అనుమానాస్పదంగా వివాహిత మృతి

 మృతురాలి తండ్రితో మాట్లాడుతున్న పోలీసులు, నీలిమ(ఫైల్‌) - Sakshi

భర్తపైనే అనుమానాలు..

మార్కొండపుట్టిలో విషాదఛాయలు

మక్కువ : మండలంలోని మార్కొండపుట్టికి చెందిన బొంగు నీలిమ (20) గురువారం అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. పోలీసులు, కుటంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... మక్కువ మండలం మార్కొండపుట్టి గ్రామానికి చెందిన బొంగు బాషా, సూరీడమ్మ దంపతుల కుమార్తె నీలిమకు పార్వతీపురం మండలంలోని నర్శిపురం గ్రామానికి చెందిన  కెంగువ సింహాచలం అలియాస్‌ బుజ్జితో 2017 మే నెలలో వివాహమైంది.

భర్త సింహాచలం తాపీమేస్త్రిగా పనిచేస్తున్నాడు. పెళ్లయిన కొన్నాళ్లు బాగానే ఉన్నప్పటికీ, కొద్ది నెలలుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో నీలిమ విసుగుచెందిన మూడు నెలల కిందట కన్నవారింటికి వచ్చింది. భర్త సింహాచలం మూడు రోజుల కిందట మార్కొండపుట్టి గ్రామానికి చేరుకుని నీలిమను కాపురానికి పంపించాలని అత్తమామలను కోరాడు.

అయితే  మీ తల్లిదండ్రులను తీసుకువస్తేనే కుమార్తెను పంపిస్తానని నీలిమ తల్లిదండ్రులు అల్లుడు సింహాచలంనకు స్పష్టం చేశారు. దీంతో చేసేదిలేక సింహాచలం అత్తవారింటే ఉంటున్నాడు. ఈ క్రమంలో నీలిమ తండ్రి బాషా గురువారం మధ్యాహ్నం ఇంటికి చేరుకునే సరికి విగతజీవిగా పడి ఉంది. చున్నీతో గొంతు నులిమేసినట్లు ఉండడంతో ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

భర్తపైనే అనుమానాలు..?

భార్యను తనతో పంపించకపోవడంతో సింహాచలమే కక్ష గట్టి మెడకు చున్నీ బిగించి నీలిమను హత్య చేసి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విషయం తెలుసుకున్న ఏఎస్పీ దీపికపాటిల్, సీఐ సయ్యిద్‌ అలియాస్‌ మహ్మద్, ఎస్సై కృష్ణప్రసాద్‌ సంఘటనా స్థలానికి చేరుకొని మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులు, గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు.

అలాగే మృతురాలి భర్త సింహాచలంను విచారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సాలూరు సీహెచ్‌సీకి తరలించారు. ఎస్సై కృష్ణప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top