భాషా పండితుల  పదోన్నతులపై ఫిర్యాదులు

Teachers Fight For Promotions In DEO Office  In Krishna  - Sakshi

సాక్షి,  మచిలీపట్నం(కృష్నా) : జిల్లా విద్యాశాఖలో పదోన్నతుల రగడ మొదలైంది. డీఈఓ కార్యాలయంలోని సిబ్బంది నిర్వాకం వల్ల అర్హులైనప్పటికీ, పదోన్నతులు దక్కటం లేదని కొంతమంది ఉపాధ్యాయులు నిరసన గళం విప్పారు. భాషా పండితుల పదోన్నతుల్లో అక్రమాలకు జరిగాయని ఆరోపిస్తూ, ఓ ఉపాధ్యాయుడు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ముందు సోమవారం గుండు గీయించుకొని నిరసన తెలిపాడు. ఈనెల 3, 4 తేదీల్లో ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్‌ల పదోన్నతులకు డీఈఓ కార్యాలయ అధికారులు అంతా సిద్ధం చేస్తున్న తరుణంలో ఇటువంటి పరిణామాలు చోటుచేసుకోవటం విద్యాశాఖ వర్గాల్లో సర్వత్రా చర్చనీయాంశమైంది. రెండేళ్ల తర్వాత జరుగుతున్న పదోన్నతుల ప్రక్రియతో వీటిని ఆశించే ఉపాధ్యాయుల్లో ఆనందం వ్యక్తమౌతున్నప్పటికీ, ఎక్కడ వివాదాలు చుట్టుకొని కౌన్సెలింగ్‌ నిలిచిపోతుందేమోననే భయం వారిని వెంటాడుతుంది.

రాష్ట్రంలో ఏర్పడిన నూతన ప్రభుత్వం ఉపాధ్యాయుల విన్నపాలను పరిగణలోకి తీసుకొని సర్వీసు రూల్స్‌కు లోబడి అర్హులైన వారిందరికీ అందుబాటులో ఉన్న ఖాళీల మేరకు అడహక్‌ పదోన్నతులు ఇవ్వాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. వివాదాల నేపథ్యంలో రెండేళ్లుగా పదోన్నతులు లేకపోగా, ప్రభుత్వం తాజా ఉత్తర్వులతో దీనిపై జిల్లా విద్యాశాఖాధికారులు కసరత్తు మొదలుపెట్టారు. స్కూల్‌ అసిస్టెంట్‌ నుంచి ప్రధానోపాధ్యాయులు, ఎస్జీటీ కేడర్‌ నుంచి స్కూల్‌ అసిస్టెంట్‌గా పదోన్నతులు కల్పించేందుకు సీనియార్టీ జాబితాలను సైతం విడుదల చేశారు. కొంతమంది ఎస్జీటీలు బీఈడీ మెథడాలజీ అర్హతతో పదోన్నతులు కల్పించాలని కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకోవటంతో, కలెక్టర్‌ ఆమోదంతో వారికి స్కూల్‌ అసిస్టెంట్‌లుగా పదోన్నతులు కల్పిస్తున్నామని చెప్పి, డీఈవో కార్యాలయ అధికారులు ఈనెల 27న కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

ఎస్సే ఉర్దూ–1,  తెలుగు–19, హిందీ –11 మందికి పదోన్నతులు ఇచ్చారు. వీటిపై భాషా పండితులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 05–02–2017 సంవత్సరానికి ముందు ఉన్న ఖాళీలను పరిగణలోకి తీసుకొని పదోన్నతులు ఇవ్వాలని, కానీ రద్దు అయిన జీవోలను అనుసరించి, నిబంధనలకు విరుద్ధంగా కొంతమందికి పదోన్నతులు కల్పించారని భాషోపాధ్యాయ సంస్థ జిల్లా అధ్యక్షులు కె సుబ్రహ్మణ్యేశ్వరరావు ఆధ్వర్యంలో పదిమంది భాషా పండితులు  డీఈఓ కార్యాలయానికి వచ్చి, అధికారులతో వాగ్వాదానికి దిగారు.  

గుండు గీయించుకొని నిరసన 
జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌లు బత్తుల సత్యనారాయణ, విజయలక్ష్మిలను కలసిన భాషా పండితులు, జరిగిన అన్యాయంపై వివరించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు, కమిషనర్‌ ఆదేశాలతో, కలెక్టర్‌ ఆమోదంతోనే అంతా జరిగిందని వారు ఉపాధ్యాయులకు తెలిపారు. దీనిపై ఎటువంటి సమాచారం లేకుండానే పదోన్నతులు ఇవ్వడటంలో ఆంతర్యమేమిటని వారు ప్రశ్నించారు. కొన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకుల అండ చూసుకొని, కార్యాలయంలోని కొంతమంది సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారని, దీనిపై తాము పెద్దఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కార్యాలయం ముందు నినాదాలు చేశారు. అధికారుల తీరుకు నిరసనగా, భాషోపాధ్యాయ సంస్థ జిల్లా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యేశ్వరరావు గుండు గీయించుకున్నాడు. ఆ తర్వాత స్పందనలో జిల్లా అధికారులకు దీనిపై వినతిపత్రాన్ని అందజేశారు.  

హెచ్‌ఎం, స్కూల్‌ అసిస్టెంట్‌ల పదోన్నతులు సవ్యంగా సాగేనా!
ఈ నెల 3న ప్రధానోపాధ్యాయులు, 4న స్కూల్‌ అసిస్టెంట్‌ల పదోన్నతుల కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 3,4,5 తేదీల్లో వీటిని నిర్వహిస్తామని  డీఈఓ కార్యాలయ అధికారులు ముందుగా ప్రకటించారు. తాజాగా వీటి షెడ్యూల్‌ మార్పు చేశారు. హెచ్‌ఎం పోస్టులు 51, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 350 వరకు ఖాళీలు ఉన్నట్లుగా డీఈఓ కార్యాలయ అధికారులు చెబుతున్నారు. 
కానీ సంబంధిత సెక్షన్‌లు చూసే సిబ్బంది వీటిపై స్పష్టత ఇవ్వకపోవటం, ఒక్కోసారి ఒక్కో రీతిన  ఖాళీల వివరాలను చెబుతుండటం, వాటిలోనూ మార్పులు ఉంటాయని అంటుండం ఉపాధ్యాయవర్గాల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కొంతమంది సిబ్బంది వ్యవహారశైలి డీఈఓకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఇటువంటి వాటిని చక్కదిద్దాల్సిన అవసరం ఉందని ఉపాధ్యాయులు అంటున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top