
మంత్రి పదవికి శ్రీధర్ బాబు రాజీనామా
మంత్రి శ్రీధర్ బాబు తన పదవికి రాజీనామా చేశారు.
హైదరాబాద్:మంత్రి శ్రీధర్ బాబు తన పదవికి రాజీనామా చేశారు. దీనికి సంబంధించి ఆయన గురువారం రాత్రి తన రాజీనామా లేఖను వ్యక్తిగత కార్యదర్శి ద్వారా సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి అందజేశారు.తన మంత్రి పదవికి రాజీనామా చేసే విషయంలో మంత్రి శ్రీధర్ బాబు తర్జన భర్జన పడిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా తనను తప్పించడంపై అసంతృప్తికి గురైన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు.. ఆయన సహచరులతో చర్చించిన తర్వాతే రాజీనామా లేఖను సీఎంకు పంపారు.
ముఖ్యమంత్రి తీరు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేలా ఉందని, ఆ దిశగా ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాలకు నిరసనగా కూడా శ్రీధర్‌బాబు ఈ నిర్ణయానికి వచ్చారు. వాస్తవానికి మంత్రి బుధవారమే రాజీనామాకు సిద్ధ మయ్యారు. అయితే సహచర సీనియర్ మంత్రులు జానారెడ్డి, పొన్నాల తదితరులు రాజీనామా చేయొద్దని వారించడంతో కొంత సంశయంలో పడ్డారు. తెలంగాణ ఏర్పాటు తుది దశకు చేరిన తరుణంలో రాజీనామా చేస్తే అసెంబ్లీలో విభజన బిల్లు చర్చపై ప్రభావం చూపుతుందని చెప్పి ఆ మంత్రులు శ్రీధర్‌బాబును బుజ్జగించారు. కానీ శ్రీధర్‌బాబు మాత్రం తన పట్ల సీఎం వ్యవహరించిన తీరును జీర్జించుకోలేక రాజీనామా చేశారు.