
అంబాజీపేట: ఐదేళ్ల క్రితం పట్టాలు ఇచ్చారే తప్ప స్థలాలు చూపించలేదు.. ఇప్పుడు నోటీసులు ఇచ్చి ఆ పట్టాలు వెనక్కి తీసుకుంటున్నారని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అనపర్తి ఇందిరానగర్‌కు చెందిన పలువురు మహిళలు ఫిర్యాదు చేశారు. బిక్కవోలులో జననేతను ప్రజా సంకల్పయాత్రలో వారు కలిసి ఈమేరకు వినతిపత్రం అందజేశారు. ఐదేళ్ల క్రితం సుమారు 1,400 మంది నిరుపేదలకు పట్టాలు ఇచ్చారన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత లబ్ధిదారులకు స్థలాలు చూపించలేదన్నారు.
గృహ నిర్మాణాలకు రుణాలు మంజూరు చేయిస్తున్నామంటూ అధికారులు, అధికార పార్టీ నాయకులు మభ్య పెట్టి పట్టాలు తీసుకున్నారని తెలిపారు. రుణాలు మంజూరైనా గృహ నిర్మాణం చేపట్టనందున స్థలాలు రద్దు చేస్తున్నట్టుగా నోటీసులు ఇచ్చారన్నారు. అర్హులైన తమ నుంచి మోసం చేసి పట్టాలు తీసుకుని వారికి అనుకూలమైన వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని జననేత వద్ద వాపోయారు.
ఈ విషయంపై జిల్లా కలెక్టర్, తహసీల్దార్‌కు లిఖిత పూర్వకంగా తెలియజేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. కాలనీలోని సామూహిక మరుగుదొడ్లను టీడీపీ నాయకులు దౌర్జన్యంగా తొలగించారన్నారు. తాగునీరు లేకపోవడంతో మురికినీటినే తాగి రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన తమ పట్టాలు ఇప్పించి గృహనిర్మాణాలు చేపట్టేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వారు కోరారు.