ఉపాధ్యాయురాలికి శిక్ష 

Teachers Promotions Problems In Anathapuram - Sakshi

ఇక్కడ కన్నీటి పర్యంతమవుతున్న ఉపాధ్యాయురాలి పేరు కె.పద్మజ. 1996 డీఎస్సీలో సోషల్‌ టీచరుగా ఎంపికైంది. ప్రస్తుత ఈమె వయసు 50 ఏళ్లు. నిబంధనల ప్రకారం 45 ఏళ్లకే ప్రధానోపాధ్యాయురాలిగా పదోన్నతి రావాలి. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఆమెకు ప్రమోషన్‌ రాలేదు. దీంతో రెండు ఇంక్రిమెంట్లు కోల్పోయింది. అంటే నెలకు రూ. 5 వేల నుంచి రూ.6 వేల లెక్కన... 60 నెలలకు రూ.3.6 లక్షల దాకా జీతం నష్టపోయింది. అలాగే భవిష్యత్తులో కూడా పదోన్నతి వచ్చే వీలు లేదు. ఇంకా పదేళ్లు సర్వీసు ఉండగా.. ఇంక్రిమెంట్ల రూపంలోనే  ఆమె రూ. 6 లక్షల నుంచి రూ.7.20 లక్షల దాకా నష్టపోనుంది. అంతేకాదు పదోన్నతి లభించి ఉంటే పేస్కేలు పెరిగేది... పీఆర్సీ అమలు చేసిన సమయంలో జీతమూ పెరిగేది. పదోన్నతి లభించకపోవడం వల్ల పదవీ విరమణ తర్వాత ఆమె ఫించను కూడా తగ్గిపోనుంది. విద్యాశాఖ అధికారులు చేసిన తప్పిదానికి ఈ ఉపాధ్యాయురాలికి శిక్ష పడింది. 

సాక్షి, అనంతపురం : టీచర్ల పదోన్నతుల్లో భాగంగా తొలిరోజు బుధవారం అర్హులైన స్కూల్‌ అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు చేపట్టేందుకు నిర్వహించిన కౌన్సెలింగ్‌లో తీవ్ర గందరగోళం నెలకొంది. స్థానిక సైన్సు సెంటర్‌లో ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్‌ ఉంటుందని అధికారులు ప్రకటించడంతో ఉపాధ్యాయులు 9.30 గంటలకే అక్కడికి చేరుకున్నారు. ఇన్‌చార్జ్‌ డీఈఓ దేవరాజు అధ్యక్షతన ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ప్రారంభంలోనే ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. సీనియార్టీ జాబితా ఇష్టానుసారంగా తయారు చేశారంటూ మండిపడ్డారు.  

టీచర్‌ పద్మజ విషయంలో ఏ జరిగిందంటే... 
కె.పద్మజ తాడిపత్రి పట్టణం 15వ వార్డు పాఠశాలలో పని చేస్తోంది. ఈమె 1996 డీఎస్సీలో సోషల్‌ టీచరుగా ఎంపికైంది. డిపార్ట్‌మెంట్‌ పరీక్షలు ఉత్తీర్ణత కాలేదు. ఈ కారణంగా వయసు 45 ఏళ్లు అయితే పదోన్నతుల జాబితాలో ఆటోమేటిక్‌గా చేర్చాలి. ఈమేరకు ఆమెకు సమాచారం ఇవ్వాలి. కానీ జిల్లా విద్యాశాఖ అధికారులు ఈమె  విషయంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. వాస్తవానికి ఎస్జీటీ నుంచి స్కూల్‌ అసిస్టెంటుగా పదోన్నతి పొందిన టీచర్ల పేర్లను వారికి 50 ఏళ్లు నిండగానే హెచ్‌ఎం పదోన్నతులకు సీనియార్టీ జాబితాలో చేర్చాలి. పద్మజ నేరుగా స్కూల్‌ అసిస్టెంట్‌గా రిక్రూట్‌ కావడంతో 45 ఏళ్లకే పదోన్నతికి అర్హురాలు. ఈ విషయం ఆమెకు తెలీదు. అధికారులూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పద్మజ ఎస్జీటీ నుంచి పదోన్నతి పొందిందని భావించిన అధికారులు ఆమె వయసు ప్రస్తుతం 50 ఏళ్లు కావడంతో సోషల్‌ సబ్జెక్టు సీనియార్టీ జాబితాలో పేరు చేర్చారు. పాయింట్ల ఆధారంగా జాబితాలో మొదటిపేరు ఉంది. ఆమె డైరెక్ట్‌ రిక్రూట్‌ అనే విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన అధికారులు రాత్రికిరాత్రి జాబితా నుంచి పేరు తొలగించారు. 

కన్నీటిపర్యంతమైన టీచరు 
ఉదయాన్నే కౌన్సెలింగ్‌కు వచ్చిన పద్మజ జాబితాలో తనే పేరు గల్లంతు కావడంతో తీవ్ర ఆందోళనకు గురైంది. అధికారులను ఆరా తీస్తే ఐదేళ్ల కిందటే పదోన్నతి లభించిందని ఎందుకు రాలేదని ఎదురుదాడి చేశారు. తనకు ఎవరూ సమాచారం ఇవ్వలేదని ఆమె వాపోయింది. తాను పదోన్నతి తిరస్కరించి ఉంటే ఎస్‌ఆర్‌లో రాస్తారని, కానీ తన ఎస్‌ఆర్‌ అలాంటిదేదీ ఎంట్రీ కాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇవేవీ పట్టించుకోని విద్యాశాఖ అధికారులు... ఆమెను వెనక్కు పంపారు. దీంతో పద్మజ కన్నీటిపర్యంతమవుతూ అక్కడి నుంచి వెనుతిరిగింది. తనకు జరిగిన అన్యాయంపై ముఖ్యమంత్రికి ఈమెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు తెలిపింది.   

పీడీల పదోన్నతులపై ఇరు సంఘాలు గొడవ 
అర్హులైన ఎస్జీటీలకు ఫిజికల్‌ డైరెక్టర్లుగా పదోన్నతులు కల్పించాలని ఓ సంఘం, పీఈటీలకు మాత్రమే పీడీలుగా పదోన్నతులు కల్పించాలని పీఈటీ సంఘం నేతలు కౌన్సెలింగ్‌ను అడ్డుకున్నారు. అధికారులతో వాదనకు దిగారు. ఈ క్రమంలో వేదికపైకి ఎక్కిన ఓ సంఘం నేతపై పీఈటీ సంఘం నాయకుడొకరు వాగ్వాదానికి దిగారు. అధికారులపై ఒత్తిడి తేవడం ఏమిటని పీఈటీ సంఘం నాయకుడు మండిపడ్డాడు.  

హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయలేదు 
14, 15 జీఓల ఆధారంగా 2017లో పలువురు పండిట్లకు స్కూల్‌ అసిస్టెంట్లు (హిందీ)గా పదోన్నతులు     కల్పించారని, తమకు అర్హత ఉన్నా పదోన్నతులు కల్పించలేదని అప్పట్లో ఎంఎస్‌ అపర్ణ, దాదాఖలందర్, మురళీధర్, అబ్దుల్‌రజాక్, కరీం తదితర ఎస్జీటీలు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు వీరికి అనుకూలంగా తీర్పునిచ్చింది. కౌన్సెలింగ్‌ ప్రక్రియకు ముందే తమకు పదోన్నతులు కల్పించాలంటూ గత నెల 21న పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను జిల్లా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదంటూ బాధిత టీచర్లు వాపోయారు.  కొందరు ఉపాధ్యాయ సంఘాల నాయకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా 6వ తేదీ పదోన్నతులు కల్పిస్తామని పేర్కొన్నారు. 12.30 గంటల వరకు హెచ్‌ఎంల కౌన్సెలింగ్‌ ప్రారంభం కాలేదు. తీవ్ర గందరగోళంగా మారడంతో సాయంత్రానికి వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. చివరకు సాయంత్రం కౌన్సెలింగ్‌ నిర్వహించారు. జిల్లా పరిషత్‌ యాజమాన్యాల పాఠశాలల్లో 67 మందికి హెచ్‌ఎంలుగా పదోన్నతులు కల్పించారు. వీరిలో ఏడుగురు నాట్‌ ఆప్ట్‌ ఇచ్చారు.  

నేడు, రేపు స్కూల్‌ అసిస్టెంట్లకు పదోన్నతులు 
ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో ఎస్జీటీలుగా పని చేస్తూ స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులకు దరఖాస్తు చేసుకున్న వారికి గురువారం, శుక్రవారం కౌన్సెలింగ్‌ జరుగుతుంది. సైన్స్‌ సెంటరులో గురువారం గణితం, బయాలజికల్‌ సైన్స్, ఇంగ్లిష్, సోషల్‌ సబ్జెక్టులకు, 5న ఫిజికల్‌ సైన్స్, ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం, స్కూల్‌ అసిస్టెంట్‌ (పీఈ)తో పాటు ఇతర సబ్జెక్టులకు కౌన్సెలింగ్‌ ఉంటుందని ఇన్‌చార్జ్‌ డీఈఓ దేవరాజు తెలిపారు. సీనియార్టీ జాబితా మేరకు అర్హులైన ఉపాధ్యాయులు ఎస్‌ఆర్‌లతో హాజరుకావాలని సూచించారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top