏపీలో రాజకీయాలను ధైర్యంగా ఎదుర్కోవడం చేతగాని చంద్రబాబు.. తెలంగాణలో నివశిస్తున్న సీమాంధ్రులను అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధికి పాకులాడడం సిగ్గుచేటని కూకట్‌పల్లికి చెందిన సీమాంధ్ర ప్రాంతవాసులు విమర్శించారు. సోమవారం సాయంత్రం కేపీహెచ్‌బీ కాలనీలోని రమ్య గ్రౌండ్‌లో సీమాంధ్రులు మీడియా సమావేశం నిర్వహించారు. కటికరెడ్డి శ్రీనివాసరెడ్డి, సదాశివరెడ్డి, విజయభాస్కర్, రంగమోహన్, నాగకుమార్, గోపీ, రవీంద్రనాధ్‌ఠాగూర్, ప్రియదర్శిని, పవన్‌కుమార్‌ తదితరులు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లోని మూడున్నర కోట్ల మంది ప్రజల సమాచార గోప్యతకు సంబంధించిన కేసులో తెలంగాణ పోలీసులకు అందిన ఫిర్యాదుతో చిన్నాచితక ఐటీ కంపెనీపై పోలీసులు దాడులు చేస్తే సీమాంధ్రులపై దాడిగా చిత్రీకరించడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. (డేటా స్కామ్‌ డొంక కదులుతోంది!)

గత 25–30 ఏళ్లుగా తాము తెలంగాణ ప్రాంతాంలో క్షేమంగా జీవిస్తున్నామని అన్నారు. చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం సీమాంధ్ర ప్రజలను పావులుగా వాడుకోవద్దని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలను.. అక్కడి ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కొవడం కోసం తప్పుడు దారులు వెతుక్కోవడం ద్వారా చంద్రబాబు తన వక్రబుద్ధిని చాటుకున్నాడని విమర్శించారు. ఐటీ గ్రిడ్‌ సంస్థకు ఆంధ్రప్రదేశ్‌ ప్రజల డేటా ఎలా వచ్చిందనే విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారని, దీనికి తెలుగుదేశం పార్టీ, అక్కడి మంత్రివర్గం మొత్తం ఆందోళన చెందడం చూస్తే ఏదో తప్పు జరిగిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని తెలిపారు. (మమ్మల్ని పోలీసులు నిర్బంధించలేదు)

కాగా, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న చంద్రబాబునాయుడుపై తక్షణం కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజలు కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లో ప్రాంతీయ విభేదాలు చెలరేగే అవకాశం ఉందని, ఇక్కడి ప్రభుత్వం వెంటనే  చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top