అమరావతిలో అలజడికి కుట్రలు..

TDP Conspiracy To Create Unrest In Amaravati - Sakshi

సాక్షి, విజయవాడ : రాష్ట్ర సమగ్రాభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించి సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో.. అమరావతిలో అలజడి సృష్టించేందుకు అసాంఘిక శక్తులు కుట్రలకు పాల్పడుతున్నాయి. జేఏసీ ముసుగులో కుట్రలకు పన్నాగం చేస్తున్నారని ఇంటెలిజెన్స్‌ అధికారులకు పక్కా సమాచారం అందింది. ఈ మేరకు కొన్ని పార్టీలు రాజధాని గ్రామాల్లోకి ఇతర ప్రాంతాలవారిని రప్పిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అల్లర్లకు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చేటప్పుడు వారిపై దాడి చేసేందుకు కుట్ర చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రాళ్ల దాడులు, భౌతిక దాడులకు తెగబడేలా వారికి టీడీపీ డైరెక్షన్స్‌ ఇస్తున్నట్టుగా సమాచారం.

ఈ మేరకు రాజధాని గ్రామాల్లో నివాసముండేలా టీడీపీ నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఘర్షణ వాతావరణం సృష్టించేందుకు వ్యుహాలు రచిస్తున్నారు. టీడీపీ నేతల వైఖరితో రాజధాని గ్రామాల ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఈ కుట్రలోకి మమ్మల్ని ఎందుకు లాగుతున్నారంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటెలిజన్స్‌ సమాచారంతో అలర్ట్‌ అయిన పోలీస్‌ యంత్రాంగం.. రాజధాని గ్రామాల్లో ఇతరులు ఉండకూడదని ఆదేశాలు జారీచేసింది. ఎప్పటిలాగే అసెంబ్లీ సమావేశాలకు సెక్షన్‌ 144, సెక్షన్‌ 30 అమలులోకి తీసుకొచ్చారు. ర్యాలీలు, ముట్టడులు, జైల్‌భరో, ఆందోళనలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. శాంతిభద్రతల దృష్ట్యా ఆందోళనకారులను ముందస్తు అరెస్టులు చేయాలని నిర్ణయించారు. రాజధాని గ్రామాల్లో ప్రశాంతతకు అదనపు బలగాలను మోహరించారు.

పోలీసులకు సహకరించాలి : వినీత్‌ బ్రిజ్‌ లాల్‌
అసెంబ్లీ సమావేశాల భద్రత ఏర్పాట్లపై గుంటూరు రేంజ్‌ ఐజీ వినీత్‌ బ్రిజ్‌ లాల్‌ మీడియాతో మాట్లాడుతూ.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయని తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీలు, జేఏసీ చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయని.. ఈ నేపథ్యంలో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించినట్టు చెప్పారు. వ్యక్తిగత పనులపైన అసెంబ్లీకి వచ్చేవారు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. అలాగే అసెంబ్లీ పరిసర ప్రాంతాల వైపు వెళ్లే సామాన్య ప్రజలు పలు జాగ్రత్తలు పాటించవల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ప్రజలు పోలీసులుకు సహకరించాల్సిందిగా కోరారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top