రేషన్‌ డిపోల వద్ద ప్రభుత్వ ప్రచారార్భాటం

TDP Govt campaign at Ration Depots - Sakshi

వినియోగదారుల దినోత్సవం పేరిట అవగాహన సదస్సులు

ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఊదరగొట్టాలని ఆదేశాలు

వినియోగాదారుల సంక్షేమ నిధి నుంచి రూ.59.98 లక్షలు మళ్లింపు

కోడ్‌ ఉల్లంఘిస్తున్న ప్రభుత్వ తీరుపై ఎన్నికల కమిషన్‌ ఆగ్రహం

తక్షణమే నిలిపేయాలని ఆదేశం..చర్యలు తప్పవని హెచ్చరిక

సాక్షి, విశాఖపట్నం:  ఏ చిన్న అవకాశం వచ్చినా, చిక్కినా వదలని ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ప్రపంచ వినియోగదారుల దినోత్సవాలను సైతం తన ప్రచారానికి వాడేసుకుంటున్నారు. ఐదేళ్ల పదవీ కాలంలో ఏనాడు వినియోగదారుల హక్కుల రక్షణ ఊసెత్తని టీడీపీ ప్రభుత్వం.. మార్చి 15వ తేదీన ప్రపంచ వినియోగదారుల దినోత్సవం రోజున రేషన్‌ డిపోల్లో కార్డుదారులను సమీకరించి అవగాహన కల్పించాలని తలపోశారు. ఎగ్జిబిషన్లు, వర్క్‌షాపులు, ప్రసార మాద్యమాల ద్వారా వినియోగదారుల సంఘాలు, స్వచ్చంద సంస్థల భాగస్వామ్యంతో ప్రచారం చేయాలని రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన డి.వరప్రసాద్‌ సీఎం ఆదేశాల మేరకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా పౌరసరఫరాల శాఖ, సంస్థ అధికారులతో షెడ్యూల్‌కు ఒక రోజు ముందు అమరావతిలో సమావేశం నిర్వహించారు కూడా. కొన్నేళ్లుగా చేతి చమురు వదిలించుకుని వినియోగదారుల హక్కుల రక్షణ కోసం పనిచేస్తున్న వినియోగదారుల సంఘాలను ప్రభుత్వం ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదు.కొన్ని ఫోరాలకు శాశ్వత భవనాల్లేక అద్దె భవనాల్లోనే కోర్టులు నడుస్తున్నాయి.

ఫోరాల అధ్యక్షులు, సభ్యుల పోస్టులు ఖాళీగా ఉన్నా పట్టించుకోలేదు. 2014 నుంచి రాష్ట్ర వినియోగదారుల సమాచార కేంద్రం ప్రారంభానికి కూడా నోచుకోలేదు. ఏటా నిర్వహించాల్సిన కార్యక్రమాలను తెలియజేసే ఇయర్‌ క్యాలెండర్‌ ఏనాడు రూపొందించిన పాపాన పోలేదు. ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన చంద్రన్న సంక్రాంతి, క్రిస్మస్‌ కానుకలు, రంజాన్‌ తోఫా తదితర పథకాలతో పాటు ఇతర ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేసుకునేందుకు గడచిన ఐదేళ్లలో తొలిసారి ఈ ఏడాది అవగాహనా సదస్సులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడం విమర్శలకు తావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 29,990 రేషన్‌ డిపోల ద్వారా కోటి 42 లక్షల 27వేల 455 కుటుంబాలకు ప్రభుత్వం నిత్యావసర సరుకుల సరఫరా చేస్తోంది.

ఆయా డిపోలన్నింటి వద్ద ఎన్నికల ప్రచారం కోసం ఒక్కో కార్డుదారునికి రూ.200  చొప్పున రూ.59.98లక్షలు మంజూరు చేసింది. పైగా ఈ నిధులను రాష్ట్ర వినియోగదారుల సంక్షేమ నిధి నుంచి మళ్లించింది. సంక్షేమ నిధిలో రూ.1.35 కోట్లు ఉన్నాయి. కోడ్‌ అమలులో ఉన్న సమయంలో ఈ విధంగా దొడ్డి దారిన ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రచారం కోసం వినియోగదారుల సంక్షేమ నిధి నుంచి మళ్లించడంపై  సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్ర ప్రభుత్వ బాగోతంపై విశాఖకు చెందిన పలువురు డీలర్లు, సామాజిక కార్యకర్తలకు ఫిర్యాదు చేయడంతో ఎన్నికల కమిషన్‌ సీరియస్‌గా తీసుకుంది. దొడ్డిదారిన చంద్రబాబు ప్రచారానికి ఎన్నికల కమిషన్‌ బ్రేకులు వేసింది. తక్షణం ఈ ఉత్తర్వులు నిలుపుదల చేయాలని, అవగాహనా సదస్సుల పేరిట ప్రభుత్వ పథకాల ప్రచారాన్ని నిలిపి వేయాలని లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది.

ఐదేళ్లలో ఏనాడయినా పట్టించుకున్నారా?..
వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం గడచిన ఐదేళ్లలో ఏనాడు  ప్రయత్నం చేయలేదు. పైసా ఖర్చు చేయలేదు. వినియోగదారుల ఫోరంలను పట్టించు కోలేదు. కానీ ఇప్పుడు దొడ్డిదారిన తమ పథకాలను ప్రచారం చేసుకునేందుకు సంక్షేమ నిధి నుంచి నిధులు దారిమళ్లించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయమనడం దారుణం. కోడ్‌ అమలులో ఉన్న సమయంలో ఇలాంటివి  సముచితం కాదు..ఫిర్యాదులు అందగానే ఎన్నికల కమిషన్‌ యాక్షన్‌ తీసుకోవడం అభినందనీయం.  
–కాండ్రేగుల వెంకటరమణ, సమాచార హక్కు ఉద్యమ కర్త 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top