డేటా స్కామ్‌ డొంక కదులుతోంది!

IT Grids Data Breach Case Investigation Creates Tension In AP Govt Officials - Sakshi

ప్రభుత్వం నుంచే ఐటీ గ్రిడ్స్, బ్లూఫ్రాగ్‌కు ప్రజల వ్యక్తిగత సమాచారం

అన్ని సంస్థల నుంచి ఐటీ గ్రిడ్స్‌కు సమస్త డేటా

సాక్షి, అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్న డేటా స్కామ్‌ డొంక కదులుతోంది. ఈ కేసుకు సంబంధించి సైబరాబాద్‌ పోలీసుల దర్యాప్తులో విస్తుగొలిపే వాస్తవాలు వెల్లడవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం వద్ద రహస్యంగా ఉంచాల్సిన ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్స్, బ్లూ ఫ్రాగ్‌ కంపెనీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆయన తనయుడు, రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తేటతెల్లమవుతోంది. ఈ రెండు సంస్థలు గత ఎన్నికల్లో టీడీపీకి సేవలు అందించడం గమనార్హం. టెక్నాలజీని తానే ప్రమోట్‌ చేస్తున్నట్టు గొప్పలు చెప్పుకునే చంద్రబాబు.. రాష్ట్రంలో అనేక శాఖల పనితీరు, సమాచార సేకరణకు కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం ఖర్చు చేసిన విషయం జగమెరిగిన సత్యం. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రధానంగా హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్స్, విశాఖలోని బ్లూ ఫ్రాగ్‌ సంస్థలు కోట్ల విలువైన కాంట్రాక్టులు దక్కించుకున్నాయి. ఈ రెండు సంస్థలకు ఎలాంటి అనుభవం లేనప్పటికీ చంద్రబాబు, లోకేశ్‌లు వాటికి పెద్దఎత్తున కాంట్రాక్టులు కట్టబెట్టినట్టు నిర్ధారణ అయ్యింది. (డేటా చోర్‌.. బాబు సర్కార్‌)

డేటా సేకరణ బాధ్యతలు వీటికే..
2016, 2017, 2018, 2019లలో అనేక ప్రభుత్వ శాఖల డేటా.. ప్రజల వ్యక్తిగత సమాచార సేకరణకు కూడా ఈ రెండు సంస్థలకే ప్రభుత్వమే అప్పగించింది. 2016లో నిర్వహించిన ప్రజాసాధికార సర్వే బాధ్యతలను సైతం వీటికే అప్పగించారు. కుటుంబ వికాసం, సమాజ వికాసం ప్రాజెక్ట్‌ను బ్లూ ఫ్రాగ్‌ సంస్థకు ఇచ్చారు. ఇందుకోసం అన్ని శాఖల సమాచారాన్ని ఈ సంస్థకు అందజేయాలని ఆదేశాలు కూడా ఇచ్చారు. ఇదే సంస్థకు 2017లో పంటల సలహా కాంట్రాక్టును రూ.30 కోట్లకు ప్రభుత్వం అప్పగించింది. అయితే, ఇచ్చిన పని సకాలంలో పూర్తి చేయలేకపోవడంతో 2018లో ఆ సంస్థను అధికారులు తప్పించారు. మరోవైపు.. కరెంట్‌ స్తంభాల జియో ట్యాగింగ్‌ కాంట్రాక్టును కూడా ఈ రెండు కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఇలా అనేక సర్వీసు ప్రొవైడర్లకు ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వడంతో డేటా చోరీకి అవకాశం కల్పించినట్లయింది. (చంద్రబాబు, లోకేశ్‌ మార్గదర్శనంలో...క్యాష్‌ ఫర్‌ ట్వీట్‌!)

అధికారుల బెంబేలు..
టీడీపీ సర్కారు ప్రమేయంతో జరిగిన డేటా స్కామ్‌ వ్యవహారం తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనని అధికారులు ఇప్పుడు వణికిపోతున్నారు. మరోవైపు.. రియల్‌ టైం గవర్నెన్స్, 1100 కాల్‌ సెంటర్లపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. వీటిలోనే ప్రభుత్వం పౌరుల సమస్త సమాచారాన్ని భద్రపరిచింది. ప్రభుత్వ పథకాల అర్హులను గుర్తించేందుకు ప్రజాసాధికార సర్వే, ఇతర శాఖల సమాచారాన్ని జోడించింది. ఈ పేరుతో లబ్ధిదారుల కలర్‌ ఫొటోతో కూడిన ఓటరు జాబితా, ఆధార్‌ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలను ప్రభుత్వం సేకరించింది. ఇప్పుడా సమాచారం చోరీకి గురికావడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ బాగోతంలో ఇప్పటికే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ల పాత్రపై చర్చ జరుగుతున్న తరుణంలో పలువురు అధికారుల మెడకు కూడా ఇది చుట్టుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. (‘ఐటీ గ్రిడ్స్‌’ నుంచి 3 హార్డ్‌డిస్క్‌లు మాయం)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top