పట్టణంలోని రాజీవ్‌నగర్‌లో అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలు ఎక్కువయ్యాయి.
► మిషనర్ ఇంటిని ఆక్రమించుకున్న టీడీపీ నాయకుడు
► అదేబాటలో పలువురు తెలుగు తమ్ముళ్లు
► రాజీవ్‌నగర్‌లో బలవంతుడిదే రాజ్యం
శ్రీకాళహస్తి : పట్టణంలోని రాజీవ్‌నగర్‌లో అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలు ఎక్కువయ్యాయి. మున్సిపల్ కమిషనర్ నిర్మించుకున్న ఇంటిని(పెద్దభవనం) పట్టణంలోని ఒక ప్రధాన నాయకుడి అనుచరుడు ఆక్రమించుకుని అద్దెకు ఇచ్చాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సదరు అధికారి గతంలో శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్‌గా ఉన్న సమయంలో రాజీవ్‌నగర్‌లో ప్రభుత్వ భూములకు పట్టాలు ఇవ్వడమేగాక ప్రభుత్వ నిధులతో రోడ్లు ఏర్పాటు చేశారు. అదే తరుణంలో ఆ అధికారి మూడు పట్టాలు స్వాధీనం చేసుకుని మూడు ఇళ్లు నిర్మించుకున్నారు.
రెండు ఇళ్లు బినామీ పేర్లతో, ఒకటి మాత్రం ఆయన పేరుతోనే పెద్ద భవంతి నిర్మించుకున్నారు. ఆయన కమిషనర్‌గా ఉన్నంత కాలం ఎవరూ వాటి జోలికి పోలేదు. బదిలీ అయిన తర్వాత బినామీ పేర్లతో ఉన్న ఇళ్లను ఇద్దరు టీడీపీ నాయకులు ఆరు నెలల క్రితం ఆక్రమించారు. కమిషనర్ పలువురు కాంగ్రెస్ నాయకులకు మొరపెట్టుకున్నా అధికారం టీడీపీ వాళ్లదే కావడంతో ఏమీ చేయలేకపోయారు. తాజాగా ఆయన పేరుతో ఉన్న పెద్ద భవంతిని సైతం టీడీపీ ప్రధాన నాయకుడి అనుచరుడు ఆక్రమించుకుని అద్దెకు ఇచ్చారు.
కమిషనర్ అప్పట్లో అక్రమంగా పట్టాలు పొందడమేగాక రోడ్డు ఏర్పాటు చేసే సమయంలో కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్లతో ఇళ్లు నిర్మించారనే ఆరోపణలున్నాయి. కమిషనర్ చేసింది తప్పే..అయితే టీడీపీ నాయకులు చేస్తున్నది ఒప్పా అంటూ సామాన్యులు బాహా టంగానే విమర్శలు చేస్తున్నారు. ప్రధాన నాయకులే అలా చేస్తుండడంతో పలువురు తెలుగు తమ్ముళ్లు అదే బాటలో నడుస్తున్నారు. ఈ విషయంలో అవసరమైతే టీడీపీ నాయకుడిపై కేసు పెట్టేపనిలో కమిషనర్ ఉన్నట్లు తెలుస్తోంది.