రాజధాని పేరిట దారుణ దోపిడీ

రాజధాని పేరిట దారుణ దోపిడీ - Sakshi


ఈ పాపంలో మంత్రులు, అధికారుల కోటరీకీ పాత్ర

చిట్ఫండ్ మోసం కంటే ఇది మరింత దారుణం

రీడిఫ్ ఇంటర్వ్యూలో రిటైర్డ్ ఐఏఎస్ ఎంజీ దేవసహాయం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కృష్ణానదీ తీరాన సింగపూర్‌ లాంటి కళ్లు చెదిరే రాజధాని నగరాన్ని నిర్మిస్తానని చెబుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ప్రభుత్వం.. భూసేకరణ పేరిట పేద రైతుల పొట్టగొడుతోందని, భవిష్యత్తులో ధనరాశులు కురిపిస్తామంటూ భ్రమలు కల్పిస్తూ సస్యశ్యామలమైన, అత్యంత సారవంతమైన వ్యవసాయ భూములను దాదాపు ఉచితంగానే లాక్కుంటోందని  చండీగఢ్ నిర్మాణానికి ప్రణాళిక బాధ్యతలు నిర్వహించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎంజీ దేవసహాయం ఆరోపించారు. ఈ పాపంలో ప్రభుత్వంలోని మంత్రులు, అధికారుల కోటరీకి పాత్ర ఉందని ఆయన విమర్శించారు. జాతీయ ప్రజా ఉద్యమాల కూటమి తరఫున రాష్ట్ర ప్రతిపాదిత రాజధాని నగరం ప్రాంతంలోని 29 గ్రామాలను ఇటీవల సందర్శించిన నిజనిర్ధారణ కమిటీకి ఆయన నేతృత్వం వహించారు. నిజనిర్ధారణ కమిటీ కొత్త రాజధాని పేరిట జరగుతున్న దారుణ దోపిడీ గురించి రైతులు, వ్యవసాయ కూలీలు , రైతు సంఘాల నాయకులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, వివిధ కుల సంఘాల నాయకులను కలుసుకొని వారి అభిప్రాయాలను సేకరించింది. ఈ సందర్భంగా రీడిఫ్.కామ్ తరఫున జర్నలిస్ట్  శోభా వారియర్, ఎంజీ దేవసహాయంను ఇంటర్వ్యూ చేశారు. కొత్త రాజధాని కోసం భూ సేకరణ పేరిట జరుగుతున్న దందా తెల్లారేసరికి బోర్డు తిప్పేసే ఓ చిట్‌ఫండ్ కంపెనీ మోసం కన్నా పెద్దదని ఆయన అభివర్ణించారు. ప్రజలను నమ్మించడానికి చిట్‌ఫండ్ కంపెనీ వాళ్లు కొంత డబ్బైనా ఇస్తారని, బాబు అండ్ పార్టీ అదీ చేయడంలేదని ధ్వజమెత్తారు.రీడిఫ్. కామ్‌తో ఆయన పంచుకున్న అభిప్రాయాలను ఆయన మాటల్లోనే....ప్ర: కొత్త రాజధాని కోసం కృష్ణానదీ తీరాన 30 వేల ఎకరాలను సేకరించాలనే చంద్రబాబు అలోచన గురించి మీరేమనుకుంటున్నారు?

జ: ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందీ ఆయన మాట్లాడుతుందీ 30 వేల ఇటుకల గురించి కాదు. 30 వేల ఎకరాల వ్యవసాయ భూముల గురించి. 30 వేల ఎకరాలు దేనికన్నది నా మొట్ట మొదటి ప్రశ్న. ఎలాంటి రాజధానిని ఆయన నిర్మించాలనుకుంటున్నారు. అదీ ఎవరి కోసం? ఎవరైనా ఇల్లు కట్టాలనుకుంటే ముందుగా అందులో ఎంతమంది నివసిస్తారన్నది ఆలోచిస్తారు. వారికి ఎలాంటి సౌకర్యాలు ఉండాలని యోచిస్తారు. నలుగురు సభ్యులుండే చిన్న కుటుంబానికి నాలుగు పడక గదులుండే ఇల్లు అవసరం లేదుకదా! నలుగురు సభ్యుల కుటుంబం కోసం పది ఎకరాల స్థలం అవసరం లేదు కదా! ఎవరైనా కుటుంబ సభ్యుల అవసరాలకు అనుగుణంగా ప్లాట్ సైజును అంచనా వేస్తారు. ఇక్కడ రాజధాని నగరం నిర్మాణం కోసం జరుగుతున్నది వేరు. ముందుగా సాధ్యాసాధ్యాల గురించి విశ్లేషణ జరగాలి. అది జరగలేదు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ చట్టం కింద భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికలో కొత్త రాజధాని నిర్మాణం అవసరమే లేదని చెప్పింది. శివరామకృష్ణన్ చాలా సీనియర్ ఐఏఎస్ అధికారి, పట్టణ ప్రణాళికలో అనుభవం ఉన్న నిపుణుడు. ఆయన కమిటీలో కూడా ముగ్గురు, నలుగురు అనుభజ్ఞులైన ప్రముఖ సిటీ ప్లానర్లు ఉన్నారు. అలాంటి కమిటీయే కొత్త రాజధాని నిర్మాణం అవసరం లేదని అభిప్రాయపడింది. ఇంత భారీ ప్రాజెక్టు చేపట్టినప్పుడు గాలి, నీరు, చెట్టూ చేమపై పర్యావరణ ప్రభావం ఎలా ఉంటుందన్న అంశంపై విశ్లేషణ జరగాలి. అదీ జరగలేదు.ప్ర: రాజధాని నగరం ప్రతిపాదన గురించి మీరు విన్నప్పుడు మీ తొలి స్పందన ఎలా ఉంది?

జ: దిగ్భ్రాంతి చెందాను. ఊహాజనిత రియల్ ఎస్టేట్ వల్ల అక్కడ భూముల ధరలు కృత్రిమంగా పెరిగాయి. గతంలో లక్ష రూపాయలకు అమ్ముడుపోయిన ఎకరం ధర ఇప్పుడు కోటి రూపాయల నుంచి రెండు కోట్ల వరకు పలుకుతోంది. దీనివల్ల నిజంగా లాభపడుతోంది ల్యాండ్ మాఫియానే. ఇక వ్యవసాయ భూములకు కాలంచెల్లిందంటూ రైతులను మోసం చేస్తున్నారు.ప్ర:సారవంతమైన వ్యవసాయ భూములను కాంక్రీట్ జంగిల్‌గా మార్చడం పెద్ద మోసమని భావిస్తున్నారా ?

జ:ఇది అతిపెద్ద మోసం. ఓ చిట్‌ఫండ్ కంపెనీ చేసే మోసం కన్నా పెద్దది. కాసులు కురిపిస్తామంటూ ఉచితంగానే భూములు లాక్కుంటున్నారు. నిజ నిర్ధారణ కమిటీ తరఫున నేను అక్కడికి వెళ్లినప్పుడు మాకు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం తెల్సింది. ఏపీ ప్రభుత్వం సేకరించాలనుకుంటున్న భూమిలో మూడోవంతు దేశంలోనే అత్యంత సారవంతమైన భూమి. వందకు పైగా రకాల పంటలను పండించే భూమని తెలుసుకున్నాం.ప్ర: సింగపూర్ నుంచి ప్రణాళికా నిపుణులను పిలిపించడాన్ని మీరెలా భావిస్తున్నారు? 

జ: సింగపూర్ నుంచి జరుగుతున్న నల్లడబ్బు లావాదేవీలుగా నేను భావిస్తున్నాను. ఇప్పుడు సింగపూర్ నల్ల డబ్బుకు స్వర్గధామంగా మారింది.ప్ర: వ్యవసాయాధారమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సింగపూర్ లాంటి అర్బన్ సిటీ ఎలా నమూనా అవుతుందని అందరు ప్రశ్నిస్తుంటారు. దానికి మీ సమాధానం ?

జ:అదే ప్రశ్న నేను కూడా అడుగుతూ ఉన్నాను. వారేమంటారంటే.. వ్యవసాయం చిన్న ఆదాయవనరు. పేద ప్రజలు మాత్రమే చేస్తారు. ధనిక కుటుంబాలు, సంపన్నులు, గౌరవప్రదమైన ప్రజలు నగరాల్లో నివసిస్తారు. వారికి రేస్ కోర్సులు, క్యాసినోలు, మాల్స్‌ లాంటి సదుపాయాలు కావాలట. వారు ఆహారం తినకుండా కేవలం విస్కీ తాగి బతుకుతారనుకుంటా! ఏదేమైనా ఓ నది ఒడ్డున నగరాన్ని నిర్మించడం మాత్రం క్షమించరాని నేరం.ప్ర: మీ నిజనిర్ధారణ కమిటీ కనుగొన్న ఇతర అంశాలేమిటి?

జ: భూసేకరణ పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి చట్టబద్ధత లేదని మా కమిటీ కనుగొన్నది. ఈ విషయాన్ని మేము ఏపీ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లాం. తప్పుదోవ పట్టిన ప్రభుత్వ వైఖరిని సంపూర్ణంగా మార్చుకోవాలని చెప్పాం. తమ ప్రణాళికలేంటో పారదర్శకంగా ప్రజల ముందుపెట్టి చర్చించాలని, ఈ ప్రక్రియంతా చట్టబద్ధంగా జరగాలని సూచించాం. బడా వ్యాపారవేత్తలు, ల్యాండ్ మాఫియా కొమ్ముకాయడం వదిలేసి, రైతులతోపాటు భూములులేని స్థానిక ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయాలని సూచించాం. భూ సేకరణ కోసం రైతులతో సంతకాలు చేయించడం కోసం వారి గ్రామాలకు పోలీసులను పంపించేందుకు వీలుగా గత నెలలో ఓ చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. మేమిదంతా గమనిస్తున్నాం. మంత్రులు, అధికారుల కోటరీయే కాదు, మొత్తం టీడీపీ సభ్యులు నల్ల కుబేరులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రభావంలో ఉన్నారు.ప్ర: ఇవేమీ పట్టించుకోకుండా కొత్త రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు అలాగే ముందుకెళితే మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు?

జ: బాధిత ప్రాంతాల్లో ప్రజా నిరసన కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నాం. అలాగే చట్టపరంగా పోరాడేందుకు మూడు వేదికలున్నాయి. ఒకటి...బాధిత ప్రాంతాల్లో ప్రజల మానవ హక్కులను కాలరాస్తున్నందుకు, వారికి భుక్తి మార్గం లేకుండా చేస్తున్నందుకు మానవ హక్కుల కమిషన్ వద్దకు వెళ్లడం. రెండోది.....పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని అడ్డగోలుగా ఉల్లంఘిస్తున్నందున గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్లడం. మూడోది...భారత రాజ్యాంగాన్ని, భూ సేకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నందున హైకోర్టు, సుప్రీం కోర్టులకు వెళ్లి ప్రజల తరఫున పోరాటం జరపడం.

 

ప్ర: చండీగఢ్ ప్రణాళికలో పాల్గొన్న మీరు ఇక్కడి రాజధాని గురించి ఏం చెబుతారు?

జ: చండీగఢ్ 15 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉంది. తక్కువ ఎత్తైన భవనాలు. తక్కువ జన సాంద్రత. జనాభా కూడా తక్కువే 11 లక్షలు. ఏపీలో జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది కనుక నాయుడు ఎత్తైన భవనాలు నిర్మించవచ్చు పాలనాపరమైన రాజధానిలో రెండు, మూడు లక్షల మందికి మించి ఉండరు. కొత్త రాజధాని నిర్మిస్తే ఎంతమంది ప్రభుత్వోద్యోగులు అక్కడికెళతారు. 25-30 వేల లోపే ఉంటారు.ప్ర: ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచస్థాయి రాజధాని నగరాన్ని నిర్మించాలనుకుంటే చంద్రబాబుకు మీరిచ్చే సలహా ఏమిటి?

జ: ఆయనకు నేనిచ్చే సలహా ఏమీ లేదు. ఆయనకు ఏ సలహా అవసరం లేదని ఆయనే చెప్పుకున్నారు.

- రీడిఫ్.కామ్ సౌజన్యంతో..


రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎంజీ దేవసహాయం ఆరోపించారు.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top