చీరాలలో టీడీపీ నేతల రిగ్గింగ్‌..

TDP Activists Rigging In Elections At Cheerala - Sakshi

రూరల్‌ మండలంలో వైఎస్సార్‌ సీపీ నేతలపై దాడులు

పోలింగ్‌ కేంద్రాల్లోకి వెళ్లి రిగ్గింగ్‌కు పాల్పడిన బలరాం అనుచరులు

ప్రేక్షకపాత్రలో పోలీసులు

సాక్షి, చీరాల (ప్రకాశం): తెలుగుదేశం పార్టీ నాయకులు ఓటమి భయంతో చీరాలలో అడ్డదారులు తొక్కారు. వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. టీడీపీ అభ్యర్థి కరణం బలరాం అనుచరులు రూరల్‌ గ్రామాల్లో అరాచకాలకు పూనుకున్నారు. సీసీ కెమేరాల సాక్షిగా పోలీసుల కళ్లముందే పోలింగ్‌ కేంద్రాల్లోకి చొరబడి వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లపై దాడులు చేసి బయటకు పంపించారు. దేవినూతల, పిట్టువారిపాలెం, తదితర ప్రాంతాల్లో వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరుల ఓటర్ల స్లిప్పులు లాక్కుని వారే వెళ్లి ఓట్లు వేసుకుని రిగ్గింగ్‌ చేశారు. వైఎస్సార్‌ సీపీ వర్గీయులు పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు కనీసం స్పందించకుండా అధికార పార్టీ నేతలకే వత్తాసు పలికారు.

అరాచకాలకు పాల్పడుతున్న టీడీపీ కార్యకర్తలను, బలరాం అనుచరులను ఒక్కమాట కూడా అనలేదు. పోలింగ్‌ మొదలైన రెండు గంటలకే పిట్టువారిపాలెంలో వైఎస్సార్‌ సీపీ ఏజెంట్‌ను టీడీపీ కార్యకర్తలు బయటకు వెళ్లిపోవాలని, లేకుంటే చంపేస్తామని బెదిరించారు. అధికారుల ముందే రాయి తీసుకుని కొట్టి బయటకు తీసుకువచ్చారు. తాను ఏజెంట్‌ను అని చెప్పినా వినకుండా మాకే ఎదురొస్తావా అంటూ ఇష్టారాజ్యంగా కొట్టారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. సమాచారం అందుకున్న రూరల్‌ ఎస్‌ఐ చంద్రశేఖర్‌ తలకు టీడీపీ నాయకులు వేసిన రాయి తగిలి రక్తగాయమైంది. సంఘటన స్థలానికి డీఎస్పీ యు.నాగరాజు, ఇద్దరు ట్రైనీ ఎస్పీలు, సిబ్బంది రావడంతో టీడీపీ నాయకులు పరారయ్యారు. 

దేవినూతలలో రిగ్గింగ్‌...
దేవినూతలలోని పోలింగ్‌ బూత్‌లో ఒకే ఒక్క కానిస్టేబుల్‌ ఉండటంతో అక్కడ టీడీపీ నాయకులు అరాచకం సృష్టించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏజెంట్‌ను కొట్టి బయటకు పంపి పోలింగ్‌ కేంద్రాన్ని మూసివేసి ఓటర్ల వద్ద స్లిప్పులు లాక్కుని రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ప్రశ్నించిన వైఎస్సార్‌ సీపీ ఏజెంట్‌పై దాడికి దిగారు. పోలీసులకు సమాచారం ఇచ్చినా అక్కడకు వెళ్లకపోవడంతో టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ప్రజల ఓటర్ల స్లిప్పులను టీడీపీ నాయకులు లాక్కుని ఓట్లు వేశారంటే టీడీపీ నేతలు ఎంత బరితెగించారో అర్థం చేసుకోవచ్చు. గవినివారిపాలెంలో కూడా పోలింగ్‌ బూత్‌లో ఉన్న వైఎస్సార్‌ సీపీ ఏజెంట్‌పై దాడికి పాల్పడ్డారు.

పోలింగ్‌ అధికారిపై దాడికి యత్నం...
చీరాల పట్టణంలోని 29వ వార్డులో గల హరిప్రసాద్‌నగర్‌లో 84వ పోలింగ్‌ కేంద్రంలో టీడీపీ నాయకులు ఏజెంట్లపై దాడికి యత్నించారు. ఓటు వేయడానికి వచ్చిన ఓ వృద్ధురాలి విన్నపం మేరకు ఆమె సూచించిన పార్టీ అభ్యర్థికి పోలింగ్‌ అధికారి ఓటు వేయించారు. అయితే, ఆ అధికారి ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయించారంటూ దాడికి యత్నించారు. ఈ ఘటనపై టీడీపీ అభ్యర్థి కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్, అతని అనుచరులు హరిప్రసాద్‌నగర్‌లో హల్‌చల్‌ చేశారు

.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top