రెచ్చిపోయిన ‘పచ్చ’ నేతలు | TDP leaders over action | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన ‘పచ్చ’ నేతలు

Mar 1 2017 3:24 AM | Updated on Aug 10 2018 9:46 PM

చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డూఅదుపూ లేకుండా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు.

చిత్తూరులో ఎమ్మెల్సీ అభ్యర్థులపై దౌర్జన్యం.. నామినేషన్లు వేయకుండా దాడులు

సాక్షి, చిత్తూరు: చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డూఅదుపూ లేకుండా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. రెండురోజులుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్‌ వేసేందుకు వచ్చిన ప్రతి అభ్యర్థిపైనా దౌర్జన్యానికి పాల్పడ్డారు. నామినేషన్లకు చివరిరోజు మంగళవారం కూడా వారి ఆగడాలకు అంతులేకుండా పోయింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి నామినేషన్లు వేసేందుకు వచ్చిన స్వతంత్ర అభ్యర్థులను అడ్డుకునేందుకు విశ్వప్రయత్నం చేశారు. పెద్దమండ్యం ఎంపీపీ ప్రసాద్‌రెడ్డి నామినేషన్‌ వేసేందుకు మంగళవారం ఉదయం చిత్తూరు కలెక్టరేట్‌ వద్దకు రాగానే టీడీపీ నాయకులు ఆయనను కిడ్నాప్‌ చేశారు. ఆయనను టీడీపీ నాయకుడికి చెందిన ఓ  గ్రానైట్‌ క్వారీ ఆఫీసులో నిర్బంధించినట్టు తెలిసింది.

పెద్దమండ్యం మండలం కలిచెర్లకు చెందిన మరో అభ్యర్థి మస్తాన్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేసేందుకు కలెక్టరేట్‌ వెనుకనున్న గోడదూకి రావాల్సి వచ్చింది. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు వస్తున్నందున తనకు భద్రత కల్పించాలని వెదురుకుప్పం జెడ్పీటీసీ సభ్యుడు మాధవరావు రిటర్నింగ్‌ అధికారిని కోరారు. దీంతో ఆయన్ను చిత్తూరు నుంచి పోలీసు వాహనాల్లో కలెక్టరేట్‌కు తీసుకొచ్చారు. అయితే మాధవరావు ఉన్న పోలీసు వాహనంపై టీడీపీ నాయకులు దాడి చేశారు. ఆయన నామినేషన్‌ పత్రాల్లోని అఫిడవిట్‌ను చింపేశారు. దీంతో మరో వాహనంలో మాధవరావును నామినేషన్‌ వేసేందుకు పోలీసులు తీసుకెళ్లారు. నామినేషన్‌ వేసిన అనంతరం పోలీసు బందోబస్తుతో మాధవరావు చిత్తూరు నగరానికి చేరుకున్నారు. అనంతరం సొంత వాహనంలో తిరుపతికి బయలుదేరగా మార్గం మధ్యలో జిల్లాస్థాయి టీడీపీ నాయకులు దాడి చేసి బలవంతంగా ఆయన్ను తమ వెంట తీసుకువెళ్లారని తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement